సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా కొనసాగనున్న గంగూలీ, జైషా
గంగూలీ, జై షాల పదవులకు ఢోకా లేకుండా పోయింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో వాళ్లు మరో పర్యాయం పదవుల్లో ఉండనున్నారు.
బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా సౌరవ్ గంగూలీ, జై షా కొనసాగడానికి మార్గం సుగమమం అయ్యింది. బోర్డు రాజ్యాంగం ప్రకారం వరుసగా రెండు పర్యాయాలు కొనసాగిన తర్వాత మూడో పర్యాయానికి ఏ సభ్యుడికీ వీలు లేదని లోధా కమిటీ బీసీసీఐ రాజ్యంగంలో పొందుపర్చింది. అయితే గంగూలీ, జై షాలు రాష్ట్ర క్రికెట్ కమిటీ, బీసీసీఐలో వరుసగా ఆరేండ్లు మించి పదవిలో ఉన్నారు. దీంతో బీహార్ క్రికెట్ అసోసియేషన్ వారి పదవులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో బీసీసీఐ కూడా బోర్డులో పదవులు చేపట్టిన వారి కాలాన్ని, రాష్ట్ర పదవులతో ముడిపెట్టవద్దని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
కోవిడ్ ముందు నుంచి ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. అయితే ఐసీసీ నిబంధనల మేరకు ప్రతీ బోర్డుకు పూర్తి స్థాయి పరిపాలకులు ఉండాల్సిన నేపథ్యంలో బీసీసీఐ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అత్యవసర ప్రాతిపదిక మంగళ, బుధవారాల్లో విచారించారు. రాష్ట్రాల క్రికెట్ సంఘాలలో పని చేసిన కాలాన్ని బీసీసీఐతో పరిగణించవద్దని, బీసీసీఐ జాతీయ క్రికెట్‌కు సంబంధించి విషయమని కోర్టులో వాదించారు. బీసీసీఐకి మిగిలిన రాష్ట్ర క్రికెట్ సంఘాలు కేవలం శాఖలే కానీ... పూర్తి స్థాయి సభ్యత్వం కలిగి ఉండవని చెప్పారు.
మరోవైపు బోర్డులో ఉండే సభ్యులు, ఉద్యోగులు ఏదైనా ప్రభుత్వ పదవిని/ఉద్యోగాన్ని పొందినా అనర్హులుగా నిర్థారించాలని కూడా కోరారు. దీనిపై బీసీసీఐ తరపు న్యాయవాది వివరణ ఇస్తూ.. బోర్డులో ఉద్యోగులుగా ఉన్న క్రికెటర్లు అనేక ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని.. వాళ్లను కూడా అనర్హులుగా ప్రకటిస్తే ఇక భారత జట్టులో ఒక్క క్రికెటర్ కూడా ఉండడని పేర్కొన్నారు. ఈ వాదనలు అన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పును వెలువరించింది.
గతంలో సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించడానికి కోర్టు ఆమోదం తెలిపింది. ఆఫీస్ బేరర్ల మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పిరియడ్‌ను తొలగించడానికి ఓకే చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్ల కూలింగ్ ఆఫ్ పిరియడ్‌ను తర్వాతి టర్మ్‌కు మార్చడానికి జస్టీస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లి బెంచ్ నిర్ణయం తీసుకున్నది.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గంగూలీ, జై షా మరో టర్మ్ వరకు తమ పదవుల్లో కొనసాగే అవకాశం కలిగింది. కానీ ఆ తర్వాత ఎవరు బీసీసీఐ పదవుల్లో ఉన్నా.. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించాల్సి ఉన్నది.