సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లను కొన్న ఐపీఎల్ ఫ్రాంచైజీలు

మొదట ఆరు జట్లతో సీఎస్ఏ టీ20 లీగ్ ప్రారంభం కానున్నది. వేలం ద్వారా కాకుండా ఆడిట్ అండ్ కన్సల్టెన్సీ ప్రాసెస్ ద్వారా ఆరు జట్లను ఎంపిక చేసింది.

Advertisement
Update:2022-07-19 09:00 IST

ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న రెండో క్రీడ క్రికెట్. టెస్టు క్రికెట్ మొదలైనప్పుడు దీన్ని ఆడేవాళ్లు, చూసే వాళ్లు చాలా తక్కువే. కానీ ఫార్మాట్లు మారుతున్న కొద్దీ ఆదరించే ప్రేక్షకులు కూడా పెరిగారు. వన్డే క్రికెట్ ఆటకు జీవం పోస్తే.. టీ20 ఫార్మాట్ ఈ క్రీడను వ్యాపార పరంగా ఉన్నత శిఖరాలకు చేర్చింది. బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఐపీఎల్ ఎంత పాపులరో చెప్పనవసరం లేదు. ఆ లీగ్ సూపర్ హిట్ అవడంతో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమకు సొంతమైన లీగ్స్‌ను ప్రారంభించాయి. అవన్నీ కూడా తగిన ఆదరణే పొందాయి. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ఏ లీగ్ కూడా ఐపీఎల్‌ను మాత్రం మించలేదు.

ఐపీఎల్‌ను దాటేయాలని ఏ క్రికెట్ బోర్డు కలలు కనడం లేదు. కానీ అలాంటి లీగ్ ద్వారా మరింత ఆదాయాన్ని పొందాలని మాత్రం కోరుకుంటోంది. ఈ క్రమంలోనే బిగ్‌బాష్, కరేబియన్ క్రికెట్ లీగ్ వంటివి పాపులర్ అయ్యాయి. చాన్నాళ్లుగా క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ) కూడా ఒక టీ20 లీగ్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఫార్మాట్ మార్చి ఒక కొత్త లీగ్ ఆడించాలని ప్రయత్నించినా.. అది విఫలం అయ్యింది. దీంతో టీ20 ఫార్మాట్‌లోనే క్రికెట్ లీగ్ నిర్వహించడానికి రంగం సిద్దం చేసింది.

మొదట ఆరు జట్లతో సీఎస్ఏ టీ20 లీగ్ ప్రారంభం కానున్నది. వేలం ద్వారా కాకుండా ఆడిట్ అండ్ కన్సల్టెన్సీ ప్రాసెస్ ద్వారా ఆరు జట్లను ఎంపిక చేసింది. ఆ జట్లన్నింటినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం గమనార్హం. 2023 జనవరి నుంచి ప్రారంభం కానున్న సీఎస్ఏ టీ20 లీగ్‌కు కమిషనర్‌గా మాజీ క్రికెట్ గ్రేమ్ స్మిత్‌ను నియమించారు. ఒక అంతర్జాతీయ క్రికెటరే టీ20 లీగ్ హెడ్‌గా ఉండటం ఇదే తొలిసారి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోర్ట్ ఎలిజబెట్ జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రిటోరియా జట్టును ఢిల్లీ క్యాపిటల్స్, డర్బన్ జట్టును లక్నో సూపర్ జెయింట్స్, జొహన్నెస్‌బర్గ్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్, కేప్ టౌన్ జట్టును ముంబై ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఫ్రాంచైజీలతో అగ్రిమెంట్ల వ్యవహారాన్ని డెలాయిట్ కంపెనీ పర్యవేక్షిస్తున్నది. అది పూర్తికాగానే ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా జట్ల వివరాలను సీఎస్ఏ ప్రకటించనున్నది.

క్రికెట్ సౌత్ ఆఫ్రికానే ఈ లీగ్‌ను పూర్తిగా నిర్వహిస్తోంది. అయితే దీనికి ఐడియా మాత్రం ఐపీఎల్ మాజీ సీవోవో సుందర్ రామన్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. లీగ్ ఏర్పాటు, విధివిధానాలు, ఫార్మాట్ మొత్తం ఆయనే రూపొందించినట్లు సమాచారం. ఒక సారి జట్లను ప్రకటించిన తర్వాతే.. బ్రాడ్‌కాస్ట్ రైట్స్ అమ్మకాలను సీఎస్ఏ ప్రారంభించనున్నది. అలాగే ఆటగాళ్ల కొనుగోలు, తొలి సీజన్ షెడ్యూల్ వివరాలు కూడా ఆ తర్వాతే రూపొందించనున్నారు.

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడాల్సి ఉన్నది. కానీ కొత్త లీగ్ జనవరిలో ప్రారంభించనుండటంతో ఆ సిరీస్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. కోవిడ్ కారణంగా పలు ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు కావడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదాయం లేక అల్లాడుతున్నది. టీ20 లీగ్ నిర్వహించడం ద్వారా క్రమమైన ఆదాయాన్ని పొందే వీలుండటంతోనే దీనికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News