అమెరికా కాదు..యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఓ విచిత్రమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే పోరులో భారత్ తో అమెరికా పేరుతో ఓ మినీభారతజట్టు తలపడుతోంది.

Advertisement
Update:2024-06-12 10:52 IST

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఓ విచిత్రమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే పోరులో భారత్ తో అమెరికా పేరుతో ఓ మినీభారతజట్టు తలపడుతోంది.

అమెరికా..ఓ విచిత్రమైన దేశం. పలు విధాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ దేశం అంటే..వివిధ దేశాలకు చెందిన ప్రతిభావంతులైన వ్యక్తుల సమాహారమనే చెప్పాలి.

పైసాఖర్చు లేకుండా ఇరుగుపొరుగుదేశాలలోని నైపుణ్యం కలిగిన వ్యక్తులను తనవారిగా మార్చుకోడంలో అమెరికా తరువాతే ఏదేశమైనా. దానికి క్రికెట్ సైతం ఏమాత్రం మినహాయింపు కాదు.

తొలిసారిగా ప్రపంచకప్ క్రికెట్ కు ఆతిథ్యం...

ఈ భూఖండంలోనే అతిపెద్ద క్రీడామార్కెట్ అమెరికా గడ్డపైన తొలిసారిగా 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలోని గ్రూపులీగ్ తో సహా మొత్తం 15 మ్యాచ్ లు..న్యూయార్క్, ఫ్లారిడా వేదికలుగా నిర్వహిస్తున్నారు.

అమెరికన్ ఫుట్ బాల్, బేస్ బాల్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడల్ని విపరీతంగా అభిమానించే అమెరికాగడ్డపై మొట్టమొదటి సారిగా ప్రపంచ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. అంతేకాదు..సంయుక్త ఆతిథ్య దేశం హోదాలో అమెరికా తొలిసారిగా ప్రపంచకప్ టీ-20 క్రికెట్ బరిలోకి దిగుతోంది. అయితే..15 మంది సభ్యుల అమెరికాజట్టులో మేడిన్ అమెరికా ఆటగాడు ఒక్కరూ లేకపోడం విశేషం.

అమెరికాజట్టులో 8 మంది భారత సంతతి ఆటగాళ్లు....

గుజరాత్ కు చెందిన మోనాంక్ పటేల్ నాయకత్వంలోని అమెరికాజట్టులో భారత్ లో జన్మించిన ఐదుగురు ప్లేయర్లతో పాటు..భారత మూలాలున్న ఎనిమిదిమంది ఆటగాళ్లున్నారు.

ప్రస్తుత ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో భారత్, కెనడా, ఐర్లాండ్, పాక్ జట్లతో అమెరికా పోటీపడుతోంది. ఇప్పటికే ఆడిన రెండుకు రండుమ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించడం ద్వారా అమెరికాజట్టు తన అరంగేట్రం ప్రపంచకప్ టోర్నీలోనే సూపర్- 8 రౌండ్ కు గెలుపు దూరంలో నిలిచింది.

కెనడా, పాకిస్థాన్ జట్లతో అమెరికా సంచలన విజయాలు సాధించడంలో జట్టులోని భారత సంతతి ఆటగాళ్లే ప్రధానపాత్ర వహించారు. ఈరోజు జరిగే మూడోరౌండ్ పోరులో భారత- బీ జట్టుగా పేరుపొందిన అమెరికా..ఏకంగా ప్రపంచనంబర్ వన్ భారత్ కే సవాలు విసురుతోంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

అమెరికాజట్టుకు కీలకం మోనాంక్, సౌరబ్...

వికెట్ కీపర్ బ్యాటర్ మోనాంక్ పటేల్ సారథ్యంలోని అమెరికాజట్టులో భారత మూలాలున్న ఆటగాళ్లు ఎనిమిదిమంది ఉంటే..న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక, కెనడా దేశాల నుంచి వచ్చిన ఒక్కో ఆటగాడు ఉన్నారు.

అమెరికాజట్టుకు ఆడుతున్న ఆటగాళ్లలో ఐదుగురు భారత్ లో జన్మించినవారే ఉన్నారు. భారతజట్టులో తమకు చోటులేదని గ్రహించిన కొందరు అమెరికాకు వలస వెళితే..మరికొందరు అక్కడి సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ అమెరికా పౌరసత్వం సంపాదించడం ద్వారా ప్రపంచకప్ లో పాల్గొనగలుగుతున్నారు.

భారత్ లో జన్మించి, భారత దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం కలిగిన మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, రోనాక్ పటేల్, సౌరవ్ నేతృవల్కర్, నిసరాగ్ పటేల్ ప్రస్తుత అమెరికాజట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు.

ముంబై టు అమెరికా...

ముంబైకి చెందిన సౌరవ్ నేత్రవల్కర్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గా అమెరికా బౌలింగ్ కు కొండంత అండగా ఉన్నాడు. ఒరేకిల్ కంపెనీలో సీనియర్ సాఫ్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సౌరవ్..అమెరికా పౌరుడిగా మారడంతో ప్రపంచకప్ లో పాల్గొనగలుగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలసి అండర్ -15 స్థాయి నుంచి ముంబైకి ఆడిన అనుభవం సౌరవ్ కు ఉంది. అంతేకాదు..2010, 2012 జూనియర్ ప్రపంచకప్ లో భారత్ తరపున సౌరవ్ పాల్గొన్నాడు.

ఇక..పంజాబ్ నుంచి అమెరికా వలస వెళ్లిన లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ హర్మీత్ సింగ్ కు అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలలో రెండుసార్లు భారతజట్టులో సభ్యుడుగా ఆడిన రికార్డు ఉంది.

మహారాష్ట్ర్ర, గుజరాత్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్ర్రాలకు చెందిన ఆటగాళ్లు ఇప్పుడు అమెరికా క్రికెట్ కు మూలస్తంభాలుగా మారారు.ఇప్పుడు ప్రపంచకప్ లీగ్ లో భాగంగా తాము పుట్టిపెరిగి, క్రికెటర్లుగా తీర్చిదిద్దిన భారత్ కే సవాలు విసురుతున్నారు.

ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి మేటిజట్లను కంగుతినిపించిన అమెరికాను ఈరోజు జరిగే పోరులో తక్కువగా అంచనావేస్తే రోహిత్ సేనకు కష్టాలు తప్పవు.

అమెరికాజట్టు తన ఆఖరి రెండు రౌండ్లలో భారత్ లేదా ఐర్లాండ్ పై నెగ్గగలిగితే..ప్రపంచకప్ సూపర్ - 8 రౌండ్ చేరుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News