సిక్సర్ల బాదుడులో రోహిత్ సరికొత్త ప్రపంచ రికార్డు!

భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. సిక్సర్ల బాదుడులో తనకుతానే సాటిగా నిలిచాడు.

Advertisement
Update:2023-11-13 10:46 IST

భారత కెప్టెన్ కమ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. సిక్సర్ల బాదుడులో తనకుతానే సాటిగా నిలిచాడు.

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారతజట్టుకు తొలిసారిగా నాయకత్వం వహిస్తూ..జట్టును ముందుండి నడిపిస్తున్నరోహిత్ శర్మ సూపర్ హిట్ గా నిలిచాడు.

60 సిక్సర్లు- 500 పరుగులు...

ప్రస్తుత ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భారత్ కు తొమ్మిదికి తొమ్మిది విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసిన రోహిత్ శర్మ కెప్టెన్ గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు.

యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ తో కలసి మొదటి వికెట్ కు లీగ్ దశలోనే నాలుగు సెంచరీ భాగస్వామ్యాలు అందించాడు. పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలో అత్యధిక పరుగులు, సిక్సర్లు సాధించిన ఓపెనర్ గా జంట ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

2023 సీజన్లో 60 సిక్సర్లతో రికార్డు...

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్ తో ముగిసిన లీగ్ ఆఖరిరౌండ్ పోరులో రోహిత్ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు సాధించడం ద్వారా పలు సరికొత్తరికార్డులు నెలకొల్పగలిగాడు.

డచ్ ఆఫ్ స్పిన్నర్ కోలిన్ అకెర్ మాన్ బౌలింగ్ లో తొలిసిక్సర్ బాదడం ద్వారా గత ఎనిమిదిసంవత్సరాలుగా సఫారీ హిట్టర్ ఏబీ డివిలియర్స్ పేరుతో ఉన్న ప్రపంచరికార్డును రోహిత్ అధిగమించాడు.

ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా 2015 సీజన్లో 58 సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు డివిలియర్స్ పేరుతో ఇప్పటి వరకూ ఉంది. ఆ రికార్డును 60 సిక్సర్ల రికార్డుతో రోహిత్ సవరించగలిగాడు.

2023 సీజన్లో రోహిత్ ఇప్పటికే అత్యధికంగా 60 సిక్సర్లు సాధించాడు. నాకౌట్ రౌండ్లో సెమీఫైనల్స్, ఒకవేళ భారతజట్టు ఫైనల్స్ చేరితే మరో రెండుమ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

2019 సీజన్లో క్రిస్ గేల్ 56 సిక్సర్లు, షాహీద్ అఫ్రిదీ 48 సిక్సర్ల రికార్డులతో ఉన్నారు.

మోర్గాన్ ను మించిన రోహిత్ శర్మ...

ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్ రికార్డును సైతం రోహిత్ నెలకొల్పాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వోయిన్ మోర్గాన్ కు 2019 టోర్నీలో అత్యధికంగా 22 సిక్సర్లు సాధించిన రికార్డు ఉంది.

ప్రస్తుత 2023 ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరిరౌండ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 2 సిక్సర్లు సాధించడం ద్వారా రోహిత్ 24 సిక్సర్లతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగాడు.

2015 ప్రపంచకప్ లో ఏబీ డివిలియర్స్ 21 సిక్సర్లు, 2019 ప్రపంచకప్ లో ఆరోన్ ఫించ్ 18 సిక్సర్లు, 2015 ప్రపంచకప్ లో బ్రయన్ మెకల్లమ్ 17 సిక్సర్లు బాదిన బ్యాటర్లుగా ఉన్నారు.

ప్రస్తుత 2023 ప్రపంచకప్ లీగ్ దశ 9 మ్యాచ్ ల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 18 సిక్సర్లు సాధించడం ద్వారా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ కమ్ ఓపెనర్ గా కొనసాగుతున్నాడు.

భారతజట్టు సిక్సర్ల ప్రపంచ రికార్డు...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే కాదు..భారతజట్టు సైతం సిక్సర్ల బాదుడులో ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 2023 సీజన్లో భారత్ ఇప్పటికే 215 సిక్సర్లు బాదడం ద్వారా..వెస్టిండీస్ పేరుతో ఉన్న 209 సిక్సర్ల రికార్డును తెరమరుగు చేసింది. 2019 సీజన్లో వెస్టిండీస్ 209 సిక్సర్లు, 2015 సీజన్లో న్యూజిలాండ్ 179 సిక్సర్లు, 2023 సీజన్లో ఆస్ట్ర్రేలియా 165 సిక్సర్లు సాధించగా..భారతజట్టు మాత్రం 215 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలువగలిగింది.

Tags:    
Advertisement

Similar News