ధోనీ, విరాట్ ల సరసన రోహిత్ శర్మ!

ఐపీఎల్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.

Advertisement
Update:2024-03-28 18:20 IST

ఐపీఎల్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ముంబై ఫ్రాంచైజీ ఆటగాడిగా ఓ అసాధారణ రికార్డు నెలకొల్పాడు. 2008 నుంచి ఐపీఎల్ లో కేవలం రెండంటే రెండు ఫ్రాంచైజీలకు మాత్రమే ఆడుతూ వచ్చిన హిట్ మ్యాన్ ప్రస్తుత 2024 సీజన్ రెండోమ్యాచ్ ద్వారా చరిత్ర సృష్టించాడు.

ఒకే ఫ్రాంచైజీ తరపున 200 మ్యాచ్ లు...

ఒకే జట్టులో సభ్యుడిగా 200 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మూడో క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మహేంద్ర సింగ్ ధోనీ. రాయల్ చాలెంజర్స్ తరపున విరాట్ కొహ్లీ మాత్రమే 200 మ్యాచ్ లు ఆడిన మొనగాళ్లుగా నిలిచారు.

2008 ప్రారంభ ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్ కు ఆడిన రోహిత్ నాటినుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో ముగిసిన పోరు వరకూ 245 మ్యాచ్ లు ఆడితే...ముంబై తరపున ఆడినవే 200 కావడం విశేషం. కెప్టెన్ గా ముంబైకి 87 విజయాలు, 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన అరుదైన రికార్డు రోహిత్ కు మాత్రమే సొంతం.

2011 నుంచి 2024 వరకూ..

ఆల్ టైమ్ గ్రేట్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ సూచన మేరకు రోహిత్ శర్మను ముంబై ఫ్రాంచైజీ 2011 సీజన్ వేలం ద్వారా దక్కించుకొంది. ఆ వెంటనే రోహిత్ చేతికి ముంబై జట్టు పగ్గాలు వచ్చాయి. రోహిత్ నాయకత్వంలో ముంబై గత పుష్కరకాలంలో ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలువగలిగింది. గత 14 సీజన్లుగా ముంబైకి ఆడుతూ వచ్చిన రోహిత్ కేవలం 6 మ్యాచ్ లకు మాత్రమే వివిధ కారణాలతో దూరమయ్యాడు.

2011 లో 9 కోట్ల 20 లక్షల రూపాయల వేలం ధరకు ముంబై కాంట్రాక్టు పొందిన రోహిత్ ప్రస్తుతం సీజన్ కు 15 కోట్ల రూపాయలు వంతున అందుకొంటున్నాడు.

ముంబై తరపున తన మొదటి 199 మ్యాచ్ ల్లో రోహిత్ మొత్తం 5084 పరుగులు సాధించాడు.

ముంబై ఓపెనర్ గా రోహిత్ 50సార్లు 35 కంటే ఎక్కువ స్కోర్లు సాధించాడు. 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకొన్నాడు. ముంబై తరపున 5వేల పరుగులు సాధించిన ఐపీఎల్ స్టార్ బ్యాటర్ రికార్డు సైతం రోహిత్ పేరుతోనే ఉంది.

ముంబై ఫ్రాంచైజీ తరపున శతకం బాదిన రెండో క్రికెటర్ ఘనత సైతం రోహిత్ కు ఉంది. ముంబై సాధించిన 111 విజయాలలో రోహిత్ పాత్ర సైతం ఉంది. 35సార్లు 50కి పైగా స్కోర్లు సైతం సాధించాడు.

ముంబై తరపున తన మొదటి 199 మ్యాచ్ లతో కలుపుకొని ఆడిన మొత్తం 427 మ్యాచ్ ల్లో 488 సిక్సర్లు బాదిన రోహిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే 500 సిక్సర్ల మైలురాయిని చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

సచిన్ చేతుల మీదుగా....

ముంబై ఫ్రాంచైజీ తరపున తన 200వ మ్యాచ్ ఆడుతున్న తొలి ఆటగాడు రోహిత్ శర్మకు ముంబై మెంటార్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ ప్రత్యేక జెర్సీని అందచేశారు.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో హిట్ మ్యాన్ కు మాస్టర్ 200 అంకెతో కూడిన టీ-షర్టును బహుకరించాడు.

ఐపీఎల్ గత 17 సీజన్ల చరిత్రలో ఇప్పటి వరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున విరాట్ కొహ్లీ 239 మ్యాచ్ లు, చెన్నై సూపర్ కింగ్స్ తరపున మహేంద్ర సింగ్ ధోనీ 221 మ్యాచ్ లు ఆడగా రోహిత్ 200 మ్యాచ్ లతో మూడోస్థానంలో నిలిచాడు.

సన్ రైజర్స్ తో ముగిసిన హైస్కోరింగ్, ప్రపంచ రికార్డుల మ్యాచ్ లో ముంబై తరపున 278 పరుగుల స్కోరు చేజింగ్ కు దిగిన రోహిత్ 12 బంతుల్లో ఓ ఫోరు, 3 సిక్సర్లతో 26 పరుగుల స్కోరుకు కమిన్స్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.

తన కెరియర్ లో ముంబై తరపున 200వ మ్యాచ్ ఆడుతూ భారీస్కోరు సాధించాలని భావించిన రోహిత్ కు నిరాశే మిగిలింది.

Tags:    
Advertisement

Similar News