2వేల పరుగుల రేస్ లో విరాట్ ను మించిన సూర్య!
మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 13 ఏళ్ల విరాట్ కొహ్లీ రికార్డును తెరమరుగు చేశాడు.
మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 13 ఏళ్ల విరాట్ కొహ్లీ రికార్డును తెరమరుగు చేశాడు.
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో 13 సంవత్సరాల క్రితం విరాట్ కొహ్లీ నెలకొల్పిన రికార్డును భారత కెప్టెన్ కమ్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ బద్దలు కొట్టాడు.
56 ఇన్నింగ్స్ లోనే అరుదైన రికార్డు...
టీ-20 ఫార్మాట్లో గత రెండు సంవత్సరాలుగా పరుగుల మోత మోగిస్తున్న భారత స్టార్ బ్యాటర్, 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. 13 సంవత్సరాల క్రితం విరాట్ కొహ్లీ నెలకొల్పిన 56 ఇన్నింగ్స్ రికార్డును సమం చేయగలిగాడు.
దక్షిణాఫ్రికాతో తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా జరిగిన రెండోమ్యాచ్ లో 28 బంతుల్లోనే మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా సూర్య ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.
తనజట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి అడుగుపెట్టిన సూర్య వచ్చీరావడంతోనే ఎదురుదాడికి దిగాడు. 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా అతితక్కువ మ్యాచ్ ల్లో 2వేల పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా నిలిచాడు.
భారత్ తరపున తన 59వ మ్యాచ్ మాత్రమే ఆడిన సూర్య 56 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డు నమోదు చేయగలిగాడు. స్వదేశంలో ఆస్ట్ర్రేలియాతో జరిగిన పాంచ్ పటాకా సిరీస్ లోనే 2వేల పరుగుల మైలురాయిని చేరాల్సిన సూర్య..ఆఖరి రెండుమ్యాచ్ ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో సఫారీ సిరీస్ లో కానీ ఈ రికార్డును అందుకోలేకపోయాడు.
విరాట్ కొహ్లీ 60 మ్యాచ్ లు, 56 ఇన్నింగ్స్ లో సాధించిన రికార్డును సూర్య 59 మ్యాచ్ లు 56 ఇన్నింగ్స్ లోనే అధిగమించగలిగాడు. 2010 సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ పై విరాట్ సాధించిన అత్యంత వేగంగా 2 వేల పరుగుల రికార్డును మరో భారత బ్యాటర్ అధిగమించడానికి 13 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది.
2022 నుంచి సూర్యజోరు...
2022 సీజన్లో టీ-20ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన నాటినుంచి సూర్యకుమార్ తన ఆధిపత్యాన్ని నిలుపుకొంటూ వస్తున్నాడు. పరుగుల మోత మోగిస్తూనే ఉన్నాడు.
2022 సీజన్లో 31 ఇన్నింగ్స్ ఆడి 1164 పరుగులతో టాపర్ గా నిలిచిన సూర్య ప్రస్తుత 2023 సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 17 మ్యాచ్ ల్లోనే 592 పరుగులు సాధించాడు.
ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో సహా 153 స్ట్ర్రయిక్ రేట్ తో పాటు 45.53 సగటును సూర్య నమోదు చేశాడు. అతితక్కువ బంతుల్లో 2వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా సూర్య ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సూర్య కేవలం 1164 బంతుల్లోనే 2000 పరుగులు సాధించగలిగాడు.
టీ-20 క్రికెట్ చరిత్రలో అతితక్కువ ఇన్నింగ్స్ లో 2వేల పరుగుల రికార్డు సాధించిన బ్యాటర్లలో పాక్ జోడీ బాబర్ అజమ్, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లూ 52 ఇన్నింగ్స్ లోనే 2వేల పరుగులు సాధించగలిగారు.
భారత బ్యాటర్లలో కెఎల్ రాహుల్ 58 ఇన్నింగ్స్ లో 2వేల పరుగులు సాధించడం ద్వారా నాలుగోస్థానంలో నిలిస్తే..కంగారూ మాజీ కెప్టెన్ ఆరోన్ పించ్ 62 ఇన్నింగ్స్ లో 2వేల పరుగుల రికార్డుతో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు.