జడేజా అవుట్, భారతజట్టులో సౌరవ్ కుమార్!
బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. జడేజాకు బదులుగా సౌరవ్ కుమార్ కు భారతజట్టులో చోటు కల్పించారు..
బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. జడేజాకు బదులుగా సౌరవ్ కుమార్ కు భారతజట్టులో చోటు కల్పించారు..
స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భారత వన్డేజట్టుకు మాత్రమే కాదు..టెస్టు జట్టుకు సైతం దూరమయ్యాడు. ఆసియాకప్ తర్వాత నుంచి గాయంతో జట్టుకు దూరమైన జడేజా
పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోడంతో బంగ్లాదేశ్ తో ఈనెల 14న ప్రారంభం కానున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టు నుంచి తొలగించారు. జడేజా స్థానంలో ఉత్తరప్రదేశ్ స్పిన్ ఆల్ రౌండర్ సౌరవ్ కుమార్ ను చేర్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.
దుబాయ్ వేదికగా ఆసియాకప్ పోటీలు జరుగుతున్న సమయంలో రవీంద్ర జడేజా స్కేట్ బోర్డింగ్ ఆడుతూ జారిపడి గాయంబారిన పడ్డాడు. మోకాలి శస్త్రచికిత్సతో ఇంటికే పరిమితమయ్యాడు.
గత కొద్దిమాసాలుగా జడేజా రీహేబిలేషన్ కార్య్రక్రమాలలో పాల్గొంటున్న పూర్తిస్థాయి ఫిట్ నెస్ సాధించలేకపోడంతో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ తో పాటు టెస్టు సిరీస్ నుంచి సైతం
తప్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో టీ-20 ప్రపంచకప్ తో పాటు బంగ్లాదేశ్ తో జంట సిరీస్ లకు జడేజా దూరం కాక తప్పలేదు.
జడేజాకు బదులుగా సౌరవ్..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఎడమచేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్ సౌరవ్ కుమార్ దేశవాళీ క్రికెట్లో మాత్రమే కాదు..ఇండియా-ఏ జట్ల తరపున సైతం నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. ప్రతిభావంతుడైన స్లోబౌలర్ గా పేరు తెచ్చుకొన్నాడు.
ప్రస్తుతం బంగ్లాదేశ్ -ఏ జట్టుతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత- ఏ జట్టులో సభ్యుడిగా సౌరవ్ కుమార్ పాల్గొంటూ సత్తా చాటుకొన్నాడు.
కాక్స్ బజార్ వేదికగా గతనెలలో జరిగిన తొలిటెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 23 పరుగులిచ్చి 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 63 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో పాటు..
సిల్హౌట్ వేదికగా ముగిసిన మరోమ్యాచ్ లో 39 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకోడం ద్వారా సౌరవ్ భారత టీమ్ మేనేజ్ మెంట్ దృష్టిని ఆకట్టుకొన్నాడు.
ఈ నెల 14 నుంచి జరుగనున్న ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాతో జరిగే రెండుమ్యాచ్ ల సిరీస్ ద్వారా సౌరవ్ అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
షమీకు స్థానంలో నవదీప్ సైనీ..
సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సైతం భుజం గాయంతో వన్డే, టెస్టు సిరీస్ లకు దూరమయ్యాడు. షమీ స్థానంలో ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి భారతటెస్టుజట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత- ఏ జట్టులో సభ్యుడిగా ప్రస్తుతం బంగ్లాతో సిరీస్ ఆడుతున్న నవదీప్..సీనియర్ జట్టుతో చేరనున్నాడు.
ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ల జట్టులో నవదీప్ సైనీ కలువనున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ అనుమానమే?
బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అనుమానమేనని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రకటించారు. రేండోవన్డేలో చేతివేలి గాయంతోనే ఫైటింగ్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్..స్పెషలిస్ట్ తో సంప్రదించడానికి ఢాకా నుంచి ముంబైకి హుటాహుటిన తరలి వచ్చాడు. రోహిత్ గాయం పరిస్థితి తమకు తెలియదని, ఫిట్ నెస్ గురించి కూడా ఇప్పటికి ఇప్పుడే చెప్పలేమని భారత కోచ్ తేల్చి చెప్పారు.
ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో భారత- ఏ కెప్టెన్ , యువ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కు టెస్టుజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. టెస్టు చాంపియన్షిప్ లీగ్ ఫైనల్ కు మాజీ రన్నరప్ భారత్ చేరాలంటే ఆరునూరైనా 2-0తో బంగ్లాదేశ్ ను ఓడించి తీరాల్సి ఉంది.
రోహిత్, షమీ, జడేజాల స్థానంలో ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరవ్ కుమార్ చేరితే...టెస్టుజట్టుకు కొత్తరక్తం ఎక్కించినట్లవుతుంది.