మంచి తరుణం.. మించిన దొరకదు.. ఆర్సీబీ, సన్‌రైజర్స్‌ను ఊరిస్తున్న ఐపీఎల్
ఎనిమిదేళ్లుగా కప్పు గెలవని సన్‌రైజర్స్ హైదరాబాద్, పద్నాలుగేళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ముఖం వాచిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ రెండు జట్లనూ ట్రోఫీ ఊరిస్తోంది.
ఎనిమిదేళ్లుగా కప్పు గెలవని సన్‌రైజర్స్ హైదరాబాద్, పద్నాలుగేళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ముఖం వాచిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ రెండు జట్లనూ ట్రోఫీ ఊరిస్తోంది. బ్యాటింగ్ బలంతో ఆకాశమే హద్దుగా చెలరేగి ప్లేఆఫ్స్‌కి వచ్చిన సన్‌రైజర్స్, ఆశలు లేని స్థితిలో నుంచి ఉవ్వెత్తున ఎగిసి, ప్లేఆఫ్స్‌కి దూసుకొచ్చిన ఆర్సీబీ కప్పు గెలవడానికి ఇంతకు మించిన మంచి తరుణం లేదు. ఇందుకు కారణం ఐపీఎల్‌ను శాసించిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ఈసారి ప్లే ఆఫ్స్‌కి రాకుండానే వెనుదిరిగాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ తమ క్వాలిఫ్లయర్లలో ముందుకెళ్లి ఈ రెండు జట్లూ టైటిల్ పోరులో తలపడాలన్నది ఎక్కువమంది ఐపీఎల్ లవర్స్ కోరిక.
ముంబయి, చెన్నై చెరో 5సార్లు
ఐపీఎల్ తొలి సీజన్ 2008లో జరిగింది. అప్పటి నుంచి 15 ఏళ్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ చెరో 5 సార్లు కప్పు గెలిచాయి. చెన్నై ఐదుసార్లు రన్నరప్ కూడా. అంటే మొత్తం 15 ఫైనల్స్‌లో పదింటిలో చెన్నై ఆడింది. ఈసారి ఆ జెయింట్ టీమ్స్ లేకపోవడంతో గెలవడం కాస్త సులువని అంచనా వేస్తున్నారు.
కోల్‌కతా, రాజస్థాన్ తక్కువేం కాదు
ఇక ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌తోపాటు ప్లేఆఫ్స్‌కి వచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ ఆర్)ను కూడా తక్కువ అంచనా వేయలేం. రెండుసార్లు ఐపీఎల్ గెలిచిన కేకేఆర్ కూడా భీకరమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటి వరకు టేబుల్ టాపర్ ఆ జట్టే. ఇక రాజస్థాన్ టీమ్‌నూ తక్కువ లెక్క వేయలేం. ఒకసారి కప్పు గెలిచిన ఆర్ ఆర్ కూడా ఈసీజన్‌లో బాగానే ముందుకొచ్చింది. అయితే చెన్నై, ముంబయిలకు ఉన్నంత ఫ్యాన్ బేస్, జనాల్లో హైప్ ఈ రెండు జట్లకూ లేకపోవడంతో మిగిలిన టీమ్‌లకు మానసికంగా పై చేయి లభించడం ఖాయం అంటున్నారు.