బ్యాటింగ్ లో టీమిండియా ఫ్లాఫ్ షో.. భారమంతా బౌలర్లపైనే

అక్కడుంది ఆస్ట్రేలియా. అది మామూలు టీమ్ కాదు. ఈరోజు ఆస్ట్రేలియా బౌలింగ్ చూస్తే అదే నిజమనిపించింది. సెంచరీకి తక్కువ స్కోర్ చేయరు అని పేరున్న ఉద్దండులందర్నీ వెంట వెంటనే పెవిలియన్ కి పంపించారు ఆస్ట్రేలియా బౌలర్లు. టీమిండియాని 240 దగ్గరే ఆపేశారు.

Advertisement
Update:2023-11-19 18:13 IST
బ్యాటింగ్ లో టీమిండియా ఫ్లాఫ్ షో.. భారమంతా బౌలర్లపైనే

బ్యాటింగ్ లో టీమిండియా ఫ్లాఫ్ షో.. భారమంతా బౌలర్లపైనే

  • whatsapp icon

1, 4, 4, 6, 9, 9, 10.. ఈరోజు టీమిండియా బ్యాటర్లు చేసిన వ్యక్తిగత స్కోర్లు ఇవి. వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలో దిగిన ఇండియా టీమ్.. ఫైనల్ లో చేసిన పేలవ ప్రదర్శనకు నిదర్శనం ఇది. బ్యాటర్లు పూర్తిగా నిరాశ పరిచారు. 240కి ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ 47కి ఔటవ్వగా, కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ బాట పట్టాడు. కేఎల్ రాహుల్ ఒక్కడే 66 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. సెమీస్ లో సెంచరీతో రెచ్చిపోయిన శ్రేయస్ అయ్యర్ ఫైనల్ లో చేసిన స్కోర్ కేవలం 4. ఈ స్కోర్ తో భారత్ ఫైనల్ లో గెలవడం కష్టమనే అంచనాకి వచ్చారు అభిమానులు. బౌలర్లు వీరవిహారం చేస్తే మాత్రం ముచ్చటగా మూడోసారి భారత్ కి వరల్డ్ కప్ వస్తుంది.

నాకౌట్ దశలో అన్ని మ్యాచ్ లు అదరగొట్టారు, సెమీస్ లో న్యూజిలాండ్ ని చిత్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఫామ్ లో ఉన్నారు మూడోసారి ఇండియాకి వరల్డ్ కప్ గ్యారెంటీ అనే మాట అన్నిచోట్లా వినపడింది. ఎక్కడికక్కడ భారీ తెరలు పెట్టి ఆస్ట్రేలియా-ఇండియా ఫైనల్ మ్యాచ్ ని లైవ్ లో టెలికాస్ట్ చేశారు. ఆఖరికి పెళ్లి మండపాల్లో కూడా క్రికెట్ మ్యాచ్ లు లైవ్ పెట్టారు. కానీ ఆ ఉత్సాహం అంతా ఇండియా బ్యాటింగ్ తర్వాత నీరుగారిపోయింది.

అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ చూసేందుకు అమిత్ షా సహా చాలామంది నేతలు తరలి వచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్ క్రికెటర్లు కూడా స్టేడియంకి క్యూ కట్టారు. ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లో టీమిండియా హాట్ ఫేవరెట్ గానే ఉంది. సెమీస్ లో విధ్వంసకర ప్రదర్శన చూశాక ఆశలు రెట్టింపయ్యాయి. కానీ అందరికీ ఏదో ఓ మూల అనుమానం. అక్కడుంది ఆస్ట్రేలియా. అది మామూలు టీమ్ కాదు. ఈరోజు ఆస్ట్రేలియా బౌలింగ్ చూస్తే అదే నిజమనిపించింది. సెంచరీకి తక్కువ స్కోర్ చేయరు అని పేరున్న ఉద్దండులందర్నీ వెంట వెంటనే పెవిలియన్ కి పంపించారు ఆస్ట్రేలియా బౌలర్లు. టీమిండియాని 240 దగ్గరే ఆపేశారు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. ఆస్ట్రేలియాని 240లోపు కట్టడి చేస్తారో లేదో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News