యూఎస్ ఓపెన్ లో అతిపెద్ద సంచలనం!

2024 సీజన్ గ్రాండ్ స్లామ్ ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్ రెండోరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది.

Advertisement
Update: 2024-08-30 09:38 GMT

2024 సీజన్ గ్రాండ్ స్లామ్ ఆఖరి టోర్నీ యూఎస్ ఓపెన్ రెండోరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది.

అమెరికన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. పురుషుల, మహిళల సింగిల్స్ ప్రారంభరౌండ్లలోనే దిగ్గజ ప్లేయర్లు అనూహ్యపరాజయాలతో ఇంటిదారి పట్టారు. న్యూయార్క్ లోని ఫ్లషింగ్ మెడోస్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత సీజన్ ఈ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోనే ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, మాజీ చాంపియన్ కార్లోస్ అల్ కరాజ్ పోటీ ముగిసింది.

74వ ర్యాంక్ ఆటగాడిచేతిలో ఓటమి...

ప్రస్తుత సీజన్ టోర్నీ ప్రారంభానికి ముందు హాట్ ఫేవరెట్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన అల్ కరాజ్ తనకంటే 71 ర్యాంకులు దిగువన ఉన్న ఆటగాడి చేతిలో ఓటమి పొందాడు.

నెదర్లాండ్స్ కు చెందిన 74వ ర్యాంకర్ బోటిచ్ వాన్ డి జాండ్ చుల్స్ తన రెండోరౌండ్ పోరులో అతిపెద్ద విజయం నమోదు చేయగలిగాడు. 2022 సీజన్ యూఎస్ విజేత, ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ రజత పతక గ్రహీత అల్ కరాజ్ ను 6-1, 7-5, 6-4తో చిత్తు చేయడం ద్వారా బోటిచ్ అతిపెద్ద సంచలనం నమోదు చేయగలిగాడు.

ప్రపంచ మూడో ర్యాంక్ ఆటగాడు అల్ కరాజ్ తొలిసెట్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తరువాతి సెట్లో పోరాడి ఆడినా 5-7తో ఓటమి పొందాడు. ఆఖరి సెట్లో సైతం 4 గేమ్ లు మాత్రమే నెగ్గడం ద్వారా రెండోరౌండ్ నుంచే నిష్క్ర్రమించక తప్పలేదు.

అల్ కరాజ్ కు ఇదే మొదటిసారి...

స్పానిష్ సంచలనం, 22 సంవత్సరాల కార్లోస్ అల్ కరాజ్..ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ రెండోరౌండ్లోనే పరాజయం పొందటం ఇదే మొదటిసారి. మూడేళ్ల క్రితం తొలిసారిగా యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడంతో పాటు..వింబుల్డన్ టోర్నీలోనూ విజేతగా నిలిచిన అల్ కరాజ్..ఓపెన్ ఎరాలో మూడోరౌండ్ కు ముందే టోర్నీ నుంచి నిష్క్ర్రమించిన 3వ ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

2021 వింబుల్డన్ రెండోరౌండ్లోనే కంగు తిన్నతరువాత మరో గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఓటమి పొందడం అల్ కరాజ్ కు ఇదే మొదటిసారి. తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియాకు చెందిన లీ టు ను అధిగమించడానికి నాలుగుసెట్లపాటు పోరాడాల్సి వచ్చిన అల్ కరాజ్..రెండోరౌండ్లో తేలిపోయాడు.

ప్రస్తుత ఓటమికి ముందు వరకూ డోకిచ్ ప్రత్యర్థిగా అల్ కరాజ్ కు 2-0 విజయాల రికార్డు ఉంది.

1996 వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ లో ప్రపంచ నంబర్ వన్ పీట్ సాంప్రాస్ ను డచ్ స్టార్ రిచర్డ్స్ క్రైజిసెక్ కంగు తినిపించాడు. 1991లో బోరిస్ బెకర్ తో జరిగిన 3వ రౌండ్ పోరులో పాల్ హార్ హూస్ సంచలన విజయం సాధించిన తరువాత అదే ఘనతను సాధించిన మూడోనెదర్లాండ్స్ ఆటగాడిగా డోకిచ్ రికార్డుల్లో చేరాడు.

మూడోరౌండ్లో జోకోవిచ్, సిన్నర్...

పురుషుల సింగిల్స్ ఇతర రెండోరౌండ్ పోటీలలో టైటిల్ ఫేవరెట్లు నొవాక్ జోకోవిచ్, యానిక్ సిన్నర్ సైతం విజయాలు నమోదు చేయడం ద్వారా మూడోరౌండ్ కు అర్హత సంపాదించారు.

తన కెరియర్ లో 25వ గ్రాండ్ స్లామ్ టైటి్ల కోసం బరిలోకి దిగిన 37 సంవత్సరాల వెటరన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ 6-4, 6-4తో పైచేయి సాధించిన సమయంలో ప్రత్యర్థి లాస్లో జెరీ గాయంతో పోటీ నుంచి తప్పుకోడంతో 3వ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకోగలిగాడు.

సిన్నర్ టాప్ గేర్....

ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు యానిక్ సిన్నర్ తన రెండోరౌండ్ పోరులో అలవోక విజయం సాధించాడు. అమెరికాకు చెందిన 49వ ర్యాంక్ ప్లేయర్ అలెక్స్ మిచెల్ సన్ ను వరుస సెట్లలో చిత్తు చేశాడు.

గంటా 39 నిముషాలపాటు సాగిన పోరులో సిన్నర్ 6-4, 6-0, 6-2తో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో సిన్నర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోగలిగాడు.

2024 సీజన్ టూర్ పురుషుల విభాగంలో 50 విజయాలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తో సహా మొత్తం ఐదు టైటిల్స్ ను సిన్నర్ నెగ్గడం విశేషం.

నాలుగోరౌండ్లో చోటు కోసం జరిగే పోరులో 87వ ర్యాంకర్, ఆస్ట్ర్రేలియాకు చెందిన క్రిస్టోఫర్ ఓ కోనెల్ తో సిన్నర్ తలపడాల్సి ఉంది.

మహిళల సింగిల్స్ ప్రారంభరౌండ్లలోనే మాజీ చాంపియన్ నవోమీ ఒసాకాతో సహా పలువురు టాప్ ర్యాంక్ ప్లేయర్లు అనుకోని పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్ర్రమించారు.

Tags:    
Advertisement

Similar News