రేపటినుంచే అప్ఘన్ తో టీ-20 సిరీస్, ధోనీ రికార్డుకు రోహిత్ గురి!

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటకు మాజీ చాంపియన్ భారత్ రేపటినుంచి సన్నాహాలు ప్రారంభించనుంది.

Advertisement
Update:2024-01-10 15:35 IST

2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టైటిల్ వేటకు మాజీ చాంపియన్ భారత్ రేపటినుంచి సన్నాహాలు ప్రారంభించనుంది.

అప్ఘనిస్థాన్ తో రేపటినుంచి జరుగనున్న తీన్మార్ టీ-20 సిరీస్ తో మాజీచాంపియన్ భారత్ సన్నాహాలకు తెరలేపనుంది. ఈ సిరీస్ ద్వారానే దిగ్గజ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తిరిగి టీ-20 రీ-ఎంట్రీ చేయబోతున్నారు. గత టీ-20 ప్రపంచకప్ తర్వాత నుంచి టీ-20 ఫార్మాట్ కు దూరంగా ఉంటూ వచ్చిన రోహిత్ , విరాట్ ప్రస్తుత సిరీస్ కోసం భారతజట్టులో చోటు సంపాదించగలిగారు.

14 మాసాల తర్వాత నాయకత్వం...

ఆస్ట్ర్రేలియా వేదికగా గతేడాది ముగిసిన టీ-20 ప్రపంచకప్ లో చివరిసారిగా భారత్ కు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ..14 మాసాల సుదీర్ఘవిరామం తరువాత తిరిగి టీ-20 జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. అంతేకాదు..ఈ సిరీస్ ద్వారా ఆల్ టైమ్ గ్రేట్ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో ఉన్న అత్యధిక విజయాల కెప్టెన్సీ రికార్డును సైతం అధిగమించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

వచ్చే జూన్ లో జరిగే టీ-20 ప్రపంచకప్ కు భారత్ సన్నాహాలలో భాగంగా ఇదే ఆఖరి టీ-20 సిరీస్ కానుంది.

హార్థిక్ , సూర్య అవుట్....

గతేడాదికాలంగా భారత్ కు టీ-20 ఫార్మాట్లో నాయకులుగా వ్యవహరించిన హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గాయాల నుంచి కోలుకొంటున్న కారణంగా పక్కన పెట్టారు.

వచ్చే టీ-20 ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని రోహిత్, విరాట్ లకు తిరిగి జట్టులో చోటు కల్పించడంతో పలు రకాల ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది.

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో భారత్ కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ రికార్డు ఇప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ పేరుతోనే ఉంది. ప్రస్తుతం ధోనీ తర్వాతి స్థానంలోనే రోహిత్ కొనసాగుతున్నాడు.

ధోనీ నాయకత్వంలో భారత్ ఆడిన 72 మ్యాచ్ ల్లో 42 విజయాల రికార్డు ఉంది. ప్రస్తుత అప్ఘన్ సిరీస్ ను భారత్ 3-0తో నెగ్గగలిగితే ధోనీ అత్యధిక విజయాల రికార్డును సమం చేసే అవకాశం రోహిత్ శర్మకు దక్కుతుంది.

టీ-20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల వరుసలో అస్గర్ అప్ఘానీ , మహేంద్ర సింగ్ ధోనీ, బాబర్ అజమ్, వోయిన్ మోర్గాన్, ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా తలో 42 విజయాలతో అగ్రస్థానంలో నిలిచారు.

ఆస్ట్ర్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 40 విజయాలతో రెండు, రోహిత్ శర్మ 39 విజయాలతో మూడు స్థానాలలో కొనసాగుతున్నారు.

రోహిత్ , విరాట్ పోటాపోటీ!

ఇప్పటి వరకూ భారత్ కు 39 విజయాలు అందించడం ద్వారా రోహిత్ శర్మ 76.74 విజయశాతంతో అగ్రస్థానంలో నిలిచాడు. విరాట్ కొహ్లీ విజయశాతం 60గా మాత్రమే ఉంది.

50 మ్యాచ్ ల్లో భారత్ కు టీ-20 కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ 30 విజయాలు అందించగలిగాడు.

మరోవైపు టీ-20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ ఘనత కోసం విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ తిరిగి తమ పోటీని కొనసాగించనున్నారు. గత ప్రపంచకప్ వరకూ విరాట్ ఆడిన 115 మ్యాచ్ ల్లో 4008 పరుగులతో ప్రపంచంలోనే రెండోస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 148 మ్యాచ్ ల్లో 3853 పరుగులు మాత్రమే సాధించగలిగాడు.

ప్రస్తుత సిరీస్ కోసం రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కొహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

2024 తీన్మార్ సిరీస్ లోని తొలి టీ-20 మొహాలీ వేదికగా జనవరి 11న, రెండో టీ-20ని ఇండోర్ వేదికగా జనవరి 14న, మూడో టీ-20ని బెంగళూరు వేదికగా జనవరి 17న నిర్వహించనున్నారు.

Tags:    
Advertisement

Similar News