ఆస్ట్రేలియా యువతిపై శ్రీలంక క్రికెటర్ అత్యాచారం, కటకటాలపాలు!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో శ్రీలంక తరపున బరిలోకి దిగిన టాపార్డర్ ఆటగాడు గుణతిలక అత్యాచారం ఆరోపణలపై కటకటాలపాలయ్యాడు.

Advertisement
Update:2022-11-06 10:31 IST

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ లో శ్రీలంక తరపున బరిలోకి దిగిన టాపార్డర్ ఆటగాడు గుణతిలక అత్యాచారం ఆరోపణలపై కటకటాలపాలయ్యాడు. ప్రస్తుతం సిడ్నీ పోలీసుల అదుపులో ఉన్నాడు...

టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 గ్రూప్-1 రౌండ్ నుంచే నిష్క్ర‌మించిన అవమానంతో కుమిలిపోతున్నమాజీ చాంపియన్ శ్రీలంక పరిస్థితి పుండుమీద కారం చల్లిన చందంగా మారింది.

క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి సూపర్ -12 రౌండ్ మ్యాచ్ ల వరకూ శ్రీలంకజట్టు తరపున టాపార్డర్ బ్యాటర్ గా బరిలో నిలిచిన ధనుష్క గుణతిలకను సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అత్యాచారం ఆరోపణలతో కటకటాలలోకి నెట్టారు.

31 సంవత్సరాల గుణతిలక నవంబర్ 2న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సిడ్నీ పోలీసులకు ఫిర్యాదు చేరడంతో అదుపులోకి తీసుకొన్నట్లు శ్రీలంక టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

29 ఏళ్ల మహిళపై అత్యాచారం...

సిడ్నీ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరిరౌండ్ మ్యాచ్ లో పోరాడి 4 వికెట్లతో శ్రీలంక పరాజయం చవిచూసింది. ఈమ్యాచ్ లో పాల్గొనటానికి వచ్చిన సమయంలో గుణతిలక ఓ మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేరింది. దీంతో విచారణ కోసం అదుపులోకి తీసుకొన్నారు. గుణతిలకను విడిచిపెట్టి మిగిలిన శ్రీలంక జట్టు సభ్యులంతా స్వదేశానికి తిరుగుపయనమయ్యారు.

క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలలో నమీబియాతో జరిగిన మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన గుణతిలక ఆ తర్వాత నుంచి గాయంతో తుదిజట్టుకు దూరమయ్యాడు.

తూర్పు సిడ్నీలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఓ క్రికెటర్ ను అరెస్టు చేసినట్లు న్యూసౌత్ వేల్స్ పోలీసులు సైతం తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా సమాచారం ఉంచారు.

తమ విచారణలో గుణతిలక దోషిగా తేలిందని, రోజ్ బే ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల ఓ మహిళపై గుణతిలక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అత్యాచారానికి గురైన మహిళతో గత కొద్దివారాలుగా ఆన్ లైన్ లో గుణతిలక టచ్ లో ఉన్నాడని, డేటింగ్ చేస్తూ వచ్చాడని, చివరకు ఆమె నివాసానికే వెళ్లి అఘాయిత్యం చేశాడని పోలీసులు వివరించారు.

గుణతిలకే దోషిగా తేలితే న్యూసౌత్ వేల్స్ జైలులోనే మగ్గాల్సి ఉంటుంది. ప్రపంచకప్ క్రికెట్ ఆడటానికి వెళ్లి అత్యాచారానికి పాల్పడటం ద్వారా జైలు పాలైన క్రికెటర్ గా గుణతిలక మిగిలిపోక తప్పదు.

కుమార సంగక్కర, మహేల జయవర్థనే, ముత్తయ్య మురళీధరన్, లాసిత్ మలింగ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన శ్రీలంక క్రికెట్ పరువు..గుణతిలక పుణ్యమా అంటూ అంతర్జాతీయంగా బజారు పడక తప్పలేదు.

Tags:    
Advertisement

Similar News