జైలు జీవితం కడు దుర్భరం- బెకర్!

జర్మన్ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, మూడుసార్లు వింబుల్డన్ విన్నర్ బోరిస్ బెకర్ ఎనిమిదిమాసాల కారాగారవాసం తరువాత విడుదలయ్యాడు. జైలు జీవితం బహుదుర్భరం అంటూ వాపోయాడు.

Advertisement
Update:2022-12-22 09:17 IST

జర్మన్ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్, మూడుసార్లు వింబుల్డన్ విన్నర్ బోరిస్ బెకర్ ఎనిమిదిమాసాల కారాగారవాసం తరువాత విడుదలయ్యాడు. జైలు జీవితం బహుదుర్భరం అంటూ వాపోయాడు....

గ్రాస్ కోర్ట్ టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్లలో ఒకడైన బూమ్ బూమ్ బెకర్ జీవితం ఇంత బతుకూ బతికి అన్నట్లుగా తయారయ్యింది. 5కోట్ల పౌండ్లు ఎగ్గొట్టి దివాళా ప్రకటించిన నేరానికి

ఈ వింబుల్డన్ మాజీ దిగ్గజం , 55 బెకర్ కు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. బ్రిటన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఖైదీగా ఎనిమిదిమాసాలు కారాగారవాసం అనుభవించి కొద్దిరోజుల క్రితమే బయటకు వచ్చాడు.

రెండుసార్లు హత్యాప్రయత్నం...

కారాగార శిక్ష అనుభవిస్తున్న సమయంలో తనపైన ఇద్దరు సహ ఖైదీలు వేర్వేరుగా రెండుసార్లు హత్యా ప్రయత్నం చేశారని, డబ్బులు కావాలంటూ తనను వేధించారని వాపోయాడు. మరో 10 మంది సహఖైదీలు తనను కాపాడకుంటే..జైలులోనే తన జీవితం ముగిసిపోయి ఉండేదంటూ చెప్పుకొచ్చాడు.

3కోట్ల 10 లక్షల పౌండ్ల ఆస్తులు ఉన్నా..2 కోట్ల 50 లక్షల పౌండ్ల ఆస్తులను గోప్యంగా ఉంచుకొని మరీ ఎగవేతకు పాల్పడిన నేరంపై బెకర్ కు లండన్ లోని ఓ న్యాయస్థానం రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

2017కు ముందు బెకర్ 5 కోట్ల పౌండ్లు అప్పులుచేసి దివాళా ప్రకటించాడు. స్పెయిన్ లోని మొజార్కా ద్వీపం బెకర్ పేరుతోనే ఉంది. దాని విలువ 2 కోట్ల 50 లక్షల పౌండ్ల పైమాటే. అయితే ఆ విషయాన్ని కోర్టు ముందుంచకుండా బెకర్ నాటకమాడి దొరికిపోయాడు. చివరకు తాను మూడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన వేదికకు చేరువలోనే ఉన్న వాండ్స్ వర్త్ జైలులో శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

రాత్రి సమయాలలో మృత్యు భయం..

జైలు జీవితం చాలా భయంకరంగా అనిపించిందని, పగలు ఎలాగో గడిపినా...రాత్రవుతుందంటే చాలు..మృత్యు భయం వెంటాడేదని, తనతో కలసి ఉన్న కరడుగట్టిన ఇద్దరు ఖైదీలలో ఎవరు తనను చంపుతారో అన్న బెంగతా కంటిమీద కునుకు లేకుండా గడిపానని గద్గద స్వరంతో చెప్పాడు. పలువురిని హత్య చేసిన నేరారోపణలతో 25 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న జాన్ అనే సహఖైదీ తనపైన హత్యాయత్నం చేశాడని..మరో 10 మంది ఖైదీలు వచ్చి తనను కాపాడారని గుర్తు చేసుకొన్నాడు.

ఇకీ అనే మరో ఖైదీ తనను క్షమాపణలు చెప్పాలంటూ బెదిరించి..కింద పడేసి తొక్కి చంపబోయాడంటూ బెకర్ విలపించినంత పనిచేశాడు.

జైలుజీవితాన్ని తాను బతుకు జీవుడా అంటూ అనుభవించానని వాపోయాడు. జైలు తలుపులు తెరచిన సమయంలో తనకు ప్రాణవాయువు అందినట్లు ఉండేదని, కటకటాల తలుపులు మూస్తున్న సమయంలో ఊపిరి ఆగిపోయినట్లుగా ఉండేదని తన అనుభవాన్ని వివరించాడు. జైలులో ఉన్నసమయంలో తాను కంటిమీద కునుకు తీసిందని లేదని, ఆదమరచి పడుకొన్న సందర్భమే లేదని వివరించాడు.

జైలుగది దుర్గంధపూరితంగా, అశుభ్రంగా ఉండేదని, పలు రకాల నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ తో కలసి జీవించడాన్ని మించిన శిక్ష మరొకటి ఉండదని బెకర్ తెలిపాడు.

గురువుగా మారిన బెకర్...

జైలులోని 30 మంది సహఖైదీలకు తాను ఆంగ్లం, గణిత పాఠాలు బోధించడం ద్వారా...మెరుగైన వసతులు కలిగిన దక్షిణ ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ హంటర్ కోంబ్ జైలుకు మార్పించుకోగలిగినట్లు చెప్పాడు. జర్మన్ రాయబారి జోక్యంతో తనకు అంతర్జాతీయ ఫోను సదుపాయం కల్పించారని, 87 సంవత్సరాల తన తల్లి ఇల్విరాతో మాట్లాడుతూ సేదతీరేవాడినని గుర్తు చేసుకొన్నాడు.

బెకర్ బ్రిటీష్ జాతీయుడు కాకపోడంతో రెండున్నర సంవత్సరాల పూర్తి శిక్ష అనుభవించకుండానే ఇంగ్లండ్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. చివరకు 8మాసాల జైలు జీవితంతోనే బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.

ఓ స్నేహితుడు పంపిన ప్రయివేట్ జెట్ విమానంలో లండన్ నుంచి జర్మనీలోని స్టుట్ గార్ట్ కు తిరిగి వచ్చాడు. స్వదేశం చేరుకొన్న వెంటనే తాను తాగిన బీరే తన జీవితంలో అత్యుత్తమ బీరు అంటూ బెకర్ పొంగిపోయాడు.

తన శేషజీవితాన్ని జర్మనీలోనే గడుపుతానే లేక..అమెరికాలోని మియామీలో గడుపుతానే తెలియదని, ఏంజరుగుతుందో రానున్న కాలమే చెప్పాలని తెలిపాడు.

విజయ్ మాల్యా, చోక్సీ లాంటి పలువురు బడాబాబులు భారత్ లోని బ్యాంకులకు వందలకోట్లు ఎగ్గొట్టి లండన్ కు పారిపోయి దర్జాగా బతుకుతుంటే..పాపం...ఆరుగ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ బెకర్ మాత్రం..లండన్ లో కారాగారవాసం అనుభవించడం చిత్రమే మరి.

Tags:    
Advertisement

Similar News