రెండుదశాబ్దాల టెన్నిస్ జీవితానికి సానియా అల్విదా!

భారతమహిళా టెన్నిస్ చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. రెండుదశాబ్దాల కెరియర్ కు హైదరాబాదీ షాన్ సానియా మీర్జా ముగింపు పలికింది.

Advertisement
Update:2023-02-22 12:01 IST

భారతమహిళా టెన్నిస్ చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. రెండుదశాబ్దాల కెరియర్ కు హైదరాబాదీ షాన్ సానియా మీర్జా ముగింపు పలికింది. దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్ తొలిరౌండ్ ఓటమితో అంతర్జాతీయ టెన్నిస్ నుంచి నిష్క్ర్రమించింది.

ప్రతి ఆరంభం ఓ ముగింపుకు నాంది. దానికి ఈ సృష్టిలోని ఏ జీవీ మినహాయింపు కాదు. చివరకు ఎంతగొప్పవారైనా సరే ఎక్కడో ఒకచోట తమ ప్రస్థానానికి ముగింపు పలకాల్సిందే. భారత మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ సానియా మీర్జా సైతం తన రెండుదశాబ్దాల ప్రొఫెషనల్ టెన్నిస్ జీవితానికి తన రెండోనివాసం దుబాయ్ వేదికగా స్వస్తి పలికింది.

2003 నుంచి 2023 వరకూ...

12 సంవత్సరాల చిరుప్రాయంలో టెన్నిస్ ర్యాకెట్ చేతపట్టి 16 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్ టెన్నిస్ లో అడుగుపెట్టి..గత రెండుదశాబ్దాలుగా భారత టెన్నిస్ కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన సానియా మీర్జా 36 సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించింది.

తరచూ గాయాలు, వయసు మీద పడటం, కుటుంబబాధ్యతలు వంటి కారణాలతో తాను టెన్నిస్ జీవితాన్ని ముగించాలని నిర్ణయించినట్లు కొద్దిమాసాల క్రితమే ప్రకటించిన సానియా..మెల్బోర్న్ వేదికగా గత నెలలో ముగిసిన 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ లో రోహన్ బొపన్నతో కలసి రన్నరప్ ట్రోఫీ అందుకోడం ద్వారా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వేటను ముగించింది.

ఇక..2023 దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్ బరిలోకి అమెరికాకు చెందిన మాడిసన్ కీస్ తో జంటగా దిగిన సానియాకు తొలిరౌండ్లోనే 4-6, 0-6తో రష్యాజోడీ వెరోనికియా- లూద్మిలా సామ్సనోవాల చేతిలో పరాజయం తప్పలేదు. ఈ ఓటమితో సానియా టెన్నిస్ జీవితం ముగిసినట్లయ్యింది.

భారత అత్యుత్తమ క్రీడాకారిణి సానియా..

భారత మహిళా టెన్నిస్ చరిత్రలో సానియా సాధించినన్ని ఘనతలు మరో క్రీడాకారిణి ఇప్పటి వరకూ సాధించలేదు. మహిళా టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ర్యాంకు, అత్యధిక టైటిల్స్, అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ పతకాలు సాధించిన తొలి, ఏకైక భారత క్రీడాకారిణి సానియా మాత్రమే.

హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ టెన్నిస్ లోకి రాకెట్లా దూసుకొచ్చిన సానియా 2009లో తన మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను మెల్బోర్న్ వేదికగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లోనే సాధించింది. కెరియర్ లో ఆఖరి గ్రాండ్ స్లామ్ ( రన్నరప్ ) ట్రోఫీని సైతం ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లోనే సాధించడం విశేషం.

తన కెరియర్ లో ఇప్పటికే మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో ఎన్నో అపూర్వ విజయాలు సాధించిన సానియా ..వేర్వేరు భాగస్వాములతో మూడు మిక్సిడ్ డబుల్స్, మూడు మహిళల డబుల్స్ టైటిల్స్ గెలుచుకొంది.

2016 రియో ఒలింపిక్స్ మిక్సిడ్ డబుల్స్ లో రోహన్ బొపన్నతో జంటగా కాంస్య పతకం పోరులో విఫలం కావటం సానియాకు తీవ్రనిరాశను మిగిల్చింది.

ఇటు విజయాలు..అటు వివాదాలు..

సానియా గత 22 సంవత్సరాలుగా టెన్నిస్ తో పాటు వివాదాలు ఊపిరిగా జీవించింది. క్రీడాకారిణిగా, వ్యక్తిగతంగా పలురకాల సమస్యలు ఎదురుకావడంతో టెన్నిస్ కెరియర్ ను కొనసాగించలేనని భావించి 36 సంవత్సరాల వయసులో కెరియర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.

మెల్బోర్న్ వేదికగా జరిగిన 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ విభాగంలో 42 సంవత్సరాల రోహన్, 36 సంవత్సరాల సానియా జోడీ పోటీకి దిగారు. లేటు వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ఫైనల్స్ చేరిన భారతజోడీగా రికార్డుల్లో చోటు సంపాదించారు. రన్నరప్ ట్రోఫీతో గ్రాండ్ స్లామ్ కెరియర్ ను ముగించింది. తనవయసు 14 ఏళ్లు ఉన్న సమయంలో 20 సంవత్సరాల రోహన్ తో కలసి తొలిసారిగా మిక్సిడ్ డబుల్స్ పోరుకు దిగిన సానియా..ఇప్పుడు.. 36 సంవత్సరాల వయసులో .. 42 సంవత్సరాల రోహన్ తో కలసి తన కెరియర్ ఆఖరిటోర్నీలో పాల్గొనటం, ఫైనల్స్ వరకూ రావటం, తన కుమారుడు ఇజాన్ మీర్జా చూస్తుండగా ..ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ ఆడటం, రన్నరప్ ట్రోఫీ అందుకోటం కలకాలం గుర్తుండిపోతాయని పొంగిపోతూ చెప్పింది.

గత 20 సంవత్సరాలుగా తాను టెన్నిస్ కెరియర్ ను కొనసాగించి శారీరకంగా, మానసికంగా అలసిపోయానని, దుబాయ్ వేదికగా ముగిసిన టోర్నీ ద్వారా వీడ్కోలు తీసుకోడం గర్వకారణమని ప్రకటించింది.

43 టైటిల్స్ తో సానియా రికార్డు..

2009లో మహేశ్ భూపతితో జంటగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ట్రోఫీ అందుకొన్నానని, అదే తన కెరియర్ లో తొలిగ్రాండ్ స్లామ్ ట్రోఫీ అని గుర్తు చేసుకొంది.

టెన్నిస్ మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో సానియా మొత్తం 43 టైటిల్స్ సాధిస్తే..అందులో గ్రాండ్ స్లామ్ ట్రోఫీలే అరడజను ఉండటం విశేషం.

టెన్నిస్ క్రీడాకారిణిగా తన కెరియర్ లో విజయాలతో పాటు 100 కోట్ల రూపాయల వరకూ సంపాదించిన సానియా ప్రస్తుతం హైదరాబాద్ లో తన పేరుతో టెన్నిస్ అకాడెమీని నిర్వహిస్తోంది. ఇంతకాలం టెన్నిస్సే జీవితంగా గడిపిన తాను ఇక తన కుటుంబం కోసం, కుమారుడి ఆలనాపాలన కోసం గడుపుతానని ప్రకటించింది.

భారత మహిళా టెన్నిస్ లో సానియా లాంటి మరో ప్లేయర్ రావాలంటే ఎంత కాలం వేచిచూడాలో మరి.

Tags:    
Advertisement

Similar News