రసపట్టుగా ప్రపంచకప్ సూపర్...వార్!

2022 టీ-20 ప్రపంచకప్ రసపట్టుగా సాగుతోంది. సూపర్ -12 రౌండ్లో తలపడుతున్నజట్లలో ఏ ఒక్కజట్టు అజేయంగా నిలువలేకపోడంతో పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో మరి చెప్పాల్సిన పనిలేదు.

Advertisement
Update:2022-11-04 09:23 IST

2022 టీ-20 ప్రపంచకప్ రసపట్టుగా సాగుతోంది. సూపర్ -12 రౌండ్లో తలపడుతున్నజట్లలో ఏ ఒక్కజట్టు అజేయంగా నిలువలేకపోడంతో పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో మరి చెప్పాల్సిన పనిలేదు. రెండు గ్రూపులలోనూ ఇప్పటి వరకూ వరుస విజయాలతో నేరుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్నజట్టు ఒక్కటీ లేకపోడం విశేషం.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో హాట్ ఫేవరెట్ అన్నజట్టు ఏదీ ఉండదని ప్రస్తుత 2022 ప్రపంచకప్ టోర్నీ సూపర్ -12 రౌండ్ పోటీలు నిరూపించాయి. రెండుగ్రూపులుగా సూపర్ -12 రౌండ్లో తలపడుతున్న మొత్తం 12 జట్లూ కనీసం ఒక్కో ఓటమిని ఎదుర్కొనడం విశేషం.

గ్రూప్ -1లో వరుస విజయాలతో దూసుకుపోయిన న్యూజిలాండ్ ను ఇంగ్లండ్ దెబ్బ కొడితే...గ్రూప్ -2లో భారత్ విజయాలకు దక్షిణాఫ్రికా, దక్షిణాఫ్రికాకు పాకిస్థాన్ గండి కొట్టాయి.

సఫారీలపై గెలుపుతో పాక్..కొనఊపిరి ఆశలు..

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక నాలుగోరౌండ్ పోరులో పాకిస్థాన్ భారీవిజయంతో నాకౌట్ రౌండ్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

మొదటి రెండురౌండ్లలో భారత్, జింబాబ్వే జట్ల చేతిలో పరాజయాలు చవిచూసిన పాక్ ..ఆ తర్వాత నెదర్లాండ్స్ పై నెగ్గడం ద్వారా తేరుకొంది. నెగ్గితీరాల్సిన నాలుగోరౌండ్లో సఫారీలను ఆల్ రౌండ్ గేమ్ తో మట్టి కరిపించింది.

అయితే...నాలుగురౌండ్లలో రెండు విజయాలతో నాలుగు పాయింట్లు మాత్రమే సాధించిన పాకిస్థాన్ జట్టు సెమీస్ చేరడం అంతతేలిక కాదు. బంగ్లాదేశ్ తో తాను తలపడే ఆఖరిరౌండ్ మ్యాచ్ తో పాటు...జింబాబ్వేతో భారత్, నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా ఆడే 5వ రౌండ్ మ్యాచ్ ల ఫలితాలు సైతం సెమీస్ చేరే జట్లను నిర్ణయించనున్నాయి.

భారత్ సెమీస్ చేరాలంటే...

ఇప్పటి వరకూ ఆడిన నాలుగురౌండ్లలో మూడు విజయాలతో 6పాయింట్లు సాధించడం ద్వారా గ్రూపు టాపర్ గా నిలిచిన భారత్ సెమీస్ చేరాలంటే ఈనెల 6న మెల్బో్ర్న్ వేదికగా జరిగే ఆఖరి రౌండ్ పోరులో జింబాబ్వేను ఓడించితీరాలి. జింబాబ్వే పై నెగ్గితే 8 పాయింట్లతో నేరుగా నాకౌట్ రౌండ్ చేరుకోగలుగుతుంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయినా..7 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.

పాక్ సెమీస్ చేరాలంటే...

మాజీ చాంపియన్ పాకిస్థాన్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. క్రికెట్లో ఏదైనా సాధ్యమే అనుకొన్నా..అదంత తేలికగా కనిపించడం లేదు. జింబాబ్వే చేతిలో భారత్, నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికాజట్లు పరాజయాలు పొందాలి. దీనికితోడు పాక్ జట్టు తన ఆఖరి రౌండ్ పోరులో బంగ్లాదేశ్ పై భారీ ఆధిక్యంతో నెగ్గితీరాలి. అయితే..దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్, భారత్ ను జింబాబ్వే ఓడించితీరాలని కోరుకోడం అత్యాశే అవుతుంది.

దక్షిణాఫ్రికా సెమీస్ చేరాలంటే...

లీగ్ దశలో భారత్ కు సూపర్ షాక్ ఇచ్చిన దక్షిణాఫ్రికా గ్రూప్ -2 నుంచి సెమీస్ చేరాలంటే...తన ఆఖరిరౌండ్ పోరులో నెదర్లాండ్స్ ను భారీతేడాతో ఓడించితీరాల్సి ఉంది.

నాలుగురౌండ్లలో రెండు విజయాలు, ఓ ఓటమితో పాటు..జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వానదెబ్బతో రద్దుకావడంతో పాయింట్లు పంచుకోడం ద్వారా ప్రస్తుతం 5 పాయింట్లతో

గ్రూప్ రెండోస్థానంలో సఫారీజట్టు కొనసాగుతోంది. ఒకవేళ నెదర్లాండ్స్ తో జరగాల్సిన ఆఖరిరౌండ్ మ్యాచ్ వర్షంతో రద్దయినా 6 పాయింట్లతో నిలుస్తుంది. అప్పుడు నెట్ రన్ రేట్ లో మెరుగైన జట్టుగా నిలిస్తేనే సెమీస్ బెర్త్ దక్కుతుంది.

గ్రూపులోని మిగిలిన మూడుజట్లు ( నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్ ) ఇప్పటికే సెమీస్ రేస్ కు దూరమయ్యాయి. మొత్తం మీద..గ్రూప్ -2లో రెండు సెమీస్ బెర్త్ ల కోసం..మూడుజట్ల పోరు మరెన్ని మలుపులు తిరుగుతుందో మరి.!

Tags:    
Advertisement

Similar News