రిషభ్ పంత్ కు సర్జరీల మీద సర్జరీలు!
ప్రాణాలతో బయటపడిన భారత యువక్రికెటర్ రిషభ్ పంత్ కు సర్జరీల మీద సర్జరీలు జరిగిపోతున్నాయి. పూర్తిగా కోలుకోడానికి ఏడాది కాలం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
గత నెలలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..ప్రాణాలతో బయటపడిన భారత యువక్రికెటర్ రిషభ్ పంత్ కు సర్జరీల మీద సర్జరీలు జరిగిపోతున్నాయి. పూర్తిగా కోలుకోడానికి ఏడాది కాలం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు..
ప్రతిభావంతులైన ఆటగాళ్ల జీవితాలను క్రికెట్ ఆట ఉన్నత స్థితికి తీసుకువెళితే...మనుషులతో విధి ఆడే ఆట మాత్రం అధంపాతాళానికి పడవేస్తుందనటానికి భారత యువఆటగాడు, 25 సంవత్సరాల రిషభ్ పంత్ జీవితమే నిదర్శనం.
క్రికెటర్ గా కేవలం 25 సంవత్సరాల చిరుప్రాయంలోనే 85 కోట్ల రూపాయల వరకూ ఆర్జించిన రిషభ్ కెరియర్ ను మాత్రమే కాదు..జీవితాన్నే ఓ కారుప్రమాదం అతలాకుతులం చేసింది. ఎంత ఖరీదైన కారులో ప్రయాణం చేసినా విధి ఆడే వికృతనాటకంలో ఎంత చాంపియన్ క్రీడాకారుడైనా విలవిలలాడిపోవాల్సిందేనని రిషభ్ పంత్ అనుభవమే చెబుతోంది.
నెలరోజుల్లో నాలుగు సర్జరీలు...
అంతర్జాతీయ క్రికెటర్లకు గాయాలు కావటం, శస్త్రచికిత్సలు చేయించుకోడం ఆటలో భాగమే, ఓ సాధారణ విషయమే. 24 సంవత్సరాలపాటు క్రికెటర్ గా ఓ వెలుగువెలిగిన మాస్టర్ సచిన్ టెండుల్కర్ భుజం నుంచి కాలిబొటనవేలి వరకూ తన కెరియర్ లో పదిరకాల శస్త్రచికిత్సలు చేయించుకొన్నాడు.
ఇక..భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అశీశ్ నెహ్రా అత్యధికంగా 11 సర్జరీలు చేయించుకొన్నాడు. రవీంద్ర జడేజా, బుమ్రా, దీపక్ చాహర్ లాంటి క్రికెటర్లు సైతం గాయాలతో ఉక్కిరిబిక్కిరవుతూనే ఉన్నారు. అయితే..వీరంతా భారతజట్టుకు ఆడుతూ గాయపడి శస్త్రచికిత్సలు చేయించుకొన్నవారే.
అయితే...తన కెరియర్ తొలిదశలోనే రిషభ్ పంత్ కారుప్రమాదానికి గురై తీవ్రగాయాలతో నెలల తరబడి ఆస్పత్రిలోనే గడపాల్సిన విషమపరిస్థితిలో పడిపోయాడు.
ప్లాస్టిక్ సర్జరీతో మొదలు....
ఉత్తరాఖండ్ లో తన స్నేహితులతో కలసి వేడుకలు చేసుకొని ..డిసెంబర్ 30న డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తున్నసమయంలో రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ కారు ప్రమాదంలో చిక్కుకొంది. అత్యంత ఖరీదైన మెర్సిడెస్ కారును రిషభ్ పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తూ వచ్చాడు. డెహ్రాడూన్- ఢిల్లీ జాతీయ రహదారిలో.. తెల్లవారుజామున వేగంగా వస్తున్న ఆ కారు..... డివైడర్ ను బలంగా ఢీ కొట్టి ..గాలిలో బొంగరంలా తిరుగుతూ, మూడుసార్లు పల్టీలు కొట్టడంతో మంటలు చెలరేగాయి. రోడ్డుకు అటువైపుగా వెళుతున్న హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ ప్రమాదాన్ని చూసి...మంటలు రేగుతున్న కారు అద్దాలు పగుల కొట్టి రిషభ్ పంత్ ను కాపాడి రూర్కీ ఆస్పత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం పంత్ ను మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్చి ..నుజ్జునుజ్జయిన నుదుటి భాగంలో ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు.
మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ నుంచి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి ప్రత్యేక విమానంలో తరలించారు.
బీసీసీఐ బీమాతోనే పంత్ కు చికిత్స...
కారు ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడినా... రిషభ్ పంత్ కు నుదిటి భాగం నుంచి కాలివేలు వరకూ పలురకాలుగా గాయాలయ్యాయి. ఇప్పటికే ప్లాస్టిక్ సర్జరీతో సహా పలు రకాలుగా చికిత్స అందించారు.
ఆ తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం డెహ్రాడూన్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించారు.
గాయాల నుంచి పూర్తిగా కోలుకోడానికి రిషభ్ పంత్ కు ఏడాదికాలం పట్టవచ్చునని, 2023 సీజన్ క్రికెట్ కు అందుబాటులో ఉండే ప్రసక్తేలేదని వైద్యులు చెబుతున్నారు.
ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న రిషభ్ కు కాలిమడమ,మోకాలీ భాగాలలో రెండుసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించారు.
మోకాలిభాగం నరాలు చిట్లడంతో మరోసారి శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించారు.
పర్డీవాలా నేతృత్వంలో...
భారత క్రికెట్ కు అత్యంత విలువైన ఆటగాడు కావడంతో రిషభ్ పంత్ కు అత్యంత నిపుణులైన డాక్టర్ల బృందం చికిత్స అందచేస్తోంది. ఈ బందానికి కోకిలాబెన్ సీనియర్ వైద్యుడు డాక్టర్ దిన్ షా పర్డీవాలా నేతృత్వం వహిస్తున్నారు.
పంత్ కుడికాలి నరం తెగిపోడంతో ఇప్పటికే రెండుసార్లు శస్త్రచికిత్స నిర్వహించడం ద్వారా లోపాన్ని సరిచేశారు. కారుప్రమాదంలో రిషభ్ రెండు మోకాళ్లు, కుడిచేయి మణికట్టు విరిగిపోయాయి.
మరోవైపు..భారత క్రికెటర్లకు బీసీసీఐ కల్పించిన మెడికల్ ఇన్సూరెన్సు కింద పంత్ కు చికిత్స నిర్వహిస్తున్నారు. డెహ్రాడూన్ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో తరలించడానికి పెట్టిన ఖర్చును క్రికెట్ బోర్డే భరించింది.
25 సంవత్సరాల రిషభ్ పంత్ క్రికెటర్ గా మ్యాచ్ ఫీజులు, బోర్డు వార్షిక కాంట్రాక్టు, ఐపీఎల్ కాంట్రాక్టు, ఎండార్స్ మెంట్ల ద్వారా ఇప్పటికే 85 కోట్ల రూపాయల వరకూ ఆర్జించాడు.
సోషల్ మీడియా ద్వారా స్పందన...
వైద్యులు తనకు అద్భుతమైన చికిత్స అందిస్తున్నారని, రోజు రోజుకు తన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడుతోందని..తొలిసారిగా రిషభ్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.
తన ఆరోగ్యం కోసం పరితపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
అందరి ఆశీసులు, దీవెనలు ఉంటే తాను సాధ్యమైనంత త్వరగానే కోలుకోగలనన్న విశ్వాసం కలుగుతోందని చెప్పాడు.