పదేళ్లు..ఐదుట్రోఫీలు..దటీజ్ రోహిత్ శర్మ!
ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న క్రికెట్ లీగ్ ఐపీఎల్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ అనగానే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే అభిమానుల స్మృతిపథంలో మెదులుతాడు.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దశాబ్దకాలాన్ని పూర్తి చేశాడు. ఈ రోజే 36వ పడిలో పడిన రోహిత్ ఐపీఎల్ 1000వ మ్యాచ్ లో ఐదుసార్లు చాంపియన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు....
ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న క్రికెట్ లీగ్ ఐపీఎల్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ముంబై ఇండియన్స్. ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ అనగానే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే అభిమానుల స్మృతిపథంలో మెదులుతాడు.
ఆరు ఐపీఎల్ ట్రోఫీల ఒకే ఒక్కడు!
ఐపీఎల్ చరిత్రలో రెండు వేర్వేరు జట్ల తరపున ఆరు ఐపీఎల్ ట్రోఫీలు, ఒకేజట్టుకు కెప్టెన్ గా ఐదు టైటిల్స్ నెగ్గిన ఏకైక, ఒకే ఒక్క ఆటగాడు రోహిత్ శర్మ. 2009 ఐపీఎల్ టోర్నీలో డెక్కన్ చార్జర్స్ జట్టులో ఆటగాడిగా ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా అందుకొన్నాడు.
ఆ తర్వాత 2013 సీజన్ మధ్యభాగంలో ముంబై జట్టు కెప్టెన్ గా పగ్గాలు అందుకొన్న రోహిత్ మరి వెనుదిరిగి చూసింది లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పదేళ్ల కాలంలో ఐదుసార్లు తనజట్టును విజేతగా నిలిపిన ఘనత రోహిత్ శర్మకు మాత్రమే దక్కుతుంది.
2013 ఏప్రిల్ 24న ముంబై కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ ఐదుసార్లు ( ) తనజట్టును చాంపియన్ గా నిలిపాడు. తన నాయకత్వ ప్రతిభతో అత్యంత విజయవంతమైన జట్టుగా తీర్చి దిద్దాడు.
మాస్టర్ సచిన్ టెండుల్కర్ ,కిరాన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, జస్ ప్రీత్ బుమ్రా, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, లాసిత్ మలింగ లాంటి దిగ్గజ, ప్రతిభావంతులైన క్రికెటర్లతో ముంబై ఇండియన్స్ గత దశాబ్దకాలంలో కదం తొక్కింది.
రోహిత్ కు హ్యాట్సాఫ్...
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ పదేళ్లకాలాన్ని పూర్తి చేయడంతో..ఆ జట్టు సభ్యులు ఓ వీడియో సందేశం ద్వారా జేజేలు పలికారు. చిన్నవయసులోనే ముంబైజట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ లో గొప్పనాయకత్వ లక్షణాలున్నాయని, త్వరగా నేర్చుకొనే గుణం రోహిత్ లో ఉందని మాజీ ఆల్ రౌండర్, ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ కిరాన్ పోలార్డ్ ప్రశంసించారు.
యువక్రికెటర్లలో ప్రతిభను అతిత్వరగా గుర్తించి ప్రోత్సహించడంలో రోహిత్ కు రోహిత్ మాత్రమే సాటని మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, యువఓపెనర్ ఇషాన్ కిషన్ కొనియాడారు. కెప్టెన్ గా సహఆటగాళ్లలో స్ఫూర్తిని నింపడం, దిశానిర్దేశం చేయటంలో రోహిత్ స్టయిలే వేరని ప్రశంసించారు.
ముంబై లాంటి అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీకి పదేళ్లపాటు కెప్టెన్ గా ఉండటం అంటే మాటలు కాదని, రోహిత్ నాయకత్వంలో ఆడటం తనకు గొప్పఅనుభవమని సూపర్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ పొంగిపోతూ చెప్పాడు.
ఓ గొప్ప కెప్టెన్ కు కావాల్సిన లక్షణాలన్నీ రోహిత్ శర్మలో ఉన్నాయని, జట్టును ముందుండి నడిపించే నాయకుడు రోహిత్ అంటూ ముంబై ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ పామెంట్
ప్రశంసించాడు. యువఆటగాళ్లతో కూడిన ముంబైజట్టుకు మూలస్తంభం రోహిత్ మాత్రమేనని చెప్పాడు.
జట్టులోని సీనియర్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరిగా వైదొలగడం, జస్ ప్రీత్ బుమ్రా లాంటి కీలక బౌలర్ అందుబాటులో లేకపోడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఒక్కసారిగా బలహీన పడిపోయింది.
గత సీజన్ లో లీగ్ టేబుల్ ఆఖరి స్థానానికి పడిపోయిన ముంబై..ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 7 రౌండ్ల మ్యాచ్ ల్లో 3 విజయాలు, 4 పరాజయాలతో కొట్టిమిట్టాడుతోంది. దీనికితోడు..కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అంతంత మాత్రం ఫామ్ లోనే ఉండటం జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
మొత్తం 7 మ్యాచ్ ల్లో 181 పరుగులతో బ్యాటర్ల వరుస 28వ స్థానంలో కొనసాగుతున్నాడు.
36వ పడిలో హిట్ మ్యాన్....
ఏప్రిల్ 30న రోహిత్ శర్మ 36వ పడిలో ప్రవేశించాడు. ఎటాకింగ్ ఓపెనర్ గా అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన రోహిత్ పేరుతో పలు అసాధారణ రికార్డులు నమోదయ్యాయి.
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, 50 ఓవర్ల వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ తో కలుపుకొని మొత్తం మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టుకు నాయకత్వం వహించిన అతికొద్దిమంది ఆటగాళ్లలో రోహిత్ ఒకడుగా నిలిచిపోతాడు.
ఒకే వన్డే ప్రపంచకప్ లో ఐదుశతకాలు బాదిన ఏకైక ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే. అంతేనా..వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడు కూడా రోహిత్ శర్మే.
2007 టీ-20 ప్రపంచకప్ ద్వారా భారతజట్టు సభ్యుడిగా అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన రోహిత్ ను త్రీ-ఇన్-వన్ క్రికెటర్ అన్నా అతిశయోక్తి కాదు. భారత్ విజేతగా నిలిచిన తొలి టీ-20 ప్రపంచకప్ లో మూడుమ్యాచ్ లు ఆడిన రోహిత్ 88 పరుగులు సాధించాడు.
మొత్తం 243 వన్డేలలో 9వేల 825 పరుగులతో 48.64 సగటు నమోదు చేశాడు. 264 అత్యధిక వ్యక్తిగతస్కోరుతో పాటు 30 శతకాలు, 48 అర్థశతకాలు సాధించాడు.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీలో రోహిత్ ఐదుశతకాలు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మొత్తం 49 టెస్టులు, 83 ఇన్నింగ్స్ లో 3వేల 379 పరుగులతో 45.66 సగటు నమోదు చేశాడు. 212 అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు..9 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు సాధించాడు.
భారత్ తరపున ఆడిన మొత్తం 148 టీ-20 మ్యాచ్ ల్లో 3వేల 853 పరుగులతో 139.25 స్ట్రయిక్ రేటు, 30.82 సగటు నమోదు చేశాడు. టీ-20ల్లో 4 శతకాలు, 29 అర్థశతకాలు బాదిన రికార్డు సైతం రోహిత్ కు ఉంది.
క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన అతికొద్ది మంది భారత క్రికెటర్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. భారత్ వేదికగా మరి కొద్దిమాసాలలో జరుగనున్న
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో తనజట్టును విజేతగా నిలపడంతో పాటు..టెస్టు లీగ్ ట్రోఫీని సైతం భారత్ కు అందించాలని రోహిత్ కలలు కంటున్నాడు.
36 సంవత్సరాల వయసులో రోహిత్ భారత కెప్టెన్ గా తన లక్ష్యాలను చేరుకోవాలని కోరుకొందాం..