టెస్టు లీగ్ లో సఫారీలు అప్.. ఇండియా డౌన్!

టెస్టు లీగ్ ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఎనిమిది టెస్టులు ఆడిన సఫారీ జట్టు 6 విజయాలతో 72 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా నిలిచింది. డీన్ ఎల్గర్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు మిగిలిన జట్లకంటే ప్రస్తుతం మెరుగైన జట్టుగా కనిపిస్తోంది.

Advertisement
Update:2022-08-20 12:02 IST

ఐసీసీ టెస్టు లీగ్ చాంపియన్ షిప్ లో దక్షిణాఫ్రికా టాప్ గేర్ లో దూసుకుపోతుంటే.. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ అట్టడుగుకు పడిపోయింది. రన్నరప్ భారత్ నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ లోని లార్డ్స్‌ స్టేడియం వేదికగా ఆతిథ్య జట్టుతో ముగిసిన మూడు మ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ విజయం సాధించడం ద్వారా టెస్టులీగ్ పాయింట్ల పట్టిక అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టెస్టు లీగ్ ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఎనిమిది టెస్టులు ఆడిన సఫారీ జట్టు 6 విజయాలతో 72 పాయింట్లు సాధించడం ద్వారా టేబుల్ టాపర్ గా నిలిచింది. డీన్ ఎల్గర్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు మిగిలిన జట్లకంటే ప్రస్తుతం మెరుగైన జట్టుగా కనిపిస్తోంది. కాగా గత సీజన్ టెస్టు లీగ్ విజేత న్యూజిలాండ్, భారత్ టేబుల్ మొదటి మూడుస్థానాలలో నిలవడంలో విఫలమయ్యాయి.

4వ స్థానంలో భారత్..

ఆస్ట్రేలియా జట్టు 70 పాయింట్లు సాధించడం ద్వారా రెండోస్థానంలో కొనసాగుతోంది 53.33 పాయింట్లతో శ్రీలంక మూడు, 52.08 పాయింట్లతో భారత్ నాలుగు స్థానాలలో నిలిచాయి. 51.85 శాతం పాయింట్లతో పాకిస్థాన్ ఐదు, 50 పాయింట్లతో వెస్టిండీస్ ఆరు స్థానాలు సంపాదించాయి. ఇంగ్లండ్ మాత్రం 31.37 శాతం పాయింట్లతో 7వ స్థానంలో ఉంటే.. గత సీజన్ లీగ్ విన్నర్ న్యూజిలాండ్ 25.93 పాయింట్లతో 8వ స్థానానికి పడిపోయింది. 13.33 పాయింట్లతో బంగ్లాదేశ్ లీగ్ టేబుల్ అట్టడుగున నిలిచింది.

సఫారీ దెబ్బకు బజ్ బాల్ ఢమాల్!

బెన్ స్టోక్స్ కెప్టెన్ గా, బ్రెండన్ మెకల్లమ్ చీఫ్ కోచ్ గా ఆడిన గత నాలుగు టెస్టుల్లో తిరుగులేని విజయాలు సాధించడం ద్వారా బజ్ బాల్ శకం ప్రారంభమయ్యిందంటూ నానాహంగామా చేస్తున్న ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమితో నేలమీదకు దిగి వచ్చింది. చరిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన తొలిటెస్టులో దక్షిణాఫ్రికాజట్టు కేవలం మూడురోజుల ఆటలోనే ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో చిత్తు చేసి.. మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు ముగిసే సమయానికి 1-0 ఆధిక్యం సంపాదించింది. స్వదేశంలో ఇంగ్లండ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి పాలుకావడం గత 19 సంవత్సరాలలో ఇదే తొలిసారి. 2003లో సైతం దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగానే ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో ఓటమి చవిచూడటం విశేషం.

సఫారీ పేస్ కు ఇంగ్లండ్ స్మాష్..

స్వదేశంలో అజేయమైన జట్టుగా నిలిచిన ఇంగ్లండ్ ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టులో సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం నోర్జే, రబడా, ఎంగిడీల పేస్ కు బదులు చెప్పలేకపోయింది. టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటకు వానదెబ్బ తగిలినా కేవలం ఆరు సెషన్లలోనే ఇంగ్లండ్ ను రెండుసార్లు ఆలౌట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికా సంచలన విజయం సాధించింది. స్పిన్ జోడీ రబాడ, నోర్జే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ల ముప్పేట దాడికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక..రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కేవలం 37.4 ఓవర్లలోనే 149 పరుగులకే కుప్పకూలిపోయింది. నోర్జే 6 వికెట్లు, రబడ 7 వికెట్లతో చెలరేగిపోయారు. మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ లోనూ కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ కిగిసో రబాడ‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని కీలక రెండోటెస్టు ఆగస్టు 25న ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ప్రారంభమవుతుంది. జో రూట్ నాయకత్వంలో ఆడిన 17 టెస్టుల్లో ఒక్క గెలుపు మాత్రమే సాధించిన ఇంగ్లండ్ జట్టు..గత ఐదుటెస్టులుగా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో పాల్గొంటూ వస్తోంది. భారత్ ను సైతం చిత్తు చేయడం ద్వారా గత ఐదుటెస్టుల్లో నాలుగు విజయాలు సాధించిన ఇంగ్లండ్ కు ఇదే తొలి పరాజయం. ఈ ఓటమి తమకు మేలుకొలుపు లాంటిది ఏమాత్రం కాదని, వ్యూహాలను అనుకొన్నట్లుగా అమలు చేయలేకపోయామని, ఈ ఓటమి దురదృష్టకరమని మ్యాచ్ అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. సిరీస్ లోని రెండోటెస్టులో మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తామని ప్రకటించాడు.

Tags:    
Advertisement

Similar News