హాటుహాటుగా ఐపీఎల్ ప్లే-ఆఫ్ రేస్!

ముంబై విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement
Update:2023-05-13 17:33 IST

ఐపీఎల్ -16వ సీజన్ లీగ్ ప్లే-ఆఫ్ రేస్ హాట్ హాట్ గా సాగిపోతోంది. 12వ రౌండ్లో ముంబై కీలక విజయం తో లీగ్ టేబుల్ మూడోస్థానాన్ని మరింత పటిష్టం చేసుకొంది.

దేశంలోని ఎండలు, రాజకీయాలతో పాటు ఐపీఎల్-16వ సీజన్ లీగ్ మ్యాచ్ లు సైతం రౌండ్ రౌండ్ కూ వేడెక్కిపోతున్నాయి. 70 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ నుంచి మొత్తం 10 జట్లూ.. 4 జట్ల ప్లే -ఆఫ్ రౌండ్ లో చోటు కోసం భీకరంగా పోరాడుతున్నాయి.

డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 12 రౌండ్లలో 8 విజయాలు, 4 పరాజయాలతో 16 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది.

నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ 12 రౌండ్లలో 7 విజయాలు, 4 పరాజయాలు, వర్షంతో రద్దయిన ఓ మ్యాచ్ తో కలుపుకొని మొత్తం 15 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది.

అయితే..ప్రస్తుత సీజన్ లీగ్ ప్రారంభంలో వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై ఆ తర్వాత పుంజుకొని ఆడి ప్లే-ఆఫ్ రౌండ్ కు గెలుపు దూరంలో నిలిచింది. ప్రస్తుతం లీగ్ టేబుల్ మూడోస్థానంలో నిలిచిన ముంబై 12 రౌండ్లలో 7 విజయాలు, 5 పరాజయాలతో ఉంది.

గుజరాత్ విజయాలకు ముంబై బ్రేక్...

లీగ్ తొలి అంచె పోటీలో ముంబైని తన హోంగ్రౌండ్ అహ్మదాబాద్ స్టేడియంలో చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ కు..ముంబై హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన హైస్కోరింగ్ రెండో అంచె పోరులో చుక్కెదురయ్యింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ కేవలం 49 బంతుల్లోనే 103 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్ ను చిత్తు చేయగలిగింది.

ముంబై అరుదైన రికార్డు...

గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన 12వ రౌండ్ మ్యాచ్ లో సైతం 200కు పైగా స్కోరు సాధించడం ద్వారా ముంబై ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. గత నాలుగుమ్యాచ్ ల్లోనూ 200కు పైగా స్కోర్లు సాధించిన తొలిజట్టుగా రికార్డు నెలకొల్పింది.

ముంబై ఇండియన్స్ కి హోంగ్రౌండ్ వాంఖడేలో ఇది వరుసగా నాలుగవ 200 స్కోరు కావడం విశేషం.

ఈ మ్యాచ్ లో విజేతగా నిలవాలంటే 219 పరుగుల భారీస్కోరు చేయాల్సిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చయగలిగింది.

రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ షో వృథా!

ముంబై బ్యాటింగ్ కు దిగిన సమయంలో 4 వికెట్లు పడగొట్టిన లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్..బ్యాటర్ గానూ సత్తా చాటుకొన్నాడు. కేవలం 32 బంతుల్లోనే 10 సిక్సర్లు, 3 బౌండ్రీలతో 79 పరుగుల అజేయస్కోరు సాధించినా తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

రషీద్ ఖాన్ బౌలర్ గా 4 వికెట్లు, బ్యాటర్ గా 79 పరుగులు సాధించినా గుజరాత్ టైటాన్స్ కు అక్కరకు రాకుండా పోయాయి. అయితే..ముంబై చేతిలో ఘోరపరాజయం నుంచి తనజట్టును తప్పించగలిగాడు.

ముంబై విజయంలో ప్రధానపాత్ర వహించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 12 రౌండ్లలో ముంబైకి ఇది 7వ గెలుపు కాగా..గుజరాత్ టైటాన్స్ కు 12 రౌండ్లలో ఇది నాలుగో ఓటమి మాత్రమే.

Tags:    
Advertisement

Similar News