భారత్ వరుస విజయాల వెనుక అసలు రహస్యం...!
వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ వరుస విజయాల జైత్రయాత్ర వెనుక అసలు రహస్యం ఏమిటో తేటతెల్లమయ్యింది.
వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ వరుస విజయాల జైత్రయాత్ర వెనుక అసలు రహస్యం ఏమిటో తేటతెల్లమయ్యింది.
భారతగడ్డ పై నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఆతిథ్య భారతజట్టు మొదటి ఎనిమిదిరౌండ్లలోనే నూటికి నూరుశాతం విజయాలతో 10 జట్ల లీగ్ టేబుల్ లో తిరుగులేని టాపర్ గా నిలిచింది. ఇప్పటికే సెమీస్ చేరిన తొలిజట్టుగా నిలిచిన రోహిత్ సేన వరుసగా 9వ విజయంతో రౌండ్ రాబిన్ లీగ్ దశ పోటీలను ఆల్ విన్ రికార్డుతో ముగించాలన్న పట్టుదలతో ఉంది.
ఇటు బ్యాటింగ్ లో...అటు బౌలింగ్ లో!
వన్డే క్రికెట్లో ..ప్రధానంగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఓ జట్టు విజయవంతం కావాలంటే బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ నిలకడగా రాణించితీరక తప్పదు. ఆటలోని వివిధ దశల్లో మ్యాచ్ పై పట్టు కొనసాగిస్తూ ఉండితీరాలి. ప్రధానంగా పవర్ ప్లే ( మొదటి 10 ఓవర్లు), మిడిల్ ఓవర్లు ( 11 నుంచి 40ఓవర్లు ), డెత్ ఓవర్లలో ( 41 నుంచి 50) అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లే విజయవంతం కాగలుగుతాయి.
ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగిన 40కి పైగా లీగ్ మ్యాచ్ ల్లో అత్యంత విజయవంతంగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, అప్ఘనిస్థాన్ జట్లు ' పవర్ ప్లే ' వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలిగాయి.
భారతజట్టు అసలుసిసలు 'పవర్' అదే.....
48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో భారత్ వరుస విజయాలు సాధించడం ఇదే మొదటిసారికాదు. 2003 ప్రపంచకప్ లో వరుసగా 8 విజయాలు, 2019 ప్రపంచకప్ లో వరుసగా 7 విజయాలు సాధించడంతో పాటు..ప్రస్తుత 2023 ప్రపంచకప్ లో సైతం ఇప్పటికే 8 విజయాలు, 16 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. పసికూన నెదర్లాండ్స్ తో జరిగే ఆఖరిరౌండ్ పోటీలో సైతం విజయం సాధించడం ద్వారా తొమ్మిదికి తొమ్మిది విజయాలతో 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ దశను ముగించడం ఖాయంగా కనిపిస్తోంది.
రాహుల్ ద్రావిడ్ ప్రధాన శిక్షకుడిగా, రోహిత్ శర్మ జట్టుని ముందుండి నడిపించే అసలుసిసలు నాయకుడిగా భారత జైత్రయాత్ర కొనసాగటానికి ' పవర్ ప్లే ' ఓవర్లలో విజయవంతంగా నిలవడమే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
' పవర్ ప్లే కింగ్ ' రోహిత్ శర్మ!
ప్రస్తుత ప్రపంచకప్ లో కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ తనజట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగిన సమయంలో ఆట మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు రాబట్టే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయగలుగుతున్నాడు.
తనదైన శైలిలో ప్రత్యర్థిబౌలర్లపై భారీషాట్లతో విరుచుకు పడుతూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ప్రధానంగా తన ట్రేడ్ మార్క్ పుల్, హుక్ షాట్లకు తోడు లాఫ్టెడ్ డ్రైవ్ లతో చెలరేగిపోతున్నాడు. సిక్సర్ల మోత మోగిస్తూ భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇస్తూ వస్తున్నాడు.
సొంతలాభం పూర్తిగా మానుకొని కేవలం జట్టు ప్రయోజనాల కోసమే 40, 80 స్కోర్ల వరకూ వచ్చి ..అదే దూకుడు కొనసాగస్తూ అవుటవుతున్నాడు. సెంచరీల కోసం, వ్యక్తిగత రికార్డుల కోసం ఆడకుండా నిఖార్సయిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.
ప్రస్తుత ప్రపంచకప్ పవర్ ప్లే ఓవర్లలో అత్యధిక పరుగులు (262 ), అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా జంట రికార్డులు నెలకొల్పాడు. మొత్తం 8 మ్యాచ్ ల్లో రోహిత్ సాధించిన మొత్తం 434 పరుగుల్లో ఇన్నింగ్స్ మొదటి 10 ఓవర్లలో సాధించినవే 262 ఉన్నాయి.
బౌలర్లదే అదేజోరు.......
భారతజట్టు ఫీల్డింగ్ కు దిగిన సమయంలో పవర్ ప్లే ఓవర్లతోపాటు డెత్ ఓవర్లలో సైతం పేస్ బౌలర్ల త్రయం చెలరేగి పోతున్నారు. ప్రత్యర్థిజట్లను దెబ్బ మీద దెబ్బ కొడుతూ తమజట్టుకు విజయాలను అందిస్తున్నారు.
ఓపెనింగ్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, చేంజ్ బౌలర్ మహ్మద్ షమీ గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల సగటు వేగానికి రివర్స్ స్వింగ్ ను జోడించి ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చుతూ వస్తున్నారు.
ఇక..మిడిల్ ఓవర్లలో స్పిన్ జోడీ రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లతో పాటు షమీ,బుమ్రా సైతం కట్టడి చేస్తూ కీలక వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిజట్లను కోలుకోనివ్వకుండా చేస్తున్నారు.
ముంబైలో శ్రీలంకను 55, కోల్ కతాలో దక్షిణాఫ్రికాను 83 పరుగుల స్కోర్లకే కుప్పకూల్చడం చూస్తే భారత బౌలింగ్ ఎంత పదునుతో ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆట మొదటి 10 ఓవర్లలో భారత బౌలర్లు 18 వికెట్లు పడగొట్టడం ద్వారా సగటున 4.07 పరుగులు మాత్రమే ఇస్తూ వచ్చారు.
పవర్ ప్లే ఓవర్లలో వేసిన 480 బంతులకు 18.11 పరుగులు చొప్పున ఇచ్చారు. మొత్తం 480 బంతుల్లో 347 డాట్ బాల్స్ ఉండటం మరో అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.
భారత పేసర్ల త్రయం సిరాజ్, షమీ..పవర్ ప్లే ఓవర్లలో చెరో ఆరు వికెట్లు పడగొడితే ..బుమ్రా 5 వికెట్లు సాధించాడు.
విరాట్...పరుగుల మోత....
భారత బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కొహ్లీ ఇప్పటి వరకూ ఆడిన 8 ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో సహా 543 పరుగులు సాధించడం ద్వారా 108.60 సగటు తో రెండో అత్యుత్తమ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.
యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్, కెప్టెన్ రోహిత్, మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం బ్యాటింగ్ లో తమవంతు బాధ్యతను నిర్వరిస్తున్నారు.
పవర్ ప్లే ఓవర్లలో బ్యాటింగ్, బౌలింగ్ పవర్ తో తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్ నాకౌట్ రౌండ్లోనూ ఇదేజోరు కొనసాగించగలిగితే..ప్రపంచకప్ ను మూడోసారి, 2011 తర్వాత రెండోసారి అందుకోగలుగుతుంది.