రన్నరప్ ట్రోఫీతో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కు సానియా అల్విదా!
36 సంవత్సరాల వయసులో ఆఖరిటోర్నీగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో పాల్గొన్న సానియా మిక్సిడ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీతో తన కెరియర్ కు స్వస్తి పలికింది.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో సానియా అధ్యాయం ముగిసింది. 36 సంవత్సరాల వయసులో ఆఖరిటోర్నీగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లో పాల్గొన్న సానియా మిక్సిడ్ డబుల్స్ రన్నరప్ ట్రోఫీతో తన కెరియర్ కు స్వస్తి పలికింది...
ఎంతటి గొప్పప్రయాణమైనా ఎక్కడో ఒకచోట ఆగిపోక తప్పదు. భారత టెన్నిస్ క్వీన్ సానియా రెండున్నర దశాబ్దాల టెన్నిస్ ప్రస్థానానికి తెరపడింది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రస్తుత సీజన్ తొలిగ్రాండ్ స్లామ్ టోర్నీ- 2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ లో రోహన్ బొపన్నతో జంటగా టైటిల్ వేటకు దిగి..ఫైనల్స్ వరకూ వచ్చిన సానియా..రన్నరప్ ట్రోఫీతో తన గ్రాండ్ స్లామ్ కెరియర్ కు స్వస్తిపలికింది.
మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన మిక్సిడ్ డబుల్స్ టైటిల్ సమరంలో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ- రఫియేల్ మాటోస్ 7-6, 6-2తో సానియా-రోహన్ ల జంటను ఓడించడం ద్వారా విజేతలుగా నిలిచారు.
14 సంవత్సరాల చిరుప్రాయంలో తన టెన్నిస్ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన సానియా..గతంలో ఏ భారత మహిళా టెన్నిస్ ప్లేయర్ సాధించిన విజయాలు, ఘనతల్ని సొంతం చేసుకొంది.
2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ తో తాను రిటైర్ కాబోతున్నట్లు కొద్దివారాల క్రితమే ప్రకటించిన సానియా చివరిసారిగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ బరిలో నిలిచింది. మహిళల డబుల్స్ లో పరాజయం ఎదురైనా..మిక్సిడ్ డబుల్స్ లో మాత్రం భారత డేవిస్ కప్ డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొప్పన జోడీగా పోటీకి దిగి ఫైనల్స్ వరకూ రాగలిగింది.
6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో గుడ్ బై..
హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ టెన్నిస్ లోకి రాకెట్లా దూసుకొచ్చిన సానియా 2009లో తన మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను మెల్బోర్న్ వేదికగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లోనే సాధించింది. కెరియర్ లో ఆఖరి గ్రాండ్ స్లామ్ రన్నరప్ ట్రోఫీని సైతం ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ లోనే సాధించడం విశేషం.
తన కెరియర్ లో ఇప్పటికే మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో ఎన్నో అపూర్వ విజయాలు సాధించిన సానియా ..వేర్వేరు భాగస్వాములతో మూడు మిక్సిడ్ డబుల్స్, మూడు మహిళల డబుల్స్ టైటిల్స్ గెలుచుకొంది.
22 సంవత్సరాలుగా..
సానియా గత 22 సంవత్సరాలుగా టెన్నిస్ తో పాటు వివాదాలు ఊపిరిగా జీవించింది. క్రీడాకారిణిగా, వ్యక్తిగతంగా పలురకాల సమస్యలు ఎదురుకావడంతో టెన్నిస్ కెరియర్ ను కొనసాగించలేనని భావించి 36 సంవత్సరాల వయసులో కెరియర్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది.
42 సంవత్సరాల రోహన్, 36 సంవత్సరాల సానియా లేటు వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ఫైనల్స్ చేరిన భారతజోడీగా రికార్డుల్లో చోటు సంపాదించారు.
రన్నరప్ ట్రోఫీతో గ్రాండ్ స్లామ్ కెరియర్ ను ముగించడం తనకు ఎనలేని సంతృప్తినిచ్చినట్లు మీడియా సమావేశంలో కంటనీరుతో చెప్పింది. క్షణకాలం పాటు భావోద్వేగాలకు గురయ్యింది.
తనవయసు 14 ఏళ్లు ఉన్న సమయంలో 20 సంవత్సరాల రోహన్ తో కలసి తొలిసారిగా మిక్సిడ్ డబుల్స్ పోరుకు దిగానని..ఇప్పుడు.. 36 సంవత్సరాల వయసులో .. 42 సంవత్సరాల రోహన్ తో కలసి తన కెరియర్ ఆఖరిటోర్నీలో పాల్గొనటం, ఫైనల్స్ వరకూ రావటం, తన కుమారుడు ఇజాన్ మీర్జా చూస్తుండగా ..ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ ఆడటం, రన్నరప్ ట్రోఫీ అందుకోటం కలకాలం గుర్తుండిపోతాయని పొంగిపోతూ చెప్పింది.
గత 20 సంవత్సరాలుగా తాను టెన్నిస్ కెరియర్ ను కొనసాగించి శారీరకంగా, మానసికంగా అలసిపోయానని, వచ్చేనెలలో దుబాయ్ వేదికగా జరిగే టోర్నీతో ఆట నుంచి పూర్తిగా వీడ్కోలు తీసుకొంటానని మరోసారి వివరించింది.
2009లో మహేశ్ భూపతితో జంటగా ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ట్రోఫీ అందుకొన్నానని, అదే తన కెరియర్ లో తొలిగ్రాండ్ స్లామ్ ట్రోఫీ అని గుర్తు చేసుకొంది.
టెన్నిస్ మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో సానియా మొత్తం 43 టైటిల్స్ సాధిస్తే..అందులో గ్రాండ్ స్లామ్ ట్రోఫీలే అరడజను ఉండటం విశేషం.
వయసు మీద పడటం, గాయాలు, కుటుంబ బాధ్యతలతో తాను టెన్నిస్ ను కొనసాగించే పరిస్థితిలో లేనని గత నెలలోనే ఓ ప్రకటనతో మీడియా ద్వారా తన అభిమానులకు సానియా తెలిపిన సంగతి తెలిసిందే.
టెన్నిస్ క్రీడాకారిణిగా తన కెరియర్ లో విజయాలతో పాటు 100 కోట్ల రూపాయల వరకూ సంపాదించిన సానియా ప్రస్తుతం హైదరాబాద్ లో తన పేరుతో టెన్నిస్ అకాడెమీని నిర్వహిస్తోంది.