కోపా కప్ లో మెస్సీ...యూరోకప్ లో రొనాల్డో రికార్డులు!

ఆధునిక సాకర్ గ్రేట్లు లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఒక్కరోజు వ్యవధిలో అరుదైన ఘనత సాధించారు.

Advertisement
Update: 2024-06-22 03:45 GMT

ఆధునిక సాకర్ గ్రేట్లు లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో ఒక్కరోజు వ్యవధిలో అరుదైన ఘనత సాధించారు.

ప్రపంచ ఫుట్ బాల్ నేటితరం దిగ్గజ ఆటగాళ్ల జోడీ లయనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కేవలం తమకే సాధ్యమైన రికార్డులు నెలకొల్పారు. గత పుష్కరకాలంగా ప్రపంచ సాకర్ ను తమ ఆటతీరుతో ఓలలాడిస్తూ వస్తున్న అర్జెంటీనా స్టార్ లయనల్ మెస్సీ, పోర్చుగీస్ వండర్ క్రిస్టియానో రొనాల్డో లేటు వయసులోనూ అరుదైన ఘనత సాధిస్తూ తమకు తామే సాటిగా నిలిచారు.

కోపా అమెరికా కప్ లో మెస్సీ టాప్...

దక్షిణ అమెరికా ఖండ దేశాల ఫుట్ బాల్ టోర్నీ ..కోపా అమెరికా కప్ లో లయనల్ మెస్సీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అమెరికా వేదికగా జరుగుతున్న 2024 కోపా కప్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అర్జెంటీనా బరిలోకి దిగడమే కాదు..గ్రూపు ప్రారంభమ్యాచ్ లో కెనడాను 2-0 గోల్స్ తో అధిగమించింది.

అట్లాంటా సాకర్ స్టేడియంలో జరిగిన ఈ పోరు రెండోభాగంలో రెండుగోల్స్ సాధించడం ద్వారా అర్జెంటీనా విజేతగా నిలిచింది. జూలియన్ అల్వేరెజ్, లాటారో మార్టినెజ్ చెరో గోలు సాధించడం ద్వారా అర్జెంటీనాకు తొలి విజయం అందించారు.

అయితే..వెటరన్ లయనల్ మెస్సీ గోలు సాధించడంలో సఫలం కాలేకపోయినా..అత్యధిక కోపాకప్ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన కెరియర్ లో 7వ కోపాకప్ లో పాల్గొంటూ 35వ మ్యాచ్ ఆడటం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

ఇప్పటి వరకూ చిలీ గోల్ కీపర్ సెర్గియో లివింగ్ స్టోన్ పేరుతో ఉన్న 34 కోపా మ్యాచ్ ల రికార్డును తెరమరుగు చేశాడు. సెర్గియో 1942 నుంచి 1953 మధ్యకాలంలో ౩౪ మ్యాచ్ లు ఆడటం ద్వారా చరిత్ర సృష్టించాడు.

ప్రపంచకప్ తరహాలోనే నాలుగేళ్లకోమారు కోపా అమెరికా ప్రపంచకప్ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఉరుగ్వే లాంటి జట్లు అర్జెంటీనాకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి.

యూరోకప్ లో రొనాల్డో జోరు....

మరోవైపు..పోర్చుగల్ సూపర్ స్టార్ , మెస్సీ ప్రధాన ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ లో వరుసగా ఆరో యూరోపియన్ కప్ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఓ అసాధారణ రికార్డు నెలకొల్పాడు.

జర్మనీ వేదికగా జరుగుతున్న 2024 యూరోకప్ గ్రూప్ - డీ లీగ్ పోరులో చెక్ రిపబ్లిక్ తో లీప్ జిగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా రొనాల్డో ఈ ఘనత సాధించాడు. ఆరువేర్వేరు యూరోకప్ టోర్నీలలో పాల్గొన్న తొలి, ఏకైక ఆటగాడిగా రొనాల్డో చరిత్ర సృష్టించాడు.

2004 యూరోకప్ లో టీనేజర్ గా అరంగేట్రం చేసిన రొనాల్డో 2008, 2012, 2016, 2020 టోర్నీలలో పాల్గొనడమే కాదు..ప్రస్తుత 2024 చాంపియన్షిప్ లో సైతం ఆడుతూ డబుల్ హ్యాట్రిక్ టోర్నీలు ఆడిన మొనగాడిగా నిలిచాడు.

2016 యూరోకప్ టోర్నీలో రొనాల్డో కెప్టెన్ గా పోర్చుగల్ విజేతగా నిలిచింది. ఎనిమిదేళ్ల విరామం తరువాత తిరిగి మరోసారి తనజట్టును చాంపియన్ గా నిలపడం కోసం రొనాల్డో 39 సంవత్సరాల లేటు వయసులో పోటీకి దిగడం విశేషం.

ఇటు రొనాల్డో..అటు మెస్సీల కెరియర్ లో ఇదే ఆఖరి యూరోకప్, కోపాకప్ టోర్నీలు కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News