ఓటమికి కారణం.. బ్యాటింగ్ వైఫల్యమే.. - సునీల్ గవాస్కర్
చివరిరోజు కీలకమైన తరుణంలో భారత బ్యాట్స్‌మెన్స్ ఆట చాలా దారుణంగా ఉందని గవాస్కర్ చెప్పారు. షాట్ సెలెక్షన్ కూడా బాగోలేదని వివరించారు.
ప్రపంచ టెస్ట్ క్రికెట్ (WTC) చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ తెలిపారు. భారత్ రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. కీలకమైన పోరులో భారత్ అన్ని విభాగాల్లో విఫలమై చేజేతులా టైటిల్ చేజార్చుకుంది. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ భారత బ్యాటింగ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తొలి ఇన్నింగ్స్ పాటు రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా బ్యాటింగ్ లో దారుణంగా విఫలమైందని గవాస్కర్ తెలిపారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసిందని, తద్వారా ఆ జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారని వివరించారు. ఇక అక్కడి నుంచి తిరిగి పుంజుకోవడమనేది అంత సులభం కాదని ఆయన చెప్పారు.
చివరిరోజు కీలకమైన తరుణంలో భారత బ్యాట్స్‌మెన్స్ ఆట చాలా దారుణంగా ఉందని గవాస్కర్ చెప్పారు. షాట్ సెలెక్షన్ కూడా బాగోలేదని వివరించారు. మూడోరోజు ఆటలో పుజారా నుంచి ఓ సాధారణ షాట్ చూశామని చెప్పారు. చివరిరోజు ఆటలోనూ అలాంటివే చూశామని తెలిపారు. ఇలాంటి ఆటతో.. విజయాన్ని ఎలా ఆశిస్తారని గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్నా.. ఒక్క సెషన్ కూడా పూర్తిగా ఆడలేకపోయారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.