విరాట్ ను ఎత్తేసిన కెప్టెన్ రోహిత్!

పాకిస్థాన్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో పాటు మ్యాచ్ విన్నర్ గా నిలవటమే అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుంది.

Advertisement
Update:2022-10-24 10:20 IST

ఒక్క ఇన్నింగ్స్ తో హీరీలుగా నిలిచిపోడం క్రికెట్లో సర్వసాధారణమే. గత 13 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ గా రికార్డుల మోత మోగించిన విరాట్ కొహ్లీ తన కెరియర్ లో అత్యుత్తమ టీ-20 ఇన్నింగ్స్ ఆడటానికి 110 మ్యాచ్ ల పాటు వేచిచూడాల్సి వచ్చింది.....

విరాట్ కొహ్లీ..ఆధునిక క్రికెట్లో పరుగుల యంత్రం. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ అలవోకగా సెంచరీలు బాదుతూ తనకుతానే సాటిగా నిలిచిన మొనగాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టీ-20 క్రికెట్ అన్నతేడా లేకుండా 71 శతకాలు 20వేలకు పైగా పరుగులు సాధించిన ఘనుడు. ఇప్పటికే ఎన్నో గొప్పగొప్ప ఇన్నింగ్స్ ఆడినా...

పాకిస్థాన్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో 82 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో పాటు మ్యాచ్ విన్నర్ గా నిలవటమే అత్యుత్తమ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుంది.

ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్- విరాట్...

తన టీ-20 కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 110 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో పాకిస్థాన్ పై మెల్బోర్న్ వేదికగా సాధించిన 82 పరుగుల స్కోరే తనకు అత్యుత్తమ ఇన్నింగ్స్ గా ముగిసిపోతుందని విరాట్ కొహ్లీ చెప్పాడు. మొహాలీ వేదికగా పాక్ సాధించిన స్కోరును ప్రస్తుత ఈ మ్యాచ్ కు ముందు వరకూ తనకు చిరస్మరణీయ ఇన్నింగ్స్ గా ఉండేదని...అయితే..ప్రస్తుత ఈ ప్రపంచకప్ సూపర్ -12 మ్యాచ్ ఇన్నింగ్స్ మరింత అత్యుత్తమమైనదని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొంటూ చెప్పాడు.

హార్థిక్ పాండ్యా ఘనతా ఉంది...

160 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సమయంలో మొదటి 6 ఓవర్లలో 45 పరుగులకే 4 వికెట్లు నష్టపోయి ఓటమి అంచుల్లో కూరుకుపోయిన భారత్ ను విజేతగా నిలపడంలో తనపాత్ర ఎంతుందో...హార్ధిక్ పాండ్యా ఘనతా అంతే ఉందని విరాట్ చెప్పాడు.

5వ వికెట్ కు పాండ్యాతో కలసి 113 పరుగుల కీలక భాగస్వామ్యం సాధించడమే విజయానికి కారణమని, హార్ధిక్ పాండ్యా తనకు ఎంతో అండగా నిలిచాడని, భారీషాట్లు కొట్టమని ప్రోత్సహించాడని, వికెట్ల నడుమ చాలా చురుగ్గా పరుగెడుతూ తనలో ఉత్సాహం పెంచాడని విరాట్ గుర్తు చేసుకొన్నాడు.

టీ-20 క్రికెట్లో వెయ్యి పరుగులు, 50 వికెట్ల రికార్డు తో భారత తొలి క్రికెటర్ గా నిలిచిన పాండ్యాను ప్రత్యేకంగా అభినందించాడు. ఆఖరి 3 ఓవర్లలో విజయానికి 48 పరుగులు

అవసరమైన తరుణంలో తాను సరైన షాట్లు ఆడగలిగానని చెప్పాడు.

ఆఖరి 10 ఓవర్లలో 115 పరుగులు, ఆఖరి 3 ఓవర్లలో 48 పరుగులు, ఆఖరి 2 ఓవర్లలో 31 పరుగులు సాధించడం తనకు ఇప్పటికీ ఓ కలలా ఉందంటూ విరాట్ మురిసిపోతున్నాడు.

విరాట్ కు రోహిత్ హ్యాట్సాఫ్...

భారతజట్టుకు తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ తో చరిస్మరణీయ విజయం అందించిన విరాట్ కొహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో అభినందించాడు. విరాట్ ఇన్నింగ్స్ ను చూసి మైమరచిపోయిన రోహిత్ ...తమ జట్టు విజయం సాధించిన వెంటనే గ్రౌండ్లోకి పరుగుపరుగున వచ్చి విరాట్ ను తన భుజాలపైకి ఎత్తుకొని మరీ అబినందించాడు.

తన దృష్టిలో విరాట్ కొహ్లీ అత్యుత్తమ టీ-20 ఇన్నింగ్స్ ఇదేనంటూ రోహిత్ ప్రశంసించాడు. ఈ విజయం తమజట్టులో సరికొత్త ఉత్సాహాని నింపుతుందని చెప్పాడు.

భారతజట్టు చీఫ్ కోచ్ సైతం విరాట్ ను హత్తుకొని మరీ అభినందించారు.

గత మూడేళ్లుగా వరుస వైఫల్యాలతో మానసికంగా కృంగిపోయిన కింగ్ కొహ్లీ..ప్రపంచకప్ లో పాక్ ప్రత్యర్థిగా ఆడిన ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ వ్యక్తిగతంగా విరాట్ కు మాత్రమే కాదు..శతకోటి భారత క్రికెట్ అభిమానులకు సైతం కలకాలం గుర్తుండిపోతుంది.

Tags:    
Advertisement

Similar News