పిల్లతల్లి చేతిలో ఓడిన ప్రపంచ నంబర్ వన్!
వింబుల్డన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ ను ఓ పిల్లతల్లి చిత్తు చేసి కలకలమే రేపింది.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ ను ఓ పిల్లతల్లి చిత్తు చేసి కలకలమే రేపింది....
ప్రస్తుత 2023 గ్రాండ్ స్లామ్ సీజన్ మూడో టోర్నీ వింబుల్డన్ 9వ రోజు పోటీలు సంచలనాలతో ముగిసాయి.మహిళల సింగిల్స్ ఆఖరి రెండు క్వార్టర్ ఫైనల్స్ లో అప్ సెట్లు నమోదయ్యాయి.
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్, హాట్ ఫేవరెట్ నొవాక్ జోకోవిచ్ గట్టి పోటీ ఎదుర్కొని చేరాడు.
స్వియాటెక్ కు ఎలీనా షాక్...
మహిళల సింగిల్స్ ప్రపంచ టాప్ ర్యాంక్ ప్లేయర్, మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత,టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ టైటిల్ వేటకు క్వార్టర్ ఫైనల్స్ లోనే తెరపడింది.
ఈ టోర్నీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోరుకు దిగిన ఉక్రెయిన్ ప్లేయర్, ప్రపంచ మూడో ర్యాంక్ ప్లేయర్ ఎలీనా స్వితోలినా మూడుసెట్ల పోరులో హాట్ ఫేవరెట్ స్వియాటెక్ పై సంచలన విజయం సాధించింది.
గత అక్టోబర్ లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన 28 ఏళ్ల ఎలీనా..మే నెలలోనే తిరిగి ప్రో సర్క్కూట్ లో అడుగుపెట్టింది. వింబుల్డన్ నిర్వాహక సంఘం వైల్డ్ కార్డ్ ద్వారా ప్రస్తుత సీజన్ పోటీలలో పాల్గొనటానికి అనుమతి ఇవ్వడంతో అన్ సీడెడ్ గా బరిలోనిలిచింది.
తొలిరౌండ్లోనే ప్రపంచ మాజీనెంబర్ వన్ వీనస్ విలియమ్స్ ను చిత్తు చేయడం ద్వారా టైటిల్ వేట మొదలు పెట్టిన ఎలీనా ఆఖరి క్వార్టర్ ఫైనల్లో రెండున్నర గంటలపాటు సాగిన పోరులో టాప్ సీడ్ స్వియాటెక్ ను 7-5, 6-7, 6-2తో ఓడించి సెమీస్ లో అడుగుపెట్టింది. మూడో రౌండ్లో సోఫియా కెనిన్, నాలుగోరౌండ్లో విక్టోరియా అజరెంకాలను సైతం ఎలీనా చిత్తు చేయగలిగింది.
నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ సమరం తొలిసెట్ ను ఎలీనా 7-5తో సొంతం చేసుకోగా..రెండోసెట్ ను స్వియాటెక్ 7-6తో టై బ్రేక్ లో నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచింది.
నిర్ణయాత్మక ఆఖరి సెట్లో ఎలీనాకు ఎదురేలేకపోయింది. బ్రేక్ వెంట బ్రేక్ సాధించడం ద్వారా 6-2తో సెట్, 2-1తో విజయాన్నిసాధించింది.తన కెరియర్ లో ఇప్పటికే నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన స్వియాటెక్ తొలిసారి వింబుల్డన్ క్వార్టర్స్ బరిలోకి దిగినా పరాజయం తప్పలేదు.
మొత్తం 5 ఏస్‌లు సంధించిన ఎలీనా 25 విన్నర్స్ కొట్టగా.. మూడు ఏస్‌లు సంధించిన స్వియాటెక్ 37 విన్నర్స్ సాధించింది. 41 అనవసర తప్పిదాలు చేసిన స్వియాటెక్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది.
తొలి పిల్లతల్లిగా ఎలీనా రికార్డు.....
గత 44 సంవత్సరాల కాలంలో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ చేరిన తొలి పిల్లతల్లిగా ఎలీనా రికార్డుల్లో చేరింది.44 సంవత్సరాల క్రితం ఆస్ట్ర్రేలియాకు చెందిన ఈవన్ గూలగాంగ్ ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన తొలి పిల్లతల్లిగా నిలిచింది. ఆ తర్వాత అదే ఘనతను మరో మహిళ సాధించడానికి నాలుగు దశాబ్దాలపాటు వేచి చూడాల్సి వచ్చింది.
గత అక్టోబర్లో ఫ్రెంచ్ టెన్నిస్ ప్లేయర్ గేయల్ మోన్ ఫిల్స్ ద్వారా ఎలీనా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కేవలం 8 మాసాల వ్యవధిలోనే తిరిగి ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి అడుగుపెట్టి సంచలన విజయాల పరంపర సాగిస్తూ సెమీస్ కు చేరుకోగలిగింది.
మరో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా పెగ్యూలాపై మార్కెటా వోండ్రుసోవా సైతం సంచలన విజయం సాధించింది. వోండ్రుసోవా 6-4, 2-6, 6-4తో నాలుగో సీడ్ పెగులాపై నెగ్గి ముందంజ వేసింది. సెమీస్‌లో వోండ్రుసోవాతో ఎలీనా అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో వోండ్రుసోవాతో ఐదుసార్లు తలపడిన ఎలీనాకు 3 విజయాలు, 2 పరాజయాల రికార్డు ఉంది. 2019 తర్వాత వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం ఎలీనా స్వితోలినాకు ఇదే తొలిసారి.
46వ గ్రాండ్ స్లామ్ సెమీస్ లో జోకోవిచ్...
పురుషుల సింగిల్స్ సెమీస్ కు రెండోసీడ్, ఏడుటైటిల్స్ విన్నర్ నొవాక్ జోకోవిచ్ గట్టి పోటీ ఎదుర్కొని చేరాడు. నాలుగుసెట్ల సమరంలో రష్యా ఆటగాడు యాండ్రీ రుబ్లేవ్ ను 4-6, 6-1, 6-4, 6-3తో అధిగమించాడు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో 46సార్లు సెమీస్ చేరిన రోజర్ ఫెదరర్ రికార్డును జోకోవిచ్ ఈ విజయం ద్వారా సమం చేయగలిగాడు. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో జానిక్ సిన్నర్ తో జోకోవిచ్ తలపడాల్సి ఉంది.
తన కెరియర్ లో ఇప్పటికే 7 వింబుల్డన్ టైటిల్స్ తో సహా మొత్తం 23 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలు నెగ్గిన జోకోవిచ్ రికార్డుస్థాయిలో 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు గురిపెట్టాడు.