పీవీ సింధు డీలా...ర్యాంకింగ్స్ లో వెలవెల!

భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్ లో డీలా పడిపోయింది.

Advertisement
Update:2023-07-05 13:00 IST

పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు ప్రపంచ ర్యాంకింగ్స్ లో డీలా పడిపోయింది. గత దశాబ్దకాలంలో తొలిసారిగా 15వ ర్యాంక్ కు దిగజారిపోయింది...

తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు రిటైర్మెంట్ కు సమయం దగ్గరపడినట్లే కనిపిస్తోంది. గత మూడేళ్లుగా వరుస పరాజయాలతో వైఫల్యాల ఊబిలో కూరుకుపోయింది. సీజన్ సీజన్ కూ ర్యాంకింగ్స్ లో దిగజారిపోతూ వస్తోంది.

తన కెరియర్ లో ఎన్నో అపురూప, అరుదైన విజయాలు, పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచిన సింధు ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా మారింది.

ప్రపంచ, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల పతకాలు అలవోకగా సాధించిన సింధు గత మూడేళ్లుగా విఫలమవుతూ వస్తోంది.

ఎక్కువభాగం టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దశలోనే నిష్క్ర్రమిస్తూ వస్తోంది.

7వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ కు....

ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మొదటి ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొన్న సింధు తన కెరియర్ లో ఎక్కువ భాగం 7వ ర్యాంక్ లో నిలుస్తూ వచ్చింది.

అయితే..ప్రపంచ బ్యాడ్మింటన్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సింధు 15వ ర్యాంక్ కు దిగజారిపోయింది. గత నెలలోనే తొలిసారిగా టాప్ -10 ర్యాంకింగ్స్ లో చోటు కోల్పోయిన సింధు 12వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ కు పడిపోయింది.

గతేడాది బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన తర్వాత..సింధు చెప్పుకోదగిన మరో విజయం సాధించలేకపోయింది. స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతోంది.

శిక్షకుల్ని మార్చినా.....

వైఫల్యాల ఊబి నుంచి బయటపడటానికి సింధు తరచూ శిక్షకులను మార్చుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ వేదికగా ముగిసిన 2023 ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే సింధుకు చుక్కెదురయ్యింది. 2023 సీజన్ మొదటి మూడుకు మూడు అంతర్జాతీయ టోర్నీల తొలిరౌండ్లోనే సింధు పరాజయాలు చవిచూసింది.

ప్రపంచ టైటిల్, ఒలింపిక్స్ పతకాలు సాధించిన సింధూకి ఆల్- ఇంగ్లండ్ టైటిల్ ఏమాత్రం కొరుకుడు పడటం లేదు. ఆరునూరైనా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కొట్టాలని భావిస్తున్న సింధుపైన ఏడాది ఏడాదికీ వయసు మీద వచ్చి పడుతున్నా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు.

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంలో తనకు అండగా నిలిచిన కొరియా కోచ్ పార్క్ తాయ్ -సాంగ్ తో ఇటీవలే తెగతెంపులు చేసుకొని సరికొత్త కోచ్ తో బరిలోకి దిగినా సింధు రాత మాత్రం మారలేదు.

గత మూడేళ్లుగా ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టడం సింధుకు ఓ అలవాటుగా, బలహీనతగా మారిపోయింది. ఆల్ -ఇంగ్లండ్ మెడల్, ట్రోఫీల సంగతి అటుంచి కనీసం తొలిరౌండ్ గండం నుంచి గట్టెక్కలేకపోతోంది.

తనకంటే పదిర్యాంకులు దిగువన ఉన్న జాంగ్ చేతిలో సింధుకు 17-21, 11-21తో ఓటమి తప్పలేదు. వయసు మీద పడటం, విజయాలు సాధించాలన్న కసి, తపన రానురాను తగ్గిపోతున్న కారణంగానే సింధు వరుసగా వైఫల్యాలు ఎదుర్కొనాల్సి వస్తోంది.

డబుల్స్ జోడీకి అత్యుత్తమ ర్యాంక్...

పురుషుల డబుల్స్ లో భారత స్టార్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి మూడో ర్యాంక్ ను నిలుపుకోగలిగారు. భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ చరిత్రలో ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం.

పురుషుల సింగిల్స్ లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 8వ ర్యాంక్ సాధించాడు. ఓ భారత ఆటగాడు సింగిల్స్ లో సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కాగా.. లక్ష్యసేన్ 19, కిడాంబి శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లు సాధించారు.

Tags:    
Advertisement

Similar News