రోహిత్ సేనకు మ్యాచ్ ఫీజులో భారీకోత!

బంగ్లాదేశ్ తో తొలివన్డేను ఓటమితో మొదలుపెట్టిన భారతజట్టుకు మరో చేదుఅనుభవం ఎదురయ్యింది.

Advertisement
Update:2022-12-06 12:37 IST

రోహిత్ సేనకు మ్యాచ్ ఫీజులో భారీకోత!

బంగ్లాదేశ్ తో తొలివన్డేను ఓటమితో మొదలుపెట్టిన భారతజట్టుకు మరో చేదుఅనుభవం ఎదురయ్యింది. స్లోఓవర్ రేటు కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే ప్రకటించారు.

బంగ్లాదేశ్ టూర్ లో భారత్ పరిస్థితి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా తయారయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మీర్పూర్ వేదికగా ముగిసిన లోస్కోరింగ్ తొలి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో పరాజయం పొంది..ఓటమి భారంతో షాక్ లో ఉన్న రోహిత్ సేనకు పుండుమీద కారం చల్లినట్లుగా జరిమానా ఎదురయ్యింది.

ఐసీసీ నియమావళి ప్రకారం భారతజట్టు నిర్ణితసమయం కంటే ఆలస్యంగా నాలుగు ఓవర్లు బౌల్ చేసిన కారణంగా జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు.

మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత..

ఐసీసీ బౌలింగ్ నియమావళి... రూల్‌ 2.22 ప్రకారం.. ఓవర్‌ ఆలస్యమైనందుకు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నారు. అయితే..తొలివన్డేలో భారతజట్టు ఏకంగా నాలుగు ఓవర్లు ఆలస్యం కావడంతో 80శాతం కోత విధించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ 27 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేశారు. శిఖర్ ధావన్ ఏడు, విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగులు చేశారు. రాహుల్ మాత్రమే స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

బంగ్లా బౌలర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఐదు వికెట్లు, ఇబాదత్‌ హుస్సేన్‌ నాలుగు వికెట్లు తీసి భారత్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. అనంతరం బంగ్లాదేశ్‌ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 41 పరుగులు చేశాడు. మెహ్దీ 38 పరుగులతో అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.

భారతజట్టు నిర్ణిత సమయంలో వేయాల్సిన నాలుగు ఓవర్లను ఆలస్యంగా పూర్తి చేసినట్లు ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైకేల్ గాఫ్, తన్వీర్ అహ్మద్, థర్డ్ అంపైర్ షరీఫుద్దౌలా, నాలుగో అంపైర్ గాజీ సోహెల్ గుర్తించి..మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో భారత కెప్టెన్ కు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే తాఖీదు జారీ చేశారు. భారత కెప్టెన్ తమ తప్పిదాన్ని ఒప్పుకోడంతో మొత్తం మ్యాచ్ ఫీజులో 80 శాతం కోతకు సమ్మతించక తప్పలేదు.

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోవన్డే బుధవారం మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగానే జరుగనుంది. సిరీస్ అవకాశాలు సజీవంగా నిలుపుకోవాలంటే ప్రపంచ నాలుగో ర్యాంకర్ భారత్..ఆరునూరైనా ఈమ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News