సంజు బ్యాటింగ్ పవర్...సఫారీగడ్డపై భారత్ సిరీస్ విన్నర్!

సంజు శాంసన్ ఫైటింగ్ సెంచరీతో సఫారీగడ్డపై భారత్ ఐదేళ్ల తరువాత తొలి వన్డే సిరీస్ విక్టరీ నమోదు చేసింది. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 78 పరుగులతో విజేతగా నిలిచింది.

Advertisement
Update:2023-12-22 08:06 IST

సంజు శాంసన్ ఫైటింగ్ సెంచరీతో సఫారీగడ్డపై భారత్ ఐదేళ్ల తరువాత తొలి వన్డే సిరీస్ విక్టరీ నమోదు చేసింది. నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 78 పరుగులతో విజేతగా నిలిచింది......

దక్షిణాఫ్రికాలో నెలరోజుల పర్యటనలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ వరుసగా రెండో సిరీస్ విజయం సాధించింది. తీన్మార్ టీ-20 సిరీస్ ను 1-1తో సొంతం చేసుకొన్న భారత్...మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1తో గెలుచుకోగలిగింది.

8 ఏళ్ళ తర్వాత సంజు- 5ఏళ్ళ తర్వాత భారత్...

ఫాస్ట్, బౌన్సీ పిచ్ లకు మరో పేరైన దక్షిణాఫ్రికాగడ్డపై భారత్ ఐదేళ్ల విరామం తర్వాత తొలివన్డేసిరీస్ నెగ్గితే..వన్డే అరంగేట్రం చేసిన 8 సంవత్సరాల తరువాత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన తొలిశతకాన్ని నమోదు చేయగలిగాడు.

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో రెండుజట్లు చెరోమ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో..సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే రెండుజట్లకూ డూ ఆర్ డైగా మారింది.

పార్ల్ లోని బోలాండ్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నెగ్గితీరాల్సిన భారత్ 78 పరుగుల భారీవిజయంతో సిరీస్ విజేతగా నిలిచింది.

వన్ డౌన్ లో సంజు షో....

కీలక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ యువఓపెనింగ్ జోడీ రజత్ పాటిదార్- సాయి సుదర్శన్ ఆశించిన స్థాయిలో ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు.

గత రెండువన్డేలలో హాఫ్ సెంచరీలు బాదిన సాయి సుదర్శన్ 16 బంతుల్లో 10 పరుగులు, అరంగేట్రం వన్డే ఆడుతున్న రజత్ పాటిదార్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 22 పరుగుల స్కోర్లకు అవుట్ కావడంతో భారత్ 49 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

అయితే...దారి తప్పిన తమజట్టును తిరిగి గాడిలో పెట్టడానికి వన్ డౌన్ సంజు శాంసన్, రెండో డౌన్ రాహుల్ తమవంతుగా పోరాడారు. ఎనిమిదేళ్ల క్రితం భారత్ తరపున వన్డే అరంగేట్రం చేసినా తగిన అవకాశాలు లేక అల్లాడుతున్న సంజు శాంసన్ తొలిసారిగా వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగడం ద్వారా సత్తా చాటుకొన్నాడు.

బ్యాటింగ్ కు అనువుగా లేని పిచ్ పైన తనదైన ఎటాకింగ్ శైలిని పక్కన పెట్టి ఎక్కడలేని సంయమనంతో ఆడి జట్టుకు ఊపిరిపోశాడు.

4వ వికెట్ కు తిలక్ తో సెంచరీ భాగస్వామ్యం...

రెండోడౌన్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రాహుల్ 35 బంతుల్లో 21 పరుగులకే అవుట్ కావడంతో భారత్ 101 పరుగుల వద్ద 3వ వికెట్ నష్టపోయింది. దీంతో రాహుల్ స్థానంలో క్రీజులోకి వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ వచ్చి సంజుతో చేరాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ సఫారీబౌలర్లను దీటుగా ఎదుర్కొనడంతో పాటు..4వ వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యంతో తమజట్టుకు గట్టి పునాది వేశారు.

తన తొలి 9 పరుగులు సాధించడానికి 38 బంతులు ఎదుర్కొన్న తిలక్ ఆ తరువాత గేరు మార్చాడు. ఆ తర్వాతి 39 బంతుల్లోనే 43 పరుగులు జోడించడం ద్వారా వన్డేలలో తన తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీని సాధించి 52 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

మరోవైపు..సంజు శాంసన్114 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులతో తన తొలి అంతర్జాతీయ శతకం సాధించగలిగాడు. మిడిలార్డర్లో రింకూ సింగ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగుల స్కోరు చేయగలిగింది.

మొదటి 30 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేసిన భారత్..చివరి 14 ఓవర్లలో 141 పరుగులు దండుకోగలిగింది.

సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ 3, బర్గర్ 2, కేశవ్ మహారాజ్, మర్కరమ్, విలియమ్స్ తలో వికెట్ పడగొట్టారు.

అర్షదీప్' స్వింగ్' మ్యాజిక్....

పేస్ , స్పిన్ బౌలర్లకు అనువుగా ఉన్న పిచ్ పైన మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 297 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికాజట్టుకు ఓపెనింగ్ జోడీ రీజా- టోనీ 59 పరుగుల మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

19 పరుగుల స్కోరుకు రిజాను అర్షదీప్ పడగొడితే...వన్ డౌన్ డూసెన్ ను స్పిన్నర్ అక్షర్ 2 పరుగులకే పెవీలియన్ దారి పట్టించాడు. ఓపెనర్ టోనీతో కలసి కెప్టెన్ మర్కరమ్ మూడో వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినా..భారత బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొడుతూ సఫారీ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేశారు.మర్కరమ్ 26, క్లాసెన్ 21, మిల్లర్ 10 పరుగుల స్కోర్లకు వెంట వెంటనే అవుట్ కావడంతో ఆతిథ్యజట్టు మరి కోలుకోలేకపోయింది.

ఓపెనర్ టోనీ 87 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 పరుగుల స్కోరుకు అవుట్ కావడంతో భారత్ గెలుపు ఖాయమైపోయింది. చివరకు సఫారీటీమ్ 45.5 ఓవర్లలో 218 పరుగుల స్కోరుకే ఆలౌట్ కావడం ద్వారా 78 పరుగుల ఓటమితో సిరీస్ చేజార్చుకొంది.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు, సుందర్, ఆవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు, ముకేశ్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్...భారత్ విజయంలో తన ఫైటింగ్ సెంచరీతో ప్రధానపాత్ర వహించిన సంజు శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టిన అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.

దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికా గడ్డపై 2017-18 సీజన్ తరువాత భారత్ మరోసారి వన్డే సిరీస్ నెగ్గడం ఇదే మొదటిసారి. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా 1992-93 సిరీస్ నుంచి ప్రస్తుత 2023 -24 వరకూ ఏడు సిరీస్ ల్లో తలపడితే భారత్ రెండుసార్లు, సఫారీ టీమ్ 5సార్లు విజేతగా నిలిచాయి.

ఈ సిరీస్ విజయంతో 2023 వన్డే సీజన్ ను భారత్ అత్యధికంగా 27 విజయాల రికార్డుతో ముగించింది. ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వన్డే విజయాలు సాధించినజట్టు రికార్డు ఆస్ట్ర్రేలియా పేరుతో ఉంది. 2003 సీజన్లో కంగారూజట్టు 30 విజయాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రస్తుత 2023 సీజన్లో భారత్ 27వ విజం సాధించడం ద్వారా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఈనెల 26 నుంచి జరిగే 2 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ తో టెంబు బవుమా కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా పోటీపడనుంది.

Tags:    
Advertisement

Similar News