భారత ఫుట్ బాల్ నెత్తిన నిషేధం పిడుగు!
అనుకొన్నట్లే జరిగింది. భారత ఫుట్ బాల్ సంఘం నెత్తిన నిషేధం పిడుగు పడింది.
అనుకొన్నట్లే జరిగింది. భారత ఫుట్ బాల్ సంఘం నెత్తిన నిషేధం పిడుగు పడింది. అంత్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య నిబంధనలను పాటించకుండా అడహాక్ కమిటీతో కాలక్షేపం చేసిన భారత ఫుట్ బాల్ సంఘం తగిన మ్యూల్యమే చెల్లించింది.
అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం నిబంధనల ప్రకారం ..దానికి అనుబంధంగా ఉన్న ప్రపంచంలోని 204 దేశాలు రాజకీయాలకు అతీతంగా తమ తమ ఫుట్ బాల్ సంఘాలను ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్దంగా సాగాలి. అయితే...భారత ఫుట్ బాల్ సంఘంలో గత కొంతకాలంగా వర్గాల కుమ్ములాటలు, ఎన్నికలు జరుగకుండా న్యాయస్థానాలకు వెళ్లి స్టేలు తెచ్చుకోడంతో...ప్రభుత్వనేతృత్వంలో ఓ అడహాక్ కమిటీని ఏర్పాటు చేసి వ్యవహారాలు నడిపిస్తున్నారు.
దీనికితోడు ఫుట్ బాల్ తో సంబంధంలేని బయటి శక్తుల జోక్యం కూడా ఎక్కువకావటాన్ని అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం తీవ్రంగా పరిగణించి..నిషేధం విధిస్తామంటూ పదేపదే హెచ్చరికలు చేస్తూనే వచ్చింది.
ఏకగ్రీవంగా నిషేధం నిర్ణయం...
తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ , నిబంధనలకు విరుద్ధంగా ఫుట్ బాల్ వ్యవహారాలు నడిపిస్తున్న భారత ఫుట్ బాల్ సంఘంపై నిషేధం విధించాలని అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్యకు చెందిన పిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది.
భారత ఫుట్ బాల్ సంఘం వ్యవహారాలలో థర్డ్ పార్టీల జోక్యాన్ని నివారించడం కోసమే తాము విధించిన నిషేథం తక్షణమే అమలులోకి వస్తుందని పిఫా ప్రకటించింది.
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ .. తన దైనందిన వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
గాల్లో దీపంలా ప్రపంచకప్ సాకర్...
పీఫా విధించిన నిషేధంతో..భారతజట్లు అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి అనుమతి ఉండదు. భారత్ వేదికగా జరగాల్సిన అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలు సైతం నిర్వహించే అవకాశం లేకుండా పోతుంది.
సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్ ఆతిథ్యంలో జరగాల్సిన పిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణ గాల్లో దీపంలా మారింది. భారత్ లో నిర్వహించాల్సిన ఈ టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం లేకపోలేదు.. టోర్నీకి సంబంధించి తదుపరి చర్యలను సమీక్షించి, అవసరమైతే కౌన్సిల్ బ్యూరోకు నివేదిక అందచేస్తామని ఫిఫా తెలిపింది. ఈ మేరకు భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిపా పాలకమండలి వివరించింది.
సాధనపైనే దృష్టి- సునీల్ చెత్రీ..
భారత ఫుట్ బాల్ సంఘంపై విధించిన నిషేధంతో తమకు సంబంధం లేదని, ఆటగాళ్ల దృష్టంతా సాధనపైనే ఉండాలని కెప్టెన్ సునీల్ చెత్రీ సూచించాడు.
భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని, భారత ఫుట్ బాలర్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్) చాన్నాళ్లుగా అడ్‌హక్ కమిటీతో నడుస్తోంది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని (థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యంతో భారత ఫుట్‌బాల్ కార్యకలాపాలు జరగడం ఇష్టపడని 'ఫిఫా' నిషేధం విధిస్తామని గతంలోనే హెచ్చరించింది.
ఈ సమస్య నివారణ బాధ్యత భారత క్రీడామంత్రిత్వశాఖ, అఖిలబారత ఫుట్ బాల్ సంఘం వర్గాల పైనే ఉంది.
అంతర్జాతీయ ఫుట్ బాల్ సంఘం తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత పురుషులజట్టు 104వ ర్యాంక్ లో కొనసాగుతోంది. పిఫాలో మొత్తం 204 దేశాలకు సభ్యత్వం ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడగా, అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడగా ఫుట్ బాల్ కు పేరుంది.
భారత్ లో ఓ రాష్ట్ర్రం, జిల్లా అంతైనా లేని దేశాలు ఓ వైపు ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ఫైనల్ రౌండ్ కు అర్హత సాధిస్తుంటే..జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ మాత్రం ఆసియా జోనల్ అర్హత రౌండ్లలోనే కొట్టిమిట్టాడాల్సి వస్తోంది.