అమ్మకూచిలు ఈ విశ్వవిజేతలు!

రంగం ఏదైనా విజయవంతమైన, విజేతగా నిలిచిన ప్రతి పురుషుడి వెనుక ఓ మహిళ ఉంటుందన్నది ఎంత సత్యమో...విశ్వవిజేతగా నిలిచిన ప్రతికీడాకారుడి వెనుక ఓ అమ్మ ఉండితీరుతుందన్నది అంతే నిజం.

Advertisement
Update:2023-09-15 11:00 IST

అమ్మకూచిలు ఈ విశ్వవిజేతలు!

రంగం ఏదైనా విజయవంతమైన, విజేతగా నిలిచిన ప్రతి పురుషుడి వెనుక ఓ మహిళ ఉంటుందన్నది ఎంత సత్యమో...విశ్వవిజేతగా నిలిచిన ప్రతికీడాకారుడి వెనుక ఓ అమ్మ ఉండితీరుతుందన్నది అంతే నిజం.

ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగం నవ,యువతరం చాంపియన్లతో వెలిగిపోతోంది. మేధో క్రీడ చదరంగం నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశమైన జావలిన్ త్రో వరకూ అత్యంత పిన్నవయసులోనే అబ్బురపరచే విజయాలు, ప్రపంచ పతకాలు సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్ , బల్లెం విసురుడులో 'బాహుబలి ', ప్రపంచాన్నే జయించిన మొనగాడు నీరజ్ చోప్రాలను చూసి ఓ వైపు భరతమాత పొంగిపోతుంటే మరోవైపు తమ కుమారులు సాధించిన విజయాలు చూసి వారి తల్లులు మురిసిపోతున్నారు.

అమ్మప్రేమే ఆలంబనగా.....

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో 25 సంవత్సరాల నీరజ్ చోప్రా ఒలింపిక్స్, ప్రపంచ పోటీల బంగారు పతకాలు సాధించినా, చదరంగ ప్రపంచకప్ పోటీలలో 18 సంవత్సరాల ప్రఙ్జానంద్ రజత విజేతగా నిలిచినా ఆ విజయాల వెనుక ప్రేరణగా, అదృశ్య శక్తిగా ఉన్నది మాత్రం వారి తల్లులే.

హర్యానాలోని పానిపట్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా చిన్నతనంలో ఊబకాయంతో బొద్దుగా ఉండడంతో అందరూ ఆట పట్టించేవారు. అయితే తన కుమారుడి ఊబకాయం తగ్గటానికి అసలు మందు వ్యాయామం, క్రీడలు మాత్రమేనని నీరజ్ తల్లి సరోజ్ బాలా గ్రహించారు. జిమ్నాస్టిక్స్ లో చేర్చితే వళ్ళు తగ్గిపోతుందని భావించారు. అయితే ..నీరజ్ మాత్రం జిమ్నాస్టిక్స్ ను కాదనుకొని అథ్లెటిక్స్ బాట పట్టాడు.

తన తల్లితో కలసి స్టేడియానికి వెళ్లిన సమయంలో జావలిన్ ( బల్లెం ) విసురుతున్న ఓ అథ్లెట్ ను చూసిన నీరజ్ మరో ఆలోచన లేకుండా జావలిన్ త్రోవైపు మొగ్గుచూపాడు. రోజూ సాధన చేయటం ద్వారా తన ఫిట్ నెస్ ను గణనీయంగా మెరుగుపరచుకొన్నాడు. అతిస్వల్పకాలంలోనే దేశంలోని అత్యుత్తమ జూనియర్ జావలిన్ త్రోయర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

ప్రపంచ జూనియర్, ఆసియా అథ్లెటిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడలలో అలవోకగా బంగారు పతకాలు సాధించడం ద్వారా ఒలింపిక్స్ బంగారు పతకానికే గురిపెట్టాడు.

టోక్యో వేదికగా రెండేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్ లో నీరజ్ ఏకంగా స్వర్ణపతకం సాధించాడు. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ లో భారత్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో బంగారు పతకం సాధించిన మొనగాడిగా నిలిచాడు.

బుడాపెస్ట్ వేదికగా ఇటీవలే ముగిసిన 2023 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో సైతం నీరజ్ బంగారు పతకంతో విశ్వవిజేతగా నిలవడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

నీరజ్ చోప్రా స్వర్ణపతకం సాధించడంతోనే ఖంద్రా గ్రామప్రజలు మిఠాయిలు పంచుకొని మరీ సంబరాలు జరుపుకొన్నారు. నీరజ్ తల్లిదండ్రులు సైతం తమ గ్రామంలోని ప్రతి ఇంటికీ మిఠాయిలు పంపి మరీ తమ ఆనందాన్ని పంచుకొన్నారు.

ఒలింపిక్ చాంపియన్, విశ్వవిజేత నీరజ్ చోప్రా మాత్రం తన ఈ విజయాల వెనుక తల్లిదండ్రులపాత్ర ఎంతో ఉందని, ప్రధానంగా తన తల్లి సరోజ్ బాల ప్రేరణ అంతాఇంతా కాదని, అమ్మలేకపోతే తాను లేనని సగర్వంగా ప్రకటించాడు.

నీరజ్ ఇష్టప్రకారమే.....

అంతర్జాతీయ పోటీలలో నీరజ్ అత్యుత్తమంగా రాణించడానికి తమ తోడ్పాటు అడుగడుగునా ఉంటుందని, ఏ రూపంలోనూ తాము ఒత్తిడి చేయబోమని, అంతా నీరజ్ ఇష్టప్రకారమే జరిగేలా చూస్తామని సరోజ్ బాలా తన మనసులో మాట బయట పెట్టారు.

25 సంవత్సరాల ప్రాయానికే నీరజ్ ప్రపంచ స్థాయిలోని అన్నిరకాల టైటిల్స్, బంగారు పతకాలు సాధించాడని, ఇక తన వ్యక్తిగత జీవితంలో స్థిరపడాల్సి ఉందని నీరజ్ తల్లి అంటున్నారు. పెళ్లి చేసుకోమని తాము ఒత్తిడి చేసే ప్రసక్తేలేదని, ఎప్పుడు చేసుకోవాలో నీరజ్ కు బాగా తెలుసునని చెప్పారు.

ఓ అథ్లెట్ గా నీరజ్ శారీరక అవసరాలకు తగిన ఆహారాన్ని అందుబాటులో ఉంచడం, అత్యుత్తమంగా రాణించడానికి అవసరమైన మానసిక తోడ్పాటు అందించడం వరకే తమ విధి అని చెప్పుకొచ్చారు.


అమ్మకూచి గ్రాండ్ మాస్టర్ ప్రఙ్జానంద్...

12 సంవత్సరాల చిరుప్రాయానికే గ్రాండ్ మాస్టర్ హోదా, 18 సంవత్సరాల వయసుకే ప్రపంచకప్ రజత పతకాలు సాధించిన ప్రఙ్జానంద్ వెనుక నీడలా అతని తల్లి నాగలక్ష్మి ఉంటూ వస్తున్నారు.

చెన్నై మహానగరంలోని ఓ తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన ప్రఙ్జానంద్ తండ్రి రమేశ్ ఓ బ్యాంకు ఉద్యోగి. తల్లి నాగలక్ష్మి మాత్రం ఓ సాధారణ గృహిణి.

ప్రఙ్జా, అతని సోదరి వైశాలి ఇద్దరూ టీవీలు చూసి ఎక్కడ చెడిపోతారో అన్న భయంతో చదరంగ క్రీడలో ప్రవేశపెట్టారు. అక్క వైశాలి, తమ్ముడు ప్రఙ్జానంద్ ఇద్దరూ చెస్ క్రీడను చిన్నతనంలోనే వంటపట్టించుకోడంలో నాగలక్ష్మి ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. పిల్లల ఏకాగ్రత దెబ్బతినకుండా, సాధనకు అంతరాయం ఏర్పడ కుండా శ్రద్ధతీసుకొంటూ తీర్చి దిద్దారు.

12 సంవత్సరాల వయసుకే ప్రఙ్జానంద్, వైశాలి మెరికల్లాంటి గ్రాండ్ మాస్టర్లుగా తయారై జాతీయ చదరంగంలోకి దూసుకొచ్చారు. దేశవిదేశాలలో ఎక్కడ చెస్ టోర్నమెంట్లు జరిగినా ప్రఙ్జానంద్ కు తోడుగా తాను వెళ్ళటం నాగలక్ష్మి అలవాటు చేసుకొన్నారు.


అమ్మచేతి వంటే ప్రఙ్జానంద్ బలం...

చిన్నతనం నుంచి అమ్మచేతి వంటకు బాగా అలవాటు పడిన ప్రఙ్జానంద్ కు రసం అన్నా, అన్నం అన్నా చెప్పలేని ఇష్టం. ప్రపంచంలోని ఏ దేశంలో పోటీలు జరిగినా, చెన్నై నుంచి వేలకిలోమీటర్లు ప్రయాణం ఉన్నా చిన్న ఇండక్షన్ స్టౌవ్, కుక్కర్, రెండు వంటపాత్రలు, బియ్యం వెంట తీసుకువెళ్ళటం నాగలక్ష్మికి అలవాటు. నిర్వాహక సంఘం కేటాయించిన హోటల్ గదిలోనే వంట చేసి ప్రఙ్జానంద్ కు భోజనం పెట్టడం నాగలక్ష్మికి గత కొద్దిసంవత్సరాలుగా ఓ అలవాటుగా మారింది.

తన విజయాలకు అసలు కారణం అమ్మచేసిన రసమేనని, అమ్మలేని తాను లేనంటూ ప్రఙ్జానంద్ తరచూ గుర్తుచేసుకొంటూ ఉంటాడు. మరోవైపు..తనకు చెస్‌ క్రీడ గురించి ఏమీతెలియదని, తనకు తెలిసిందల్లా తన పిల్లల్ని స్థాయికి తగ్గట్టుగా ఆడేలా ప్రోత్సహించడమేనని నాగలక్ష్మి ప్రకటించారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ చెస్ ఫైనల్ కు చేరడంతో పాటు రజత పతకం సాధించిన ఘనత తన కుమారుడు ప్రఙ్జానంద్ కు దక్కడంతో పుత్రోత్సాహంతో ఆమె మురిసిపోతున్నారు.

ప్రఙ్జానంద్ తండ్రి రమేశ్ సైతం..తమ పిల్లలు సాధించిన విజయాలు, పతకాలు, ఘనతల వెనుక తన భార్య నాగలక్ష్మి కష్టం, త్యాగం, అంకితభావం ఉన్నాయని సగర్వంగా ప్రకటించారు.

ఐదుసార్లు విశ్వవిజేత, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ మాగ్నుస్ కార్ల్ సన్ తో జరిగిన ప్రపంచకప్ టైటిల్ పోరులో పసికూన ప్రఙ్జానంద్ అసాధారణంగా పోరాడి రన్నరప్ ట్రోఫీని కైవసం చేసుకోగలిగాడు.

మనదేశంలో వివిధ క్రీడల్లో గొప్పగొప్ప విజయాలతో ప్రపంచ టైటిల్స్, పతకాలు సాధించిన నిన్నటి విశ్వనాథన్ ఆనంద్ నుంచి నేటి నీరజ్ చోప్రా, ప్రఙ్జానంద్ లాంటి ఎందరో చాంపియన్ల విజయాలు, ఘనతల వెనుక ఉన్నది మాత్రం వారి తల్లులే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News