ఆంధ్ర నాలుగో క్రికెటర్ శ్రీకర్ భరత్!

స్టీల్ సిటీ విశాఖ యువకుడు శ్రీకర్ భరత్ తెలుగుజాతికి, ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణంగా నిలిచాడు.

Advertisement
Update:2023-02-10 12:11 IST

స్టీల్ సిటీ విశాఖ యువకుడు శ్రీకర్ భరత్ తెలుగుజాతికి, ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణంగా నిలిచాడు. భారత టెస్టుజట్టులో చోటు సంపాదించిన నాలుగో ఆంధ్ర క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు....

దేశంలో 30కిపై క్రికెట్ సంఘాలు, భారతజట్టులో చోటు కోసం ఎదురుచూస్తే వందలాదిమంది ప్రతిభావంతులైన యువక్రికెటర్లున్నారు. అయితే ..11 మంది సభ్యుల తుదిజట్టులో చోటు దక్కేది కేవలం 11 మందికి మాత్రమే. అలాంటి అరుదైన ఘనతను ఆంధ్ర క్రికెటర్ , 29 సంవత్సరాల శ్రీకర్ భరత్ దక్కించుకొన్నాడు.

సీకె నాయుడు నుంచి భరత్ వరకూ...

ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలిటెస్టు ద్వారా ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేశాడు. భారత మాజీ కెప్టెన్, శిక్షకుడు, విఖ్యాత కామెంటీటర్ రవిశాస్త్రి చేతుల మీదుగా టెస్టు క్యాప్ అందుకొన్నాడు.

భారత టెస్టు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన 305వ ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. మిస్టర్ 360 హిట్టర్, టీ-20 ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ భారత 304వ టెస్టు క్రికెటర్ గా కాగా..భరత్ 305వ ఆటగాడిగా నిలిచాడు.

1932లో ప్రపంచ క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా టెస్టు అరంగేట్రం చేసిన భారత్ తరపున ప్రస్తుత నాగపూర్ టెస్టు వరకూ 305 మంది ఆటగాళ్లకు మాత్రమే ఆడే అదృష్టం దక్కింది.

నాలుగో ఆంధ్ర క్రికెటర్ భరత్..

టెస్టు క్రికెట్లో భారతజట్టుకు నాయకత్వం వహించడంతో పాటు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడు కర్నల్ కఠారీ కనకయ్యనాయుడు కావటం ఓ ఆంధ్రుడు, తెలుగువాడు కావటం..తెలుగు రాష్ట్ర్రాలకే గర్వకారణం.

ఆ తర్వాత నుంచి రెండు తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన మొత్తం 15 మంది ( కర్నల్ కఠారి కనకయ్య నాయుడు, ఎమ్ ఎల్ జైసింహా,మహ్మద్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, ఎమ్వీ నరసింహారావు, సయ్యద్ అబీద్ అలీ, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, వెంకటపతి రాజు, అంబటి రాయుడు, వేణుగోపాలరావు, మహ్మద్ సిరాజ్, ఎమ్మెస్కే ప్రసాద్, హనుమ విహారి, శ్రీకర్ భరత్ ) వివిధ పార్మాట్లలో భారతజట్లకు ప్రాతినిథ్యం వహించారు.

అయితే..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో మాత్రం..ఆంధ్రకు చెందిన నలుగురికి మాత్రమే భారతజట్టు తరపున ఆడే అరుదైన అవకాశం దక్కింది. సీకె నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్, హనుమ విహారీ తర్వాత కెఎస్ భరత్ నాలుగో ఆంధ్ర క్రికెటర్ గా నిలిచాడు.

భారత్ తరపున తెలుగు రెండో వికెట్ కీపర్

భారత టెస్టు జట్టుకు ఆడిన రెండో ఆంధ్ర, తెలుగు వికెట్ కీపర్ బ్యాటర్ గా శ్రీకర్ భరత్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించి..విశాఖలో స్థిరనివాసం ఏర్పరచుకొన్న భరత్ దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ సత్తా చాటుకొన్నా , భారత ఏజట్టుకు పలుమార్లు ప్రాతినిథ్యం వహించినా..

భారత సీనియర్ జట్టులో చోటు కోసం గత కొద్దిసంవత్సరాలుగా ఎదురుచూస్తూ వచ్చాడు.

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అందుబాటులో లేకపోడంతో ఆలస్యంగానైనా అదృష్టం వచ్చి భరత్ తలుపులు తట్టింది.

కుటుంబసభ్యుల సమక్షంలో...

తల్లి, భార్య, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో టెస్టు క్యాప్ అందుకోడం తన క్రికెట్ జీవితంలో మరువలేని ఘట్టమని..టెస్టు అరంగేట్రం చేసిన శ్రీకర భరత్ భావోద్వేగంతో ప్రకటించాడు.

తన మొట్టమొదటి టెస్టుమ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే ఆస్ట్ర్రేలియా దిగ్గజ ఆటగాడు, టెస్టు క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ ల‌బూషేన్‌ (49)ను స్టంపౌట్ గా భరత్ పడగొట్టాడు.

నెరవేరిన చిరకాల స్వప్నం...

భార‌త జ‌ట్టుకు ఆడాలనేది దేశంలోని ప్రతి ఒక్క క్రికెట‌ర్ క‌ల‌.భారతజట్టులో చోటు కోసం గత కొద్ది సంవత్సరాలుగా ఎదురుచూసిన తన కల నెరవేరడం అదృష్టమని

భ‌ర‌త్ పొంగిపోతూ చెప్పాడు.’ఇది చాలా గ‌ర్వించ‌ద‌గ్గ క్ష‌ణం. మ‌న‌సులో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. భారత టెస్టు జట్టుకు ఆడాల‌నేది నా ఒక్క‌డి క‌ల మాత్రమే కాదు, నేను జాతీయ జ‌ట్టుకు ఆడాల‌ని చాలామంది కోరుకున్నారు. ఈ రోజు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. ఇన్నాళ్లుగా జ‌ట్టు స‌భ్యులు, కోచ్‌లతో పాటు కుటుంబం, నా భార్య‌, స్నేహితులు నాకు చాలా మ‌ద్ద‌తుగా నిలిచారు. వాళ్ల స‌హ‌కారం లేక‌పోతే ఇది సాధ్యం కాక‌పోయేది. నా వెన్నంటి నిలిచిన అందరికీ ఎంతో రుణ‌ప‌డి ఉంటాను’ అని భ‌ర‌త్ తెలిపాడు.

అంతేకాదు త‌న‌పై ఎంతో న‌మ్మ‌కం ఉంచిన కోచ్‌ను ఈ సంద‌ర్భంగా భ‌ర‌త్ గుర్తు చేసుకున్నాడు. ‘నేను ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ఆడే రోజుల్లో ఈ రోజు వ‌స్తుంద‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే… భారత్ కు ఆడ‌తానన్న నమ్మ‌కం లేదు. అయితే.. కోచ్ జే. కృష్ణా రావు న‌న్ను న‌మ్మారు. నాలో స‌త్తా ఉంద‌ని అత‌ను గ‌ట్టిగా విశ్వ‌సించారు’ అంటూ తన తొలిగురువును గుర్తు చేసుకొన్నాడు.

భరత్ కు ఏపీ సీఎం అభినందనలు..

భారత టెస్టుజట్టులో చోటు సంపాదించిన విశాఖ యువకుడు శ్రీకర్ భరత్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణంగా నిలిచావంటూ కొనియాడారు. అత్యుత్తమంగా రాణించాలని ఆకాంక్షించారు.

2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన భరత్‌ మొత్తం 78 మ్యాచ్‌లు ఆడి తొమ్మిది సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ (308) సాధించిన తొలి వికెట్‌ కీపర్‌గా ఘనత సాధించాడు. ఈ ప్రతిభతో భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా మారిన భరత్‌ 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌ మినీ వేలంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 191 పరుగులు సాధించిన భరత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి తన జట్టును గెలిపించి సత్తాను చాటాడు.

రెండేళ్ల క్రితం జరిగిన స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు భరత్‌ను బీసీసీఐ ఎంపిక చేసినా కాని అప్పటికే పంత్‌ జట్టులో రాణిస్తుండడంతో తుది జట్టులో భరత్‌కు చోటు దక్కలేదు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్‌ సెంచరీలు, టీ20 క్రికెట్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు కొట్టిన శ్రీకర్‌ భరత్‌ కు నమ్మదగిన వికెట్ కీపర్ గా గుర్తింపు ఉంది.

అరంగేట్రం అదుర్స్....

ఓపెన‌ర్, వికెట్‌కీప‌ర్‌ ఇషాన్ కిష‌న్ నుంచి పోటీ ఎదురైనా కూడా కెప్టెన్ రోహిత్, కోచ్ ద్ర‌విడ్ అత‌డి వైపే మొగ్గు చూపారు. కెప్టెన్ రోహిత్ నమ్మ‌కాన్ని భరత్ వ‌మ్ము చేయ‌లేదు. తొలి టెస్టులో ఉస్మాన్ ఖ‌వాజా ఎల్బీగా ఔట్ కావ‌డంలో అత‌ని పాత్రం ఉంది. సిరాజ్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ వికెట్ కీప‌ర్ భ‌ర‌త్‌ తో సంప్రదించి రివ్యూ తీసుకున్నాడు. అంతేకాదు రెండో సెష‌న్‌లో భ‌ర‌త్ కీల‌క‌మైన ల‌బూషేన్‌ను 49 ర‌న్స్ వ‌ద్ద‌ స్టంప్ ఔట్ చేశాడు. జ‌డేజా ఓవ‌ర్‌లో ఫ్రంట్ ఫుట్ ఆడిన లబుషేన్‌ను రెప్ప‌పాటులో స్టంప్ ఔట్ చేసి సంబ‌రాలు చేసుకున్నాడు.

మొత్తం మీద టెస్టు క్రికెట్ ఆడిన ఆంధ్ర నాలుగో క్రికెటర్ గా తన క్రికెట్ జీవితాన్ని చరితార్థం చేసుకోగలిగాడు.

Tags:    
Advertisement

Similar News