700 వికెట్ల మొనగాడు అశ్విన్!

భారత ఎవర్ గ్రీన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 700 అంతర్జాతీయ వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు.

Advertisement
Update:2023-07-13 16:39 IST

700 వికెట్ల మొనగాడు అశ్విన్!

భారత ఎవర్ గ్రీన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 700 అంతర్జాతీయ వికెట్ల క్లబ్ లో చోటు సంపాదించాడు. వెస్టిండీస్ తో తొలిటెస్టు తొలిరోజుఆటలోనే ఈ ఘనత సాధించాడు...

భారత స్పిన్ జాదూ , 36 ఏళ్ళ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను సాధించాడు. నెలరోజుల విరామం తర్వాత తొలిసారిగా టెస్టుమ్యాచ్ లో పాల్గొన్న ఈ వెటరన్ స్పిన్నర్ కరీబియన్ టూర్ లో సైతం తన జోరు కొనసాగించాడు.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా వెస్టిండీస్ తో ప్రారంభమైన రెండుమ్యాచ్ ల సిరీస్ లోనే తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే అశ్విన్ తన మ్యాజిక్ ప్రదర్శించాడు.

డోమనికాలోనూ అశ్విన్ షో....

కరీబియన్ ద్వీపాలలోని డోమనికా రోసో స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలిటెస్టు తొలిరోజునే అశ్విన్ చెలరేగిపోయాడు. విండ్సర్ పార్క్ పిచ్ నుంచి లభించిన కొద్దిపాటి మద్దతును అశ్విన్ అనుకూలంగా మార్చుకొన్నాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్ కు తగిన స్పిన్, ఫ్లైట్ ను జోడించడం ద్వారా కరీబియన్ బ్యాటర్లను అశ్విన్ బెంబేలెత్తించాడు. 24 ఓవర్లలో 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కు ఇది 33వసారి.

మూడో భారత స్పిన్నర్ అశ్విన్....

వెస్టిండీస్ బ్యాటర్ అల్జారీ జోసెఫ్ ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ తన అంతర్జాతీయ వికెట్ల సంఖ్యను 700కు పెంచుకోడం ద్వారా మరో ఇద్దరు దిగ్గజాల సరసన నిలిచాడు.

భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే తన కెరియర్ లో 953 వికెట్లతో అగ్రస్థానంలో నిలిస్తే...హర్భజన్ సింగ్ 707 వికెట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. 701 వికెట్లతో అశ్విన్ మూడోస్థానం సాధించాడు.

వెస్టిండీస్ ప్రస్తుత సిరీస్ తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో తేజ్ నారాయణ్ చంద్రపాల్ ను పడగొట్టడం ద్వారా అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు.

2011లో తండ్రి, 2023లో కొడుకు వికెట్లు...

వెస్టిండీస్ యువఆటగాడు తేజ్ నారయణ చంద్రపాల్ ను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా అశ్విన్ మరో అరుదైన రికార్డు సాధించాడు. వేర్వేరు తరాలకు చెందిన తండ్రి ( శివనారాయణ చంద్రపాల్ ), కొడుకు( తేజ్ నారాయణ చంద్రపాల్ )లను అవుట్ చేసిన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

2011 లో తన అరంగేట్రం టెస్టుమ్యాచ్ లోనే అప్పటి వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ శివనారాయణ చంద్రపాల్ ను అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలకు శివనారాయణ చంద్రపాల్ కుమారుడు తేజ్ నారాయణ చంద్రపాల్ ను సైతం పడొగట్టగలిగాడు. ఈ ఘనత సాధించిన భారత తొలిబౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

తొలిరోజునే భారత్ ఆధిపత్యం.....

వెస్టిండీస్ తో తొలిటెస్టు తొలిరోజు ఆటలోనే భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగిన భారత్...ఆతిథ్య వెస్టిండీస్ జట్టును 150 పరుగులకే కుప్పకూల్చింది.

వెస్టిండీస్ అరంగేట్రం బ్యాటర్ అలిక్ అత్నాజే 47 పరుగుల ఫైటింగ్ స్కోరు సాధించగా ..మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత స్పిన్ జోడీ అశ్విన్, జడేజా కలసి 8 వికెట్లు పడగొడితే...పేసర్లు శార్దూల్, సిరాజ్ చెరో వికెట్ సాధించారు.

ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 60 పరుగులిచ్చి 5 వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 36 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 30, యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ 40 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు.

వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తో కలసి టెస్టు అరంగేట్రం చేసిన యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన తొలి టెస్టు పరుగు చేయటానికి 16 బంతులపాటు వేచిచూడాల్సి వచ్చింది. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో అప్పర్ కట్ షాట్ తో బౌండ్రీ సాధించడం ద్వారా తన ఖాతా తెరిచాడు.

Tags:    
Advertisement

Similar News