సిక్సర్ల బాదుడులో ఒకే ఒక్కడు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లబాదుడులో తనకు తానే సాటిగా నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సైతం సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.

Advertisement
Update: 2023-10-15 05:55 GMT

సిక్సర్ల బాదుడులో ఒకే ఒక్కడు!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లబాదుడులో తనకు తానే సాటిగా నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సైతం సిక్సర్ల మోత మోగిస్తున్నాడు...

భారత్ వేదికగా నాలుగోసారి జరుగుతున్న 2023 -ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు భారత కెప్టెన్ , హిట్ మ్యాన్ రోహిత్ శర్మ షోగా సాగుతోంది.

10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ పోరు మొదటి మూడు రౌండ్ల మ్యాచ్ ల్లోనే రోహిత్ ఓ రికార్డు శతకం, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై 86 పరుగుల స్కోరుతో వారేవ్వా అనిపించాడు.

ఆస్ట్ర్రేలియాతో జరిగిన ప్రారంభమ్యాచ్ లో డకౌటైన రోహిత్..ఆ తర్వాత అప్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్ ల్లో శివమెత్తిపోయాడు. బ్యాట్ ఉన్నది బాదటానికే అన్నట్లుగా చెలరేగిపోయాడు.

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండోరౌండ్ పోరులో అప్ఘన్ బౌలర్లను ఓ ఆటాడుకున్న రోహిత్..అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన పోరులో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో సెంచరీకి చేరువై 86 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

వన్డే క్రికెట్లో 300 సిక్సర్ల మొనగాడు..

అప్ఘనిస్థాన్ పై 5 సిక్సర్లు, పాకిస్థాన్ పై 6 సిక్సర్లు బాదడం ద్వారా రోహిత్..వన్డే ఫార్మాట్లో 300 సిక్సర్ల మైలురాయిని చేరగలిగాడు. భారత క్రికెట్ చరిత్రలో ఈ ఘనతసాధించిన భారత తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.

పుల్, లాఫ్టెడ్, హుక్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతూ సిక్సర్ల మోత మోగించే రోహిత్..పాకిస్థాన్ తో ముగిసిన ప్రపంచకప్ మూడో రౌండ్ పోరులో 4వ సిక్సర్ బాదడం ద్వారా 300 సిక్సర్ల మైలురాయిని చేరాడు. దిగ్గజ హిట్టర్లు క్రిస్ గేల్, షాహీద్ అఫ్రీదీ ల తర్వాతి స్థానంలో నిలిచాడు.

వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ రికార్డు పాక్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ పేరుతో ఉంది. అఫ్రిదీ 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉంటే..331 సిక్సర్లతో క్రిస్ గేల్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ 302 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్ చరిత్రలో 300 సిక్సర్లు సాధించిన తొలి బ్యాటర్ రోహిత్ కాగా..329సిక్సర్లతో మహేంద్ర సింగ్ ధోనీ రెండోస్థానంలో ఉన్నాడు.

గేల్ ను మించిన రోహిత్.....

క్రికెట్ మూడు ఫార్మాట్ల ( టెస్టు, వన్డే, టీ-20 ) లోనూ కలసి అత్యధిక సిక్సర్లు సాధించిన క్రిస్ గేల్ రికార్డు ను రోహిత్ శర్మ అధిగమించాడు. అప్ఘనిస్థాన్ పై 5 సిక్సర్లు, పాకిస్థాన్ పై 6 సిక్సర్లతో కలిపి మొత్తం 561 సిక్సర్లతో గేల్ పేరుతో ఉన్న 553 సిక్సర్ల రికార్డును తెరమరుగు చేశాడు.

గేల్ 483 మ్యాచ్ ల్లో 553 సిక్సర్లు బాదితో రోహిత్ 453 మ్యాచ్ ల్లోనే ఆ రికార్డును అధిగమించాడు.

పాకిస్థాన్ తో ముగిసిన ప్రపంచకప్ మూడో రౌండ్ వరకూ రోహిత్ 454 మ్యాచ్ ల్లో 561 సిక్సర్లు సాధించగలిగాడు. ప్రస్తుత ప్రపంచకప్ మిగిలిన ఆరు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ల్లో రోహిత్ ఇదే దూకుడు కొనసాగిస్తే 600 సిక్సర్ల రికార్డును చేరుకోడం ఏమంత కష్టం కాబోదు.

Tags:    
Advertisement

Similar News