బీసీసీఐ నుంచి సౌరవ్ గంగూలీ ఔట్.. చక్రం తిప్పిన అమిత్ షా

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బోర్డు నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇది ఒక రకంగా క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది.

Advertisement
Update:2022-10-12 08:13 IST

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ నెల 18న బీసీసీఐ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) నిర్వహించనున్నారు. అందులోనే బీసీసీఐ కొత్త పాలక మండలి సభ్యుల ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. కాగా, కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇప్పటికే పాలక మండలి సభ్యులుగా ఎవరుండాలనే నిర్ణయం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్కో పదవికి కేవలం ఒకరే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక లాంఛనమే అని తెలుస్తున్నది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బోర్డు నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇది ఒక రకంగా క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. బీసీసీఐ ఇచ్చిన ఆఫర్‌ను గంగూలీ తిరస్కరించడంతో.. అసలు ఏ పదవి కట్టబెట్టకుండా ఆయనను సాగనంపింది.


పవర్ ఫుల్ పోస్టులో జై షా

ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో ఈ నెల 18న ఏజీఎం జరుగనున్నది. కాగా, బీసీసీఐ పాలక మండలి సభ్యుల ఎన్నిక కోసం ఎవరెవరు నామినేషన్లు వేశారో రాజీవ్ శుక్ల మంగళవారం వెల్లడించారు. ఢిల్లీలో పలు దఫాలుగా కేంద్ర మంత్రితో చర్చలు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం జరిగినట్లు ఆయన చెప్పడం గమనార్హం. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. ఆయన ఎన్నిక లాంఛనమే. బీసీసీఐ అధ్యక్షుడు కాగానే, ఆయన కేఎస్‌సీఏ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక బోర్డులో అత్యంత పవర్ ఫుల్ పోస్టు అయిన సెక్రటరీ పదవిలో జై షా కొనసాగనున్నారు. మారిన బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం సెక్రటరీకి మరిన్ని అధికారాలు వచ్చాయి. బీసీసీఐని పూర్తిగా నడిపించే బాధ్యత సెక్రటరీ పైనే ఉంటుంది. దీంతో అమిత్ షా కొడుకు జై షా ఈ పదవిలో మరో దఫా కొనసాగనున్నారు.

పదవులు పంచుకున్నారు..

బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాల్లో బద్ద శత్రువులు. కానీ బీసీసీఐ దగ్గరకు వచ్చే సరికి పదవులు పంచుకోవడం గమనార్హం. గత పాలకమండలిలో ఉన్న రాజీవ్ శుక్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయనకు ఉపాధ్యక్షుడిగా కొనసాగింపు ఇవ్వడం గమనార్హం. జై షా తర్వాత పదవి కొనసాగింపు రాజీవ్ శుక్లాకు మాత్రమే దక్కింది. ఇక బోర్డులో మిగిలిన వాళ్లందరూ బీజేపీకి చెందిన వ్యక్తులే ఉన్నారు. కోశాధికారిగా ఎన్నిక కాబోతున్న ఆశిష్ షెలర్.. ముంబైలోని వంద్రే వెస్ట్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. ఆయన గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక కాబోతున్న దేవ్‌జిత్ సైకియా అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకు అత్యంత ఆప్తుడు. అస్సాం తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన సైకియా.. ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం కోశాధికారిగా ఉన్న అరుణ్ దుమాల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమించనున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడే అరుణ్ దుమాల్. ఇలా బీసీసీసీఐ బోర్డులో కాంగ్రెస్, బీజేపీ పదవులు పంచుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

గంగూలీకి కష్టాలే..

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ పడాలని భావించారు. అయితే, బీసీసీఐ మాత్రం ఆయనకు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవిని ఆఫర్ చేయగా.. గంగూలీ తిరస్కరించారు. బోర్డులో అధ్యక్షుడిగా కొనసాగిన తాను.. అంతకంటే చిన్నపదవకి వెళ్లడం అవమానంగా భావించారు. కాగా, గంగూలీ ఐసీసీ చైర్మన్‌గా నామినేషన్ వేసినా బీసీసీఐ మాత్రం మద్దతు తెలపకూడదని నిర్ణయించుకున్నది. ఇక ఇప్పుడు గంగూలీ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ భవిష్యత్‌కు ప్రస్తుతం ఫుల్ స్టాప్ పడినట్లే అని చర్చ జరుగుతోంది.

బీసీసీఐ అధ్యక్షుడు ఓ ఆంగ్లో-ఇండియన్..

బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఓ ఆంగ్లో-ఇండియన్ కావడం గమనార్హం. రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైఖెల్ హంప్రీ బిన్నీ. రోజర్ బిన్నీ కుటుంబం స్కాట్లాండ్ మూలాలు ఉన్నాయి. ఇండియా తరపున ఆల్‌రౌండర్‌గా ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో బిన్నీ సభ్యుడు. 67 ఏళ్ల బిన్నీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో ఎన్నో పదవులు చేపట్టారు. ప్రస్తుతం కేఎస్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా టీమ్ ఇండియా తరపున క్రికెట్ ఆడాడు. ఆయన కోడలు మయాంక్ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత.

Tags:    
Advertisement

Similar News