విరాట్ ను ఊరిస్తున్న ప్రపంచకప్ రికార్డులు!

టీ-20 ప్రపంచకప్ లో పలు సరికొత్త రికార్డులకు భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ గురి పెట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈరోజు జరిగే పోరులో విరాట్ చెలరేగిపోడానికి ఉరకలేస్తున్నాడు.

Advertisement
Update:2022-10-23 09:30 IST

విరాట్ కొహ్లీ

టీ-20 ప్రపంచకప్ లో పలు సరికొత్త రికార్డులకు భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ గురి పెట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఈరోజు జరిగే పోరులో విరాట్ చెలరేగిపోడానికి ఉరకలేస్తున్నాడు...

ఆధునిక క్రికెట్లో భారత పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ 13వ సంవత్సరాల తన క్రికెట్ జీవితంలో ఐదోసారి టీ-20 ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నాడు. భారతజట్టులో సభ్యుడిగా తన ఐదో ప్రపంచకప్ ఆడుతున్న 33 ఏళ్ల విరాట్ పలు సరికొత్త రికార్డులకు గురిపెట్టాడు.

టీ-20 క్రికెట్లో...ప్రధానంగా ప్రపంచకప్ లో ఇప్పటికే పలు రికార్డులు విరాట్ పేరుతోనే ఉన్నాయి. పైగా ఆస్ట్ర్రేలియాలోని ఫాస్ట్, బౌన్సీ పిచ్ లపైన అత్యంత విజయవంతమైన బ్యాటర్ గా కూడా విరాట్ కు పేరుంది.

ప్రపంచకప్ విజయమే లక్ష్యం...

2007లో తొలిసారిగా ప్రపంచకప్ నెగ్గిన భారత్ తన రెండో టైటిల్ కోసం గత 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. భారత్ ను రెండోసారిగా విశ్వవిజేతగా నిలపాలన్న లక్ష్యంతో మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సమరానికి సిద్ధిమయ్యాడు.

కంగారూ ల్యాండ్ లోని బౌన్సీ పిచ్ లపై ఇప్పటి వరకూ 11 టీ-20 మ్యాచ్ లు ఆడిన విరాట్ కు 451 పరుగులతో 64.42 సగటు నమోదు చేసిన రికార్డు ఉంది. ఆస్ట్ర్రేలియా పిచ్ లపై అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాటర్లు ఇఫ్తీకర్ అహ్మద్, అసీల గుణరత్నే, జెపీ డుమ్నీల సరసన విరాట్ నిలిచాడు.

ప్రస్తుత ప్రపంచకప్ కు ఆస్ట్ర్రేలియానే వేదికగా ఉండడంతో విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అవకాశం ఉంది.

బౌండ్రీల మొనగాడు విరాట్...

టీ-20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల్లో అత్యధికంగా 331 బౌండ్రీలు బాదిన రికార్డు విరాట్ కు ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 337, ఐరిష్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 344 బౌండ్రీలతో అగ్రస్థానాలలో కొనసాగుతున్నారు. ప్రస్తుత ప్రపంచకప్ లో నిలకడగా రాణించడం ద్వారా పరుగులతో పాటు బౌండ్రీల రికార్డును విరాట్ మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.

అంతేకాదు..ఇప్పటి వరకూ తన కెరియర్ లో 109 టీ-20 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన విరాట్ కు 3వేల 712 పరుగులు సాధించిన ఘనత ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 3వేల 737 పరుగులు సాధించగా ఆ రికార్డును సైతం విరాట్ అధిగమించే అవకాశాలు లేకపోలేదు.

కంగారూగడ్డపై అత్యధిక సగటు..

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్ ల్లో అత్యధిక సగటు సాధించిన విదేశీ బ్యాటర్లలో విరాట్ అందరి కంటే ముందున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్ కు ముందు వరకూ 11 మ్యాచ్ లు ఆడిన విరాట్ 451 పరుగులు సాధించాడు. 64.42తో అత్యుత్తమ సగటు నమోదు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ ల ద్వారా సగటు రికార్డును సైతం విరాట్ మెరుగుపరచుకోనున్నాడు.

4 ప్రపంచకప్ లు- 845 పరుగులు

విరాట్ తన కెరియర్ లో 2012, 2014, 2016, 2021 ప్రపంచకప్ టీ-20 టో్ర్నీలలో పాల్గొని 845 పరుగులు సాధించాడు. 89 పరుగుల అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో 76.81 సగటు నమోదు చేశాడు.

2012 ప్రపంచకప్ లో 2 హాఫ్ సెంచరీలతో 185 పరుగులు, 2014 ప్రపంచకప్ లో 4 అర్థశతకాలతో 310 పరుగులు, 2016 ప్రపంచకప్ లో 3 అర్థసెంచరీలతో 273 పరుగులు, 2021 ప్రపంచకప్ లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 68 పరుగులు సాధించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో విరాట్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే...అరడజనుకు పైగా సరికొత్త రికార్డులు నమోదు చేయటం ఏమాత్రం కష్టంకాబోదు.

పాక్ ప్రత్యర్థిగా విరాట్ టాప్...

పాకిస్థాన్ ప్రత్యర్థిగా అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్ ఘనతను విరాట్ దక్కించుకొన్నాడు. మొత్తం 9 ఇన్నింగ్స్ లో 406 పరుగులతో మూడుసార్లు నాటౌట్ గా నిలిచాడు. ఇందులో నాలుగు అర్థశతకాలున్నాయి. 24 బౌండ్రీలు, 5 సిక్సర్లు సైతం ఉన్నాయి.

విరాట్ రాణించడం పైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News