7 మాసాల్లో 7గురు కెప్టెన్లు, భారత్ అరుదైన రికార్డు!

క్రీడలు ఏవైనా కెప్టెన్ లేదా సారథి ఒక్కరే ఉంటారు. అయితే భారత అనధికారిక జాతీయక్రీడ క్రికెట్లో మాత్రం గత ఏడుమాసాలలో ఏడుగురు కెప్టెన్లు తెరమీదకు వచ్చారు.

Advertisement
Update:2022-08-18 11:56 IST

క్రీడలు ఏవైనా కెప్టెన్ లేదా సారథి ఒక్కరే ఉంటారు. అయితే భారత అనధికారిక జాతీయక్రీడ క్రికెట్లో మాత్రం గత ఏడుమాసాలలో ఏడుగురు కెప్టెన్లు తెరమీదకు వచ్చారు.

క్రికెట్ మూడు విభాగాలలోనూ ( సాంప్రదాయ టెస్టు క్రికెట్, 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌, 20 ఓవర్ల ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ ) ముగ్గురు వేర్వేరు ఆటగాళ్లు భారతజట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకొన్నారు.

2022 క్రికెట్ సీజన్లో ఇప్పటి వరకూ భారతటెస్టుజట్టుకు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, జస్ ప్రీత్ బుమ్రా ) నాయకులుగా వ్యవహరించారు. వన్డే క్రికెట్లో రాహుల్, రోహిత్, శిఖర్ ధావన్ జట్టు పగ్గాలు చేపడితే...టీ-20 క్రికెట్లో రోహిత్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.

శ్రీలంక సరసన భారత్.....

క్రికెట్ చరిత్రలో..ఒక సీజన్లో ఒకేజట్టుకు ఏడుగురు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించిన రికార్డు శ్రీలంక పేరుతో ఉంది. అదే రికార్డును 2022 క్రికెట్ సీజన్లో భారతజట్టుకు

ఏడుగురు వేర్వేరు క్రికెటర్లు నాయకత్వం వహించడంతో రికార్డు సమమయ్యింది.

గతంలో క్రికెట్ మూడు ఫార్మాట్లలోనో భారతజట్టుకు నాయకత్వం వహించిన విరాట్ కొహ్లీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. 2021 టీ-20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే కొహ్లీ నుంచి భారతజట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ... న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌తో కెప్టెన్‌గా తన ప్రస్థానం ప్రారంభించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరల్డ్‌కప్‌ రన్నరప్‌ కివీస్‌ను భారత్ 3-0తో చిత్తు చేయడంతో అద్వితీయ విజయం అందుకున్నాడు.

అప్పటి నుంచి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ విజయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ తర్వాత స్వదేశంలో రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌లలో 3-0తో వైట్‌వాష్‌ చేసింది. అదే జోష్‌లో సొంతగడ్డపై.. శ్రీలంకకు చుక్కలు చూపించి టీ- 20 సిరీస్‌ను 3-0తో.. వన్డే సిరీస్‌ను, 2-0తో గెలుచుకోడం ద్వారా క్లీన్‌స్వీప్‌ రికార్డు నమోదు చేశాడు.

విదేశీ గడ్డ మీద..

ఆ తర్వాత.. ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన రోహిత్‌ సేన.. బట్లర్‌ బృందానికి సైతం చుక్కలు చూపింది. టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌లను 2-1తో గెలిచి ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఝలక్‌ ఇచ్చింది. ఇక కరీబియన్ గడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను సైతం భారత్ 4-1తో సొంతం చేసుకొంది.

పరిమిత ఓవర్ల వైట్ బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా రోహిత్ ఎనిమిదికి ఎనిమిది సిరీస్ లు నెగ్గడం ద్వారా వారేవ్వా అనిపించుకొన్నాడు.

ఈ నెల 27 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగనున్న ఆసియాకప్ టోర్నీలో సైతం భారతజట్టుకు రోహిత్ నాయకత్వం వహించనున్నాడు.

మరోవైపు జింబాబ్వే గడ్డపై జింబాబ్వేతో జరిగే టీ-20 సిరీస్ లో కెఎల్ రాహుల్, వన్డే సిరీస్ లో శిఖర్ ధావన్ భారతజట్లకు కెప్టెన్లుగా ఉన్నారు.

తగిన అవకాశాలు ఇచ్చిన తర్వాతే- గంగూలీ

క్రికెట్ కెప్టెన్సీలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. విరాట్ కొహ్లీ దూకుడైన నాయకుడైతే...మహేంద్ర సింగ్ ధోనీ కూల్ కూల్ కెప్టెన్. ఈ ఇద్దరికీ భిన్నమైన కెప్టెన్ రోహిత్ శర్మ.

ఐపీఎల్ లో ముంబైని ఐదుసార్లు విజేతగా నిలిపిన ఘనత, అత్యంత విజయవంతమైన ఐపీఎల్ సారథిగా రోహిత్ కు తిరుగులేని రికార్డే ఉంది. అయితే..భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ సామర్థ్యాన్ని అంచనావేయాలంటే తగిన అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్ గా రోహిత్ కు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా నిలదొక్కుకోడానికి అవకాశమివ్వాలని..ఆ తర్వాతే ధోనీ లేదా కొహ్లీతో పోల్చితే సబబుగా ఉంటుందని చెప్పాడు.

భారతజట్టు ఓ సీజన్లో ఆడాల్సిన సిరీస్ లు, మ్యాచ్ ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోడంతో..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ జట్ల కూర్పు, ఆటగాళ్లు, కెప్టెన్ల మార్పు అనివార్యమని చైర్మన్ గంగూలీ తేల్చి చెప్పాడు.

గత ఏడుమాసాలలో ఏడుగురు కెప్టెన్లను మార్చిన భారత్..రానున్న కొద్ది మాసాలలో మరెందరి కెప్టెన్లను మార్చుతుందో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.

Tags:    
Advertisement

Similar News