ప్రపంచకప్ లో సఫారీల జోరు, మూడు సెంచరీలు, మూడు ప్రపంచకప్ రికార్డులు!
ఐసీసీ వన్డే ప్రపంచకప్ పరుగుల హోరు, రికార్డుల జోరుతో సాగిపోతోంది. శ్రీలంకతో జరిగిన తొలి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో దక్షిణాఫ్రికా మూడు సెంచరీలు, మూడు ప్రపంచకప్ రికార్డులతో 102 పరుగుల విజయం సాధించింది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ పరుగుల హోరు, రికార్డుల జోరుతో సాగిపోతోంది. శ్రీలంకతో జరిగిన తొలి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో దక్షిణాఫ్రికా మూడు సెంచరీలు, మూడు ప్రపంచకప్ రికార్డులతో 102 పరుగుల విజయం సాధించింది.
2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా మూడు ప్రపంచకప్ రికార్డులతో చెలరేగిపోయింది. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ పోరులో సఫారీజట్టు 102 పరుగుల భారీవిజయంతో టైటిల్ వేట ప్రారంభించింది.
మూడు శతకాలు, మూడు రికార్డులు..
వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ముగ్గురు సఫారీ బ్యాటర్లు శతకాలు బాదడం, అతితక్కువ బంతుల్లో సాధించిన సెంచరీ, అత్యధిక టీమ్ స్కోరు రికార్డుల్ని దక్షిణాఫ్రికా నమోదు చేసింది.
మాజీ చాంపియన్ శ్రీలంకతో జరిగిన ఈ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సఫారీజట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగుల భారీస్కోరు సాధించింది.
క్వింటన్ డి కాక్, రాసీ వాన్ డెర్ డ్యూసెన్, ఎడెన్ మర్కరం శతకాలు బాదడం ఈ మ్యాచ్ కే హైలైట్స్ మాత్రమే కాదు.. ప్రపంచ కప్ సరికొత్త రికార్డులుగా నమోదయ్యాయి.
కంగారూల రికార్డు తెరమరుగు...
2015 వన్డే ప్రపంచకప్ లో పెర్త్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్ పై ఆస్ట్ర్రేలియా సాధించిన 6 వికెట్లకు 417 పరుగుల స్కోరే ఇప్పటి వరకూ అత్యధిక టీమ్ స్కోరుగా ఉంటూ వచ్చింది.
అయితే..సఫారీజట్టు 5 వికెట్లకు 428 పరుగుల స్కోరు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేయగలిగింది.
దక్షిణాఫ్రికా బ్యాటర్లు మొత్తం 50 ఓవర్ల బ్యాటింగ్ లో 45 ఫోర్లు, 14 సిక్సర్లతో శ్రీలంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. ప్రపంచకప్ చరిత్రలో 400కు పైగా స్కోర్లు సాధించినజట్లలో దక్షిణాఫ్రికా, భారత్, ఆస్ట్ర్రేలియా మాత్రమే ఉన్నాయి. 2015 ప్రపంచకప్ లో ఐర్లాండ్ పై 4 వికెట్లకు 411, వెస్టిండీస్ పై 5 వికెట్లకు 408 పరుగుల స్కోర్లు సాధించిన ఘనత సఫారీలకు మాత్రమే ఉంది.
2007 ప్రపంచకప్ లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా బెర్ముడాతో జరిగిన పోటీలో భారత్ 5 వికెట్లకు 414 పరుగుల స్కోరు సాధించగలిగింది.
45 బంతుల్లోనే మర్కరం సెంచరీ..
ఆట 31వ ఓవర్లో బ్యాటింగ్ క్రీజులోకి వచ్చిన సఫారీ మిడిలార్డర్ బ్యాటర్ మర్కరం కేవలం 45 బంతుల్లోనే సునామీ సెంచరీ బాదడం ద్వారా ప్రపంచకప్ రికార్డు నెలకొల్పాడు.
ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన మొనగాడిగా నిలిచాడు. మొత్తం 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగుల స్కోరు సాధించాడు.
2011 వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై ఐర్లాండ్ బ్యాటర్ కెవిన్ ఓ బ్రియాన్ సాధించిన 50 బంతుల్లో శతకం రికార్డును మర్కరం 49 బంతుల్లోనే అధిగమించాడు.
మూడు శతకాలు..ఇదే మొదటిసారి...
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ 84 బంతుల్లో 100 పరుగులు, వన్ డౌన్ ఆటగాడు వాన్ డ్యూసెన్ 110 బంతుల్లో 108 పరుగులు, రెండోడౌన్ బ్యాటర్ మర్కరం 54 బంతుల్లో 106 పరుగులు సాధించడంతో..ఒకేజట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించిన రికార్డు నమోదయ్యింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే మొదటిసారి. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకేజట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు శతకాలు బాదటం ఇది నాలుగోసారి మాత్రమే.
పోరాడి ఓడిన శ్రీలంక.....
మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 429 పరుగులు చేయాల్సిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటై 102 పరుగుల పరాజయం చవిచూసింది. వన్ డౌన్ కుశాల్ మెండిస్ 76, మిడిలార్డర్ ఆటగాడు చరిత అసలంకా 79, కెప్టెన్ దాసున్ సనక 68 పరుగులతో పోరాడినా..మిగిలిన శ్రీలంక బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
మొత్తం మీద..ప్రపంచకప్ నాలుగోమ్యాచ్ మూడు సెంచరీలు, మూడు ప్రపంచకప్ రికార్డులతో ముగిసినట్లయ్యింది.