'చేజింగ్ కింగ్' పైనే భారత గెలుపు భారం!
2023 ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సమరం రసపట్టుగా మారింది. భారత్ గెలుపు భారం చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ, ట్రబుల్ షూటర్ అజింక్యా రహానే జోడీపైన పడింది....
2023 ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ సమరం రసపట్టుగా మారింది. భారత్ గెలుపు భారం చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ, ట్రబుల్ షూటర్ అజింక్యా రహానే జోడీపైన పడింది....
గత దశాబ్దకాలంగా భారత్ తో దోబూచులాడుతున్న ఐసీసీ ట్రోఫీ అందినట్లే అంది చేజారిపోతూ వస్తోంది. ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న 2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో సైతం భారత్ కు అదే పరిస్థితి ఎదురయ్యింది.
టెస్ట్ మ్యాచ్ మొదటి నాలుగురోజులఆటలో ఆస్ట్ర్రేలియా ఆధిపత్యమే కొనసాగినా..ఆఖరిరోజు ఆటలో మాత్రం భారత్ ను అద్భుత విజయం ఊరిస్తూ వస్తోంది. గోరంత ఆశతో పోరాడుతున్న భారత్ ఎదుట 444 పరుగుల కొండంత భారీలక్ష్యం సవాలు విసురుతోంది.
ఈ రోజు జరిగే ఆఖరి రోజు ఆటలో భారత్ మ్యాచ్ నెగ్గాలంటే 90 ఓవర్లలో మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ, ట్రబుల్ షూటర్ అజింక్యా రహానే నాలుగో వికెట్ కు అజేయభాగస్వామ్యంతో క్రీజులో ఉన్నారు.
విరాట్, రహానేల వైపే చూపు....
టెస్ట్ మ్యాచ్ నెగ్గాలంటే రోజున్నర ఆటలో 444 పరుగుల భారీలక్ష్యం సాధించవలసి ఉన్న భారత్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి తన రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు సాధించింది.
మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ 60 బంతుల్లో 7 బౌండ్రీలతో 44 పరుగులు, మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 59 బంతుల్లో 3 బౌండ్రీలతో 20 పరుగుల నాటౌట్ స్కోర్లతో పోరాటం కొసాగిస్తున్నారు.
భారత్ విజేతగా నిలివాలంటే ఆఖరిరోజు ఆటలో మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు మాత్రమే మిగిలిఉన్నాయి.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 123 పరుగులతో నాలుగో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 8 వికెట్లకు 270 పరుగుల స్కోరుతో
డిక్లేస్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ కేరీ (66 నాటౌట్; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. స్టార్క్ (41; 7 ఫోర్లు), లబుషేన్ (41) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, షమీ, ఉమేశ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
వివాదాస్పద క్యాచ్ తో భారత్ ఢీలా!
భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ- శుభ్ మన్ గిల్ మొదటి వికెట్ కు 41 పరుగులతో జోరుగా బ్యాటింగ్ చేస్తున్న తరుణంలో ఓ వివాదాస్పద క్యాచ్
మ్యాచ్ గమనాన్ని మార్చి వేసింది.
ఆట 8వ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్ బోలాడ్ బంతిని షాట్ ఆడబోయిన యువఓపెనర్ గిల్ ఇచ్చిన క్యాచ్ ను కంగారూ స్లిప్ ఫీల్డర్ కామెరూన్ గ్రీన్ అందుకొన్నతీరు వివాదానికి దారితీసింది.
కామెరూన్ గ్రీన్ ఎడమ చేత్తో క్యాచ్ ను పట్టిన సమయంలో చేతివేళ్లలో నుంచి బంతి నేలకు తాకినట్లు రీప్లేల్లో కనిపించింది. అయితే ఫీల్డ్ అంపైర్లు నిర్ణయం తీసుకోకుండా.... థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదాస్పద క్యాచ్ పైన భారీస్థాయిలో చర్చసాగింది. అదే సమయంలో ఓవల్ స్టేడియంలోని భారత అభిమానులు సైతం చీటర్స్, చీటర్స్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.
శుభ్ మన్ గిల్ 19 బంతుల్లో 2 బౌండ్రీలతో 18 పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ 60 బంతుల్లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 43 పరుగులు, వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 47 బంతుల్లో 5 బౌండ్రీలతో 27 పరుగులకు అవుట్ కావడంతో భారత్ 93 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. అయితే..విరాట్ కొహ్లీ- అజింక్యా రహానే నాలుగో వికెట్ కు అజేయ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో మరో వికెట్ పడకుండా నాలుగోరోజుఆటను ముగించ గలిగారు.
కంగారూ బౌలర్లలో బోలాండ్, కమిన్స్, లయన్ తలో వికెట్ పడగొట్టారు.
ఆఖరిరోజు ఆటలో ఆస్ట్ర్రేలియా మిగిలిన 7 వికెట్లు పడగొట్టగలిగితే తొలిసారిగా టెస్టు లీగ్ ట్రోఫీని అందుకోగలుగుతుంది. అదే భారత్ మిగిలిన 280 పరుగులు సాధించగలిగితే..
అది సరికొత్త ప్రపంచ రికార్డే అవుతుంది