విరాట్ కొహ్లీకి సునీల్ గవాస్కర్ చురకలు
ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ ఘోరపరాజయాన్ని అభిమానులు మాత్రమే కాదు..మాజీ కెప్ట్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐసీసీ ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ ఘోరపరాజయాన్ని అభిమానులు మాత్రమే కాదు..మాజీ కెప్ట్టెన్, విఖ్యాత కామెంటీటర్ సునీల్ గవాస్కర్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
లండన్ లోని ఓవల్ వేదికగా ముగిసిన 2023 ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా చేతిలో భారత్ 209 పరుగుల తేడాతో పరాజయం పొందిన తీరు కోట్లాదిమంది అభిమానులకు మాత్రమే కాదు..పలువురు భారత మాజీ క్రికెట్ దిగ్గజాలకు, సునీల్ గవాస్కర్ లాంటి విశ్వవిఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాతకు పట్టలేని ఆగ్రహం తెచ్చి పెట్టింది.
భారతజట్టుపై గవాస్కర్ గరంగరం...
క్రికెట్లో జయాపజయాలు సహజమని..అయితే ఆస్ట్ర్రేలియా లాంటి అత్యంత ప్రమాదకరమైనజట్టుతో ఆడే సమయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న విషయాన్ని రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు మరచిపోయారని భారత మాజీ కెప్టెన్, క్రికెట్ విమర్శకుడు గవాస్కర్ మండిపడ్డారు.
గత దశాబ్దకాలంగా కనీసం ఒక్క ఐసీసీ ప్రపంచ టోర్నీని నెగ్గలేని భారతజట్టు..గత మూడేళ్ల కాలంలో రెండు ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ లో చతికిల పడటం పట్ల గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చేసిన తప్పులే చేస్తూ.....
చేసిన తప్పులే చేయటం భారతజట్టుకు ఓ దురలవాటుగా మారిందని, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోడం మర్చిపోయిందని దుయ్యబట్టారు. ఓవల్ వేదికగా ముగిసిన ఫైనల్స్ లో టాస్ నెగ్గిన క్షణం నుంచి భారతజట్టు తప్పు మీద తప్పు చేస్తూ ప్రత్యర్థిచేతిలో చావు దెబ్బలు తిందని, ఇక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లి బలహీనమైన కరీబియన్ జట్టుతో జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్ నెగ్గడం ద్వారా మీసాలు మెలేసికోవచ్చునంటూ చురకలంటించారు.
బ్యాటింగ్, బౌలింగ్ , ఫీల్డింగ్...ఒకటేమిటి మొత్తం అన్ని విభాగాలలోను ఆస్ట్ర్రేలియా ముందు భారత్ తేలిపోయిందని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని...టెస్టు లీగ్ ఫైనల్ ఓటమి అనంతరం విశ్లేషిస్తూ చెప్పుకొచ్చారు.
2013 లో ఐసీసీ మినీ ప్రపంచకప్ నెగ్గిన నాటినుంచి గత పదేళ్ల కాలంలో భారత్ కనీసం ఒక్కటైటిలూ సాధించలేకపోయిందని, 2023 టెస్టు లీగ్ టైటిల్ నెగ్గడం ద్వారా ఆ లోటును పూడ్చుకొనే అవకాశాన్ని సైతం జారవిడుచుకొందని చెప్పారు.
విమర్శలు భరించాల్సిందే....
1970 దశకంలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో భారత్ 42 పరుగులకే కుప్పకూలిన జట్టులో తాను సభ్యుడనేనని, తమపైన విమర్శలు వెల్లువెత్తాయని, డ్రెస్సింగ్ రూమ్ లో
అవమానభారంతో కృంగిపోయామని, ప్రస్తుత భారతజట్టు సైతం విమర్శలకు ఏమాత్రం అతీతం కాదని తేల్చి చెప్పారు.
తాము చేసిన తప్పులను భారతజట్టు సభ్యులు పదేపదే గుర్తు చేసుకోవాలని, పొరపాట్లను సవరించుకోడం పైన దృష్టి పెట్టాలని సూచించారు.బ్యాటింగ్ లో పసలేదని, బౌలింగ్ పరమచెత్తగా ఉందని, తుది జట్టు ఎంపిక కూర్పు సైతం పరమఅధ్వాన్నంగా ఉందని, ఏ ఒక్కటీ సరిగా చేయలేదని స్పష్టం చేశారు.
వెస్టిండీస్ లాంటి చిన్నజట్లతో జరిగే సిరీస్ ల్లో 2-0 లేదా 3-0తో నెగ్గడం ద్వారా టెస్టు లీగ్ ఫైనల్ ఓటమిని కప్పిపుచ్చుకోలేమని గవాస్కర్ సూటిగా చెప్పారు.
రికార్డుల కోసం ఆడితే అంతేమరి....
రెండు ఇన్నింగ్స్ లోనూ విరాట్ కొహ్లీ అవుటైన తీరును గవాస్కర్ తీవ్రంగా ఆక్షేపించారు. భారత బ్యాటింగ్ ఆర్డర్ కు విరాట్ ఎంతటి కీలక ఆటగాడో అందరికీ తెలుసునని, ఎంతో బాధ్యతతో ఆడాల్సిన విరాట్ తప్పుడు షాట్లను ఎంపిక చేసుకొని భారతజట్టు భారీమూల్యం చెల్లించేలా చేశాడని విమర్శించారు.
మొదటి ఇన్నింగ్స్ లో మిషెల్ స్టార్క్ బౌలింగ్ లో ఓ చెత్తషాట్ కు వెనుదిరిగిన విరాట్...రెండో ఇన్నింగ్స్ లో చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఆడుతూ వచ్చాడని, 49 పరుగుల స్కోరుతో ఉన్న విరాట్ కు హాఫ్ సెంచరీ పూర్తి చేయాలన్న తొందరపాటు మరో తప్పుడు షాట్ ఆడేలా చేసిందని, బోలాండ్ బౌలింగ్ లో ఆడకూడని షాట్ ఆడి స్మిత్ పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడని..విరాట్ లాంటి బ్యాటర్లు ఇంత చెత్తగా ఆడితే భారత్ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.
కవర్ డ్రైవ్ ఆడాలన్న విరాట్ బలహీనతను ఆస్ట్ర్రేలియాజట్టు చాలా తెలివిగా సొమ్ము చేసుకొందని..విరాట్ లాంటి దిగ్గజ బ్యాటర్ ఆడాల్సిన షాట్ అది ఏమాత్రం కాదని గవాస్కర్ వాపోయారు. మొత్తం మీద..భారత్ ఓటమి అంతతేలికగా మరచిపోయేది కాదని గవాస్కర్ తన విశ్లేషణలో కొసమెరుపుగా చెప్పారు.