500 సిక్సర్ల మొనగాడు రోహిత్ శర్మ!
భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
భారత క్రికెట్ హిట్ మ్యాన్, కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు...
భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాగడ్డపై ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన కెరియర్ లో 500 సిక్సర్లు బాదిన భారత తొలిబ్యాటర్ గా, ప్రపంచ రెండో క్రికెటర్ గా నిలిచాడు.
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండోమ్యాచ్ లో చేతివేలిగాయంతోనే 9వ నంబర్ బ్యాటర్ గా క్రీజులో నిలిచిన రోహిత్ కేవలం 28 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 బౌండ్రీలతో అజేయ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 51 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
బంగ్లా స్పిన్నర్ మహ్మదుల్లా బౌలింగ్ లో రోహిత్ వరుసగా రెండుసిక్సర్లు బాదడం ద్వారా...500 సిక్సర్ల అరుదైన రికార్డును అందుకోగలిగాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి 428 ఇన్నింగ్స్ లో రోహిత్ 502 సిక్సర్లు సాధించగలిగాడు.
గేల్ తర్వాతి స్థానంలో రోహిత్..
క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన క్రికెటర్ రికార్డు కరీబియన్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. టెస్టులు, వన్డేలు, టీ-మ్యాచ్ లు కలిసి మొత్తం 483 ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ అత్యధికంగా 583 సిక్సర్లు బాదడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.
రోహిత్ శర్మ 428 ఇన్నింగ్స్ లో 502 సిక్సర్లు, షాహీద్ అఫ్రిదీ 476 ఇన్నింగ్స్ లో 524, బ్రెండన్ మెకల్లమ్ 432 ఇన్నింగ్స్ లో 398, మార్టిన్ గప్టిల్ 367 ఇన్నింగ్స్ లో 383, మహేంద్ర సింగ్ ధోనీ 359 ఇన్నింగ్స్ లో 538 సిక్సర్లతో ప్రపంచ టాప్ టెన్ సిక్సర్ హిట్టర్ల జాబితాలో నిలిచారు.
టీ-20ల్లో 176 సిక్సర్లు
అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో అత్యధికంగా 176 సిక్సర్లు బాదిన తొలి ఓపెనర్ గా, కెప్టెన్ గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. 124 సిక్సర్లతో క్రిస్ గేల్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.
మూడుఫార్మాట్లలో 502 సిక్సర్లు..
అంతేకాదు..అంతర్జాతీయ క్రికెట్లో 500 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 500 సిక్సర్లు సాధించాడు.
టెస్టుల్లో 64, వన్డేల్లో 259, టీ-20ల్లో 176 సిక్సర్లు బాదడం ద్వారా రోహిత్ సిక్సర్లకింగ్ గా గుర్తింపు పొందాడు.
ఓ టెస్ట్ సిరీస్ లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు సైతం రోహిత్ పేరుతోనే ఉంది.
ఒకే ఫ్రాంచైజీ తరపున 200 సిక్సర్లు..
ఐపీఎల్ లో కేవలం ఒకే ఒక ఫ్రాంచైజీ తరపున 200 సిక్సర్లు సాధించిన అతికొద్దిమంది బ్యాటర్లలో ఒకడిగా రోహిత్ నిలిచాడు. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ , విరాట్ కొహ్లీ బెంగళూరు తరపున, పోలార్డ్ , రోహిత్ ముంబై తరపున , సురేశ్ రైనా, ధోనీ చెన్నై తరపున 200కు పైగా సిక్సర్లు బాదిన బ్యాటర్లుగా నిలిచారు.
ఐపీఎల్‌గత సీజన్లో .. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 400వ సిక్సర్ కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున 200 సిక్సర్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. రోహిత్ మొత్తం 502 సిక్సర్లతో టాపర్ గా ఉంటే... 325 సిక్సర్లతో సీఎస్కే బ్యాటర్ సురేశ్ రైనా రెండోస్థానంలోనూ,.. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 320 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 304 సిక్స్‌లు మాత్రమే సాధించగలిగాడు..
ఇక రోహిత్ సాధించిన మొత్తం 502 సిక్సర్లలో 140 భారత్ తరపున కాగా.. 227 సిక్సర్లు ఐపీఎల్‌లో సాధించినవే కావడం విశేషం. ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ 200 సిక్సర్లు సాధించిన మరో రికార్డును సైతం రోహిత్ గత సీజన్లోనే సాధించగలిగాడు.
చాంపియన్స్ లీగ్ టీ20లో 24 సిక్సర్లు బాదాడు. టీ-20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. 1042 సిక్సర్లతో అతడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో 1000 సిక్సర్లు దాటిన ఏకైక ప్లేయర్ గేల్ మాత్రమే. ఆ తర్వాత పొలార్డ్ (758), రసెల్ (510), రోహిత్ శర్మ ( 502 ) బ్రెండన్ మెకలమ్ (485), షేన్ వాట్సన్ (467), ఏబీ డివిలియర్స్ (434) ఉన్నారు.