ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఒక్కడు రొనాల్డో!

ప్రపంచకప్ సమరంలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Advertisement
Update:2022-11-25 10:45 IST

క్రిస్టియానో రొనాల్డో

ప్రపంచకప్ సమరంలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎవ్వరికీ సాధ్యంకాని ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 2022 ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు...

యూరోపియన్ సాకర్ లీగ్ లో మాత్రమే కాదు..ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలలో సైతం పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హవా కొనసాగుతోంది.

తన కెరియర్ లో వరుసగా ఐదో ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న 37 సంవత్సరాల రొనాల్డో అనితర సాధ్యమైన, కేవలం తనకు మాత్రమే సాధ్యమైన ఓ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఐదు ప్రపంచకప్ లు- 8 గోల్స్...

ఖతర్ రాజధాని దోహాలోని స్టేడియం 974 వేదికగా జరిగిన గ్రూప్- హెచ్ ప్రారంభమ్యాచ్ లో ఘనాపై తొలిగోలు సాధించడం ద్వారా రొనాల్డో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఒకటి కాదు రెండుకాదు..ఏకంగా ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధించిన మొట్టమొదటి, ఒకే ఒక్క ప్లేయర్ గా నిలిచాడు.

ఆఫ్రికా చాంపియన్ ఘనా నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 3-2 గోల్స్ విజయం సాధించడంలో కెప్టెన్ గా రొనాల్డో తనవంతు పాత్ర నిర్వర్తించాడు. ఆట 65వ నిముషంలో లభించిన పెనాల్టీని గోలుగా మలచడం ద్వారా తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు.

బ్రెజిల్ దిగ్గజం పీలే, జర్మన్ జోడీ సీలెర్, మిరోస్లావ్ క్లోజ్ ల పేరుతో ఉన్న సంయుక్త రికార్డును రొనాల్డో అధిగమించాడు.

పై నలుగురు సాకర్ దిగ్గజాలు నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో గోల్స్ సాధిస్తే..రొనాల్డో మాత్రం ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో అరుదైన ఈ ఘనత సాధించిన మొనగాడిగా నిలిచాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో సాధించిన గోల్ తో కలుపుకొని అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచ్ ల్లో క్రిస్టియానో రొనాల్డో సాధించిన గోల్స్ సంఖ 118 కి చేరింది.

ఇంగ్లండ్ చెందిన మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తో తెగతెంపులు చేసుకోడం ద్వారా 125 కోట్ల రూపాయల మేర నష్టపోయిన రొనాల్డో ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో రాణించడం విశేషం.

2016 యూరోకప్ ను తన దేశానికి అందించిన రొనాల్డో..ప్రపంచకప్ ను సైతం అందించి మరీ రిటైర్ కావాలని భావిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News