భారత్ సత్తాకు నేడు కువైట్ పరీక్ష!

2023 శాఫ్ కప్ సాకర్ టోర్నీలో ఆతిథ్య భారత్ సత్తాకు కువైట్ సవాలు విసురుతోంది. రాత్రి 7-30 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

Advertisement
Update:2023-06-27 17:44 IST

భారత్ సత్తాకు నేడు కువైట్ పరీక్ష!

2023 శాఫ్ కప్ సాకర్ టోర్నీలో ఆతిథ్య భారత్ సత్తాకు కువైట్ సవాలు విసురుతోంది. రాత్రి 7-30 గంటలకు ఈ పోరు ప్రారంభంకానుంది.

భారత్ వేదికగా జరుగుతున్న 2023 దక్షిణాసియా దేశాల సాకర్ కప్ టోర్నీ లీగ్ దశ పోటీలు క్లైయ్ మాక్స్ దశకు చేరాయి. ఈ రోజు జరిగే గ్రూపు-ఏ లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో గ్రూపు టాపర్ ఎవరో తేల్చుకోడానికి ఆతిథ్య భారత్, కువైట్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

మొత్తం ఎనిమిదిదేశాలజట్లు రెండుగ్రూపులుగా తలపడుతున్న ఈ టోర్నీలో..గ్రూప్ -ఏ నుంచి కువైట్, భారతజట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.

పాకిస్థాన్, నేపాల్, కువైట్, భారత జట్లతో కూడిన ఈ గ్రూపు మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లోనూ భారత్, కువైట్ జట్లు తిరుగులేని విజయాలు సాధించాయి.

2010 తర్వాత కువైట్ తో భారత్ పోరు...

ప్రపంచ సాకర్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ 101వ ర్యాంక్ జట్టుగా ఉంటే, కువైట్ మాత్రం 143వ ర్యాంక్ జట్టుగా నిలిచింది. ఈ రెండుజట్లు 2010 తర్వాత తొలిసారిగా ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో ప్రస్తుత శాఫ్ కప్ ద్వారా తలపడబోతున్నాయి.

గ్రూప్ లీగ్ దశలో భారత్ 4-0తో పాక్ ను, 2-0తో నేపాల్ ను చిత్తు చేయగా..కువైట్ 3-1తో పాకిస్థాన్ ను, 4-0తో నేపాల్ ను కంగుతినిపించడం ద్వారా సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకోగలిగాయి.

అయితే..గ్రూపు దశలో టాపర్ గా నిలిచేది ఎవరో తేల్చుకోడానికి ఈ రోజు ఈ రెండుజట్లే తలపడబోతున్నాయి. గతంలో ఈ రెండుజట్లూ మూడుసార్లు తలపడగా..కువైట్ 2-1తో పైచేయి సాధించింది. అయితే..ఈ కీలక లీగ్ పోరులో కువైట్ నుంచి తమకు గట్టి పోటీ ఎదురైనా విజయం సాధించగలమన్న ధీమాను భారత కోచ్ వ్యక్తం చేశారు.

సునీల్ ఛెత్రీని ఊరిస్తున్న అరుదైన రికార్డు...

లీగ్ దశ మొదటి రెండురౌండ్ల మ్యాచ్ ల్లోనూ 4 గోల్సు సాధించిన కెప్టెన్ సునీల్ ఛెత్రీ పైనే భారత్ ఆధారపడి ఉంది. 38 సంవత్సరాల సునీల్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితేనే కువైట్ పై భారత్ విజయం సాధించగలుగుతుంది.

మరోవైపు..ఈ కీలక పోరులో సునీల్ ఛెత్రీ ఒక్కగోలు సాధించగలిగితే..శాఫ్ కప్ సాకర్ లో అత్యధిక గోల్సు సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పగలుగుతాడు.

ప్రస్తుతం అత్యధిక శాఫ్ గోల్స్ రికార్డు మాల్దీవ్స్ మాజీ కెప్టెన్ అలీ అష్ఫాక్ పేరుతో ఉంది. అలీకి మొత్తం 23 గోల్స్ సాధించిన రికార్డు ఉంది. ప్రస్తుత టోర్నీ లీగ్ మొదటి రెండు రౌండ్ల వరకూ 22 గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రీ మరో రెండు గోల్స్ చేయగలిగితే...24 గోల్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పగలుగుతాడు.

1993 నుంచి క్రమం తప్పకుండా రెండేళ్లకోమారు జరుగుతూ వస్తున్న ఈ టోర్నీలో ఎనిమిది దేశాల జట్లు మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. ఈ పరంపరలో భాగంగా ఇప్పుడు 14వ శాఫ్ కప్ సమరాన్ని భారత ఫుట్ బాల్ సమాఖ్య నిర్వహిస్తోంది.

గ్రూప్- ఏ లీగ్ లో భారత్, పాకిస్థాన్, నేపాల్, కువైట్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ - బీ లీగ్ లో లెబనాన్, బంగ్లాదేశ్, భూటాన్ , మాల్దీవుల జట్లు పోటీపడనున్నాయి.

గ్రూప్ లీగ్ దశలో మొదటి రెండుస్థానాలలో నిలిచిన నాలుగుజట్లు ..నాకౌట్ సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

జులై 1న సెమీఫైనల్స్, జులై 4న ఫైనల్స్ నిర్వహిస్తారు.

గత 13 శాఫ్ సాకర్ టోర్నీలలో 12సార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టు భారత్ మాత్రమే. మొత్తం 12 ఫైనల్స్ ఆడిన భారత్ ..రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న భారత్ 2021 టోర్నీ ఫైనల్లో నేపాల్ ను 3-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా ఎనిమిదోసారి ట్రోఫీ అందుకొంది.

భారత్ తర్వాత..అత్యధిక శాఫ్ టైటిల్స్ నెగ్గిన జట్టుగా మాల్దీవ్స్ నిలిచింది. మాల్దీవ్స్ రెండుసార్లు,బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక ఒక్కోసారి టైటిల్ సాధించాయి.

రాత్రి 7-30కి కువైట్ తో జరిగే ఆఖరి రౌండ్ పోరులో భారత్ నెగ్గితే గ్రూపులీగ్ టాపర్ గా సెమీస్ లో గ్రూప్- బీ రెండోస్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంది. అదే కువైట్ చేతిలో ఓడితే ..గ్రూప్- బీ టాపర్ జట్టును ఢీకొనాల్సి ఉంది.

మ్యాచ్ డ్రాగా ముగిస్తే..గోల్స్ సగటున కువైట్ జట్టే గ్రూప్ టాపర్ గా నిలువగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News