ప్రపంచ బాక్సింగ్ లో భారత్ కు జంట స్వర్ణాలు!

2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ లో భారత్ జంట స్వర్ణాలతో బోణీ కొట్టింది. హర్యానా బాక్సర్లు నీతూ గంగాస్, స్వీటీ బూరా బంగారు పతకాలు సాధించారు..

Advertisement
Update:2023-03-26 10:58 IST

2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ లో భారత్ జంట స్వర్ణాలతో బోణీ కొట్టింది. హర్యానా బాక్సర్లు నీతూ గంగాస్, స్వీటీ బూరా బంగారు పతకాలు సాధించారు..

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ మహిళా బాక్సింగ్ లో ఆతిథ్య భారత్ రెండు బంగారు పతకాలతో ఖాతా తెరిచింది. మొత్తం నాలుగు విభాగాల ఫైనల్స్ కు భారత బాక్సర్లు అర్హత సంపాదించారు.

ముందుగా జరిగిన 48 కిలోలు, 81 కిలోలు విభాగాలలో భారత బాక్సర్లు నీతూ గంగాస్, స్వీటీ బూరాలకు ఎదురేలేకపోయింది.

నీతూకి తొలి ప్రపంచ టైటిల్...

మహిళల 48 కిలోల విభాగం టైటిల్ సమరంలో భారత బాక్సర్ నీతూ గంగాస్ చెలరేగిపోయింది. 5-0తో మంగోలియా బాక్సర్ లుత్సాయ్ ఖాన్ అల్టాన్ సెట్ సెగ్ ను చిత్తు చేసింది.

మొత్తం ఐదురౌండ్ల ఈ పోరు..మొదటి రెండురౌండ్లలో నీతూ దూకుడు వ్యూహాన్ని పాటించడం ద్వారా పైచేయి సాధించింది. నీతూ పంచ్ లకు ప్రత్యర్థి నుంచి బదులే లేకపోయింది.

అయితే..కీలక మూడోరౌండ్లో మంగోలియా బాక్సర్ ఎదురుదాడికి దిగినా నీతూ పటిష్టమైన డిఫెన్స్ తో నిలువరించగలిగింది. నిర్ణయాత్మక ఆఖరి రౌండ్ లో నీతూ పూర్తి స్థాయిలో చెలరేగి 5-0 విజయంతో బంగారు పతకం అందుకొంది. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణపతకం నెగ్గిన 22 సంవత్సరాల నీతూ..ప్రపంచ పోటీలలో బంగారు పతకం సాధించడం ద్వారా సత్తా చాటుకోగలిగింది.

స్వీటీ బంగారు కల నిజమాయెగా!

భారత సీనియర్‌ బాక్సర్‌ స్వీటీ బూర తన చిరకాల స్వప్నాన్ని ఎట్టకేలకు నెరవేర్చుకోగలిగింది. మహిళల 81 కిలోల విభాగంలో రెండుసార్లు మెడలిస్ట్, చైనా బాక్సర్ వాంగ్ లీనాతో జరిగిన టైటిల్ సమంరలో భారత బాక్సర్ స్వీటీ బూరా విజేతగా నిలిచింది.

ఫైనల్లో చైనా బాక్సర్‌ వాంగ్‌ లినాపై 4-3 తేడాతో స్వీటీ విజయం సాధించింది. అయితే, ఫైనల్లో ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది. ఆఖరికి స్వల్ప తేడాతో సవీటి విజేతగా బంగారు పతకం సొంతం చేసుకుంది.

ప్రపంచ టైటిల్ సాధించాలన్న లక్ష్యాన్ని తన చివరి ప్రయత్నంలో చేరుకోగలిగింది. చివరిసారి 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం తో సరిపెట్టుకొన్న స్వీటీ..తొమ్మిదేళ్ల విరామం తర్వాత పసిడి పతకాన్ని కైవసం చేసుకొంది. శ బౌట్‌ విషయానికొస్తే ఎలాగైనా పసిడి దక్కించుకోవాలన్న పట్టుదలతో పోటీకి దిగిన స్వీటీకి చైనా బాక్సర్‌ నుంచి ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్‌లో స్వీటీ సంధించిన పంచ్‌లు పట్టుతప్పాయి. అయితే చైనా బాక్సర్‌ ఎత్తుగడను అంచనా వేసిన స్వీటీ గురితప్పని పంచ్‌లతో పోటీలో నిలిచింది. దీంతో రెండో రౌండ్‌ ముగిసే సరికి ఈ హర్యానా బాక్సర్‌ 3-2 ఆధిక్యం సాధించింది.. అయితే మూడో రౌండ్‌లో ప్రత్యర్థి పంచ్‌ల నుంచి తప్పుకొంటూ..ఎదురుదాడికి దిగడం ద్వారా జాబ్స్‌, హుక్స్‌తో పైచేయి సాధించింది. మొత్తంగా తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ఈ హర్యానా బాక్సర్‌ ప్రపంచ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ రోజు జరిగే మిగిలిన రెండు విభాగాలలో భారత బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గెయిన్ స్వర్ణపతకాల కోసం పోటీపడనున్నారు.

ఆసియా క్రీడలకు నిఖత్‌, లవ్లీనా అర్హత..

చైనా వేదికగా జరుగనున్న 2023 ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ కు భారత యువ బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గోహై అర్హత సాధించారు. ప్రస్తుత ప్రపంచ బాక్సింగ్ లో తమతమ విభాగాల ఫైనల్స్ చేరడం ద్వారా ఈ ఇద్దరు బాక్సర్లు ఆసియాక్రీడల బెర్త్ లు ఖాయం చేసుకోగలిగారు.

పారిస్‌(2024) ఒలింపిక్స్‌కు తొలి అర్హత టోర్నీగా భావిస్తున్న హంగ్జు ఆసియా గేమ్స్‌లో నిఖత్‌, లవ్లీన భారత్‌ తరఫున బరిలోకి దిగుతారని తెలిపాడు. ఆసియా గేమ్స్‌లో మహిళా బాక్సర్లు మొత్తం ఐదు తరగతుల(51కిలోలు, 57కిలోలు, 60కిలోలు, 69కిలోలు, 75కిలోలు) విభాగాలలో పోటీ పడనున్నారు.

భారత్ కు 12వ ప్రపంచ పతకం..

నీతూ, స్వీటీ విజయాలతో భారత్ ప్రపంచ బాక్సింగ్ మహిళల విభాగంలో సాధించిన బంగారు పతకాల సంఖ్య 12కు చేరింది. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ 2002, 06, 08, 2010, 2018 ప్రపంచ టోర్నీలలో స్వర్ణపతకాలు సాధించగా..2006లో సరితా దేవి, జెన్నీ, లేఖ, 2022లో ప్రపంచ బాక్సింగ్ పోటీలలో నిఖత్ జరీన్ బంగారు పతకాలు సాధించిన భారత మహిళా బాక్సర్లలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News