ప్రపంచకప్ క్వార్టర్స్ లో సూపర్ ఫైట్స్!

ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో దిగ్గజాల సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రేపటినుంచే దోహా వేదికగా జరిగే పోటీలు రసవత్తరంగా సాగనున్నాయి.

Advertisement
Update:2022-12-08 13:04 IST

ప్రపంచకప్ క్వార్టర్స్ లో సూపర్ ఫైట్స్!

ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ లో దిగ్గజాల సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రేపటినుంచే దోహా వేదికగా జరిగే పోటీలు రసవత్తరంగా సాగనున్నాయి.

ఖతర్ వేదికగా జరుగుతున్న 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ సమరంలో మూడో ఘట్టానికి దోహాలోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం వేదికగా రేపు తెరలేవనుంది. డిసెంబర్ 9 నుంచి 11 వరకూ జరుగనున్న క్వార్టర్ ఫైనల్ పోరులో మొత్తం ఎనిమిది అత్యుత్తమజట్లు సెమీస్ లో చోటు కోసం ఢీ కొనబోతున్నాయి.

తొలిక్వార్టర్స్ లో బ్రెజిల్ తో క్రొయేషియా ఢీ..

ప్రపంచకప్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లలో భాగంగా గత వారం రోజులుగా సాగిన పోటీలలో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, రన్నరప్ క్రొయేషియా, ప్రపంచ నంబర్ వన్ టీమ్ బ్రెజిల్, మాజీ చాంపియన్లు అర్జెంటీనా, ఇంగ్లండ్, ఆఫ్రికా సంచలనం మొరాకో, పోర్చుగల్, నెదర్లాండ్స్ జట్లు విజేతలుగా నిలవడం ద్వారా మూడోదశ క్వార్టర్ ఫైనల్ రౌండ్లో అడుగుపెట్టాయి.

మొత్తం 32 జట్ల గ్రూప్ లీగ్ దశ నుంచి 16జట్ల ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్ దశ నుంచి 24 జట్లు నిష్క్ర్రమించగా..ఎనిమిదిజట్లు మాత్రమే టైటిల్ రేసులో మిగిలాయి.

నాలుగు క్వార్టర్ ఫైనల్స్ లోని తొలిపోరు..దోహాలోని ఎడ్యుకేషన్ స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభంకానుంది.

ఈ నాకౌట్ పోరులో ప్రపంచ టాప్ ర్యాంకర్ బ్రెజిల్ తో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా అమీతుమీ తేల్చుకోనుంది. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ లో జపాన్ ను క్రొయేషియా అధిగమిస్తే..దక్షిణ కొరియాను బ్రెజిల్ 4-1 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాయి.

అర్జెంటీనాకు నెదర్లాండ్స్ గండం...

డిసెంబర్ 10న లూసెయిల్ స్టేడియం వేదికగా జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్ల నడుమ రసవత్తర పోరు జరుగనుంది. డచ్ దూకుడుకు మెస్సీసేన ఏవిధంగా పగ్గాలు వేయగలదన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అదేరోజున అల్ తుమామ్ స్టేడియం వేదికగా జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ తో ఆఫ్రికా సంచలనం మొరాకో తలపడనుంది. ప్రీ-క్వార్టర్స్ లో స్విట్జర్లాండ్ ను పోర్చుగల్ 6-1తో చిత్తు చేస్తే..మొరాకో పెనాల్టీ షూటౌట్ ద్వారా స్పెయిన్ ను ఇంటిదారి పట్టించడం ద్వారా క్వార్టర్స్ కు అర్హత సంపాదించాయి.

సంచలనాలకు మరో పేరైన మొరాకో తో టాప్ గేర్ కు చేరుకొన్న పోర్చుగల్ పోరు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.

ఇటు ఇంగ్లండ్..అటు ఫ్రాన్స్...

డిసెంబర్ 11న జరిగే సూపర్ సండే ఆఖరి క్వార్టర్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు ప్రపంచ మాజీ చాంపియన్ ఇంగ్లండ్, ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ తలపడబోతున్నాయి.

సమఉజ్జీల సమరంలా సాగే ఈ పోరు కోసమే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సాకర్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దోహాలోని అల్ బైట్ స్టేడియం ఆఖరి క్వార్టర్ ఫైనల్ కు ఆతిథ్యమిస్తోంది.

డిసెంబర్ 14, 15 తేదీలలో సెమీఫైనల్స్, 18న ఫైనల్స్ నిర్వహిస్తారు. ప్రపంచ చాంపియన్ గా నిలిచిన జట్టుకు ఫిఫా ట్రోఫీతో పాటు 357 కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.

Tags:    
Advertisement

Similar News