భారత అజేయమైనజట్టేం కాదు- గ్రెగ్ చాపెల్

సొంతగడ్డపై భారత్ అజేయమైన జట్టేంకాదంటూ భారత మాజీ శిక్షకుడు, ఆస్ట్ర్రేలియా మాజీ బ్యాటర్ , విఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు గ్రెగ్ చాపెల్ సెలవిచ్చాడు.

Advertisement
Update: 2023-02-05 07:48 GMT

సొంతగడ్డపై భారత్ అజేయమైన జట్టేంకాదంటూ భారత మాజీ శిక్షకుడు, ఆస్ట్ర్రేలియా మాజీ బ్యాటర్ , విఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు గ్రెగ్ చాపెల్ సెలవిచ్చాడు. ఇప్పుడు ఒత్తిడి పూర్తిగా భారతజట్టుపైనే ఉందంటూ మైండ్ గేమ్స్ కు తెరతీశాడు...

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే కంగారూల మైండ్ గేమ్ ప్రారంభమయ్యింది. గ్రౌండ్ లో అడుగుపెట్టక ముందే, తొలిటెస్ట్ బరిలోకి దిగకముందే ప్రత్యర్థిజట్లను మైండ్ గేమ్ తో ఒత్తిడికి గురి చేయటం ఆస్ట్ర్రేలియా క్రికెట్ వ్యూహంలో ఓ ప్రధాన భాగంగా ఉంటూ వస్తోంది.

ప్రస్తుత 2023 టెస్టు సిరీస్ కు ముందు కూడా అదే గేమ్ ను ఆస్ట్ర్రేలియా మాజీ క్రికెటర్లు గ్రెగ్ చాపెల్, మైకేల్ హస్సీ మొదలు పెట్టారు.

ఒత్తిడితో భారత్ చిత్తు.....

2019 నుంచి స్వదేశీగడ్డపై ఆడిన 25 సిరీస్ ల్లో అజేయంగా నిలిచిన భారత్ ను కంగు తినిపించాలన్న పట్టుదలతో ఆస్ట్ర్రేలియా ఉంది. ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని 18 మంది సభ్యులజట్టు ఇప్పటికే భారత్ లో పాగా వేసి ప్రాక్టీసు మొదలు పెట్టింది.

ఐసీసీ టెస్టు లీగ్ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ఈనెల 9న ప్రారంభంకాక ముందే పలు రకాల వ్యూహాలు, ప్రకటనతో ప్రత్యర్థి భారత్ ను ఒత్తిడికి గురిచేయటానికి క్రికెట్ ఆస్ట్ర్రేలియా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగానే ఆస్ట్ర్రేలియా మాజీ క్రికెటర్లు మైక్ హస్సీ, గ్రెగ్ చాపెల్ పలు రకాల ప్రకటనలతో గందరగోళం సృష్టించడానికి తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఆతిథ్య భారత్ స్పోర్టివ్ పిచ్ లను తయారు చేస్తే గెలుపు ఆస్ట్రేలియాదే నంటూ మైకేల్ హస్సీ అంటుంటే.. స్వదేశీగడ్డపై భారత్ అజేయమైన జట్టేం కాదంటూ మాజీ శిక్షకుడు గ్రెగ్ చాపెల్ సెలవిచ్చాడు.

కీలక ఆటగాళ్ల దూరంతో భారత్ బలహీనం...

ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల రిషభ్ పంత్, జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోడంతో భారత్ బలహీనపడిపోయిందని, కారుప్రమాదం గాయాలతో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ జట్టుకు దూరమైతే..వెన్నెముక గాయం నుంచి ఫాస్ట్ బౌలర్ బుమ్రా కోలుకొనే క్రమంలో ఉన్నాడు.

మోకాలి గాయం నుంచి ఈ మధ్యనే కోలుకొని తిరిగిజట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా సైతం తిరిగి ఫామ్ లోకి రావడం అంతతేలికకాదు, ఏవిధంగా చూసినా భారతజట్టులో

అసమతౌల్యం కనిపిస్తోందని, స్వదేశీగడ్డపై కీలక సిరీస్ లో పోటీపడటం, ప్రత్యర్థిగా ఆస్ట్ర్రేలియా ఉండటంతో భారతజట్టు తీవ్రఒత్తిడిలో పడిపోయిందని సిడ్నీ హెరాల్డ్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గ్రెగ్ చాపెల్ వివరించాడు.

భారత్ ను భారతగడ్డపై కంగు తినిపించడానికి ఆస్ట్ర్రేలియాకు ఇంతకు మించిన సదవకాశం మరొకటి లేదని చెప్పుకొచ్చాడు. ఆస్ట్ర్రేలియాజట్టు నాగపూర్ వేదికగా తొలిటెస్టు నుంచే పరిస్థితులకు అలవాటు పడటం కీలకమని సలహాఇచ్చాడు.

భారత్ లోని వాతావరణం, వికెట్లకు తొలిటెస్టు నుంచే అలవాటు పడకుంటే తేరుకోడం కష్టమని, విదేశీ జట్ల వైఫల్యాలకు అదే కారణమంటూ గ్రెగ్ చాపెల్ వివరించాడు.

స్పిన్ బౌలింగ్ తోనే భారత్ కు ఝలక్..

గతంలో పోల్చుకొంటే స్పిన్ బౌలింగ్ గు దీటుగా ఎదుర్కొనే సత్తా ప్రస్తుత భారతజట్టులో లోపించిందని గ్రెగ్ చాపెల్ గుర్తు చేశాడు. కంగారూ స్టార్ స్పిన్నర్ నేథన్ లయన్ చేతిలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఎనిమిదిసార్లు అవుటైన రికార్డును గుర్తుంచుకోవాలని, లయన్ తో పాటు లెఫ్టామ్ స్పిన్నర్ ఆస్టన్ అగర్ సైతం కీలకం కానున్నట్లు గ్రెగ్ చాపెల్ తెలిపాడు.

ఆస్ట్ర్రేలియా మాజీ స్టార్ బ్యాటర్ గా, కెప్టెన్ గా, విఖ్యాత విశ్లేషకుడిగా, ప్రముఖ శిక్షకుడిగా పేరున్న 74 సంవత్సరాల గ్రెగ్ చాపెల్ కు 1970- 1984 మధ్యకాలంలో 87 టెస్టులు ఆడి 7వేల 110 పరుగులతో 53.86 సగటు నమోదు చేసిన రికార్డు, అనుభం ఉన్నాయి.

యాండీ కమ్మిన్స్ నాయకత్వంలోని ప్రస్తుత ఆస్ట్ర్రేలియాజట్టుకు భారత్ ను భారతగడ్డపై చిత్తు చేయగల వనరులు, సామర్థ్యం ఉన్నాయని, కావలసిందల్లా భారత వికెట్లు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆటతీరును మార్చుకోడమే ప్రధానమని గ్రెగ్ చాపెల్ తెలిపాడు.

అయితే..భారతజట్టును భారత గడ్డపై తక్కువగా అంచనావేస్తే భారీమూల్యం చెల్లించక తప్పదని భారత మాజీ కోచ్ గా గ్రెగ్ చాపెల్ కు బాగా తెలుసు.

Tags:    
Advertisement

Similar News