భారత్ - బంగ్లా పోరుకు వానముప్పు!

ప్రపంచకప్ లో సెమీస్ బెర్త్ కు తహతహలాడుతున్న భారత్ అవకాశాలకు వరుణదేవుడు గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడిలైడ్ ఓవల్ వేదికగా బుధవారం జరిగే నాలుగోరౌండ్ మ్యాచ్ కు వానదెబ్బ తగలడం ఖాయమని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement
Update:2022-11-01 17:30 IST

ప్రపంచకప్ లో సెమీస్ బెర్త్ కు తహతహలాడుతున్న భారత్ అవకాశాలకు వరుణదేవుడు గండికొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అడిలైడ్ ఓవల్ వేదికగా బుధవారం జరిగే నాలుగోరౌండ్ మ్యాచ్ కు వానదెబ్బ తగలడం ఖాయమని వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది....

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో మిశ్రమఫలితాలు ఎదుర్కొన్న టాప్ ర్యాంకర్ భారత్ పరిస్థితి చివరకు వానభయంతో గాల్లో దీపంలా మారింది. మొదటి మూడురౌండ్లలో రెండు విజయాలు, ఓ పరాజయంతో ఆరుజట్ల లీగ్ టేబుల్ రెండోస్థానంలో కొనసాగుతున్న భారత్ సెమీఫైనల్స్ చేరాలంటే ఆఖరి రెండు రౌండ్లలో ( బంగ్లాదేశ్, జింబాబ్వే )లపై నెగ్గితీరాల్సి ఉంది.

అయితే..ఈ రెండుమ్యాచ్ ల్లో ఓ ఒక్కమ్యాచ్ కు వానదెబ్బ తగిలినా సెమీస్ అవకాశాలు క్లిష్టం కానున్నాయి.

అడిలైడ్ లో భారీవర్షాలు..

సూపర్ -12 మొదటి మూడురౌండ్లలో వానభయం లేకుండా మ్యాచ్ లు ఆడేసిన భారతజట్టు..అడిలైడ్ ఓవల్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్ తో జరిగే కీలక నాలుగోరౌండ్ మ్యాచ్ లో మాత్రం వరుణభయంతో బరిలోకి దిగాల్సి వస్తోంది.

అడిలైడ్ క్రికెట్ స్టేడియంతో పాటు నగరంలోనూ గత కొద్దిరోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే రోజున సైతం 60 శాతం వానపడటం ఖాయమని వాతావరణ శాఖ ప్రకటించింది.

నెట్ రన్ రేట్ లో భారత్ పైచేయి...

ఇప్పటి వరకూ జరిగిన మొదటి మూడురౌండ్ల మ్యాచ్ ల్లో భారత్ రెండు విజయాలు, 4 పాయింట్లతో బంగ్లాదేశ్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ నమోదు చేసింది. రెండుజట్లూ చెరో నాలుగు పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచినా ..రెండుజట్లకూ నాలుగోరౌండ్ పోరు కీలకం కానుంది. ప్రస్తుతానికి నెట్ రన్ రేట్ లో బంగ్లాకంటే భారత్ జట్టే మెరుగైన స్థితిలో ఉంది.

ఒకవేళ వర్షంతో నాలుగోరౌండ్ మ్యాచ్ రద్దుల పద్దులో చేరితే...ఇరుజట్లూ చెరో పాయింట్ ను పంచుకోవాల్సి వస్తుంది. అలాంటి స్థితిలో భారత్ తన ఆఖరిరౌండ్ మ్యాచ్ లో జింబాబ్వే పై నెగ్గడంతో పాటు భారీస్కోరు సాధించాల్సి ఉంటుంది.

సాయంత్రం వేళ వర్షం..

భారత్- బంగ్లాజట్ల మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం 60 శాతం మేఘావృతమై ఉంటుందని, 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మ్యాచ్ రోజు సాయంత్రం వర్షం పడుతుందని హెచ్చరించింది.

వాతావరణం 10 నుంచి 17 డిగ్రీల సెలీషియస్ నడుమ ఉంటుందని, 0-2 మిల్లీమీటర్ల వర్షం పడుతుందని వివరించింది. ఇప్పటికే మెల్బోర్న్ నగరం చేరుకొన్న భారతజట్టు..కుండపోతగా కురిసిన వర్షంతో ప్రాక్టీసు కార్యక్రమాన్ని వేరేచోటకు మార్చుకోవాల్సి వచ్చింది.

అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా..

మొత్తం ఆరుజట్ల గూప్ -2 లీగ్ మొదటి మూడురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. భారత్, బంగ్లాదేశ్ జట్లు చెరో 4 పాయింట్లు చొప్పున సాధించి రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి.

3 పాయింట్లతో జింబాబ్వే నాలుగు, పాకిస్థాన్ 2 పాయింట్లతో ఐదుస్థానాలలో కొనసాగుతున్నాయి. ఒక్కగెలుపు లేకుండా నెదర్లాండ్స్ లీగ్ టేబుల్ అట్టడుగుకు పడిపోయింది.

ఒకవేళ భారత్- బంగ్లాజట్ల పోటీ వానదెబ్బతో రద్దయితే...అప్పుడు పాకిస్థాన్- దక్షిణాఫ్రికాజట్ల నడుమ జరిగే పోరు ఆసక్తికరంగా మారనుంది. భారత్ సెమీస్ చేరాలంటే...తన ఆఖరిరౌండ్ పోరులో జింబాబ్వే భారీతేడాతో నెగ్గితీరక తప్పని పరిస్థితి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News