పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో కాంస్యం!

పారిస్ ఒలింపిక్స్ పోటీల ఆరోరోజున భారత్ మరో కాంస్య పతకం గెలుచుకొంది. పతకాల పట్టిక 41వ స్థానంలో కొనసాగుతోంది.

Advertisement
Update:2024-08-01 16:03 IST

పారిస్ ఒలింపిక్స్ పోటీల ఆరోరోజున భారత్ మరో కాంస్య పతకం గెలుచుకొంది. పతకాల పట్టిక 41వ స్థానంలో కొనసాగుతోంది.

2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్లు మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పోటీల ఆరోరోజున షూటింగ్ రైఫిల్ విభాగంలో స్విప్నీల్ కుశాలే కాంస్య పతకం సాధించాడు. దీంతో ఆరురోజుల్లో ముగ్గురు భారత షూటర్లు మూడు పతకాలు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.

461.3 పాయింట్లతో కంచు పతకం...

పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో మహారాష్ట్ర్రలోని ఓ రైతు కుటుంబానికి చెందిన స్వప్నిల్ కుశాలే అంచనాలకు మించి రాణించడం ద్వారా ఫైనల్స్ చేరడమే కాదు..451.4 పాయింట్లతో కాంస్య పతకం గెలుచుకోగలిగాడు.

ప్రస్తుత ఒలింపిక్స్ లో భారత్ కు ఇది మూడో పతకం కావడం విశేషం. పోటీల రెండోరోజున పిస్టల్ 10 మీటర్ల మహిళళ వ్యక్తిగత విభాగంలో మను బాకర్ కంచు పతకంతో బోణీ కొట్టింది. ఆ తరువాత జరిగిన 10 మీటర్ల మిక్సిడ్ టీమ్ విభాగంలో మను బాకర్- సరబ్ జోత్ సింగ్ జోడీ సైతం కాంస్య పతకంతోనే భారత్ పతకాల సంఖ్యను రెండు కు పెంచారు.

ఇప్పుటు పురుషుల రైఫిల్ షూటింగ్ లో కుశాలే సైతం కంచు మోత మోగించాడు. మెడల్ రౌండ్లో మొత్తం 10 మంది షూటర్లు తలపడితే..చైనాకు చెందిన లియు యుకున్ 463. 6 పాయింట్లతో బంగారు పతకం గెలుచుకోగా..ఉక్రెయిన్ షూటర్ సెర్హీ కులిష్ 461.3 పాయింట్లతో రజత పతకం సాధించాడు. స్వప్నిల్ 451.4 పాయింట్లు సాధించడం ద్వారా మూడో అత్యుత్తమ షూటర్ గా పతకం అందుకొన్నాడు.

ఒలింపిక్స్ లో 12 దశాబ్దాల భారత చరిత్రలో ముగ్గురు షూటర్లు మూడు పతకాలు సాధించడం ఇదే మొదటి సారి. 2012 లండన్ ఒలింపిక్స్ లో విజయ్ కుమార్, గగన్ నారంగ్ పతకాలు సాధించిన తరువాత..ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా రికార్డుల్లో చేరింది.

సంవత్సరాల తరబడి చేసిన సాధనకు తగిన ఫలితం ఒలింపిక్స్ పతకం రూపంలో తనకు దక్కడం పట్ల స్వప్నిల్ సంతృప్తి వ్యక్తం చేశాడు.

పతకానికి గెలుపు దూరంలో లవ్లీనా...

బాక్సింగ్ మహిళల 75 కిలోల విభాగంలో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ పతకానికి గెలుపు దూరంలో నిలిచింది. గత ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకం రికార్డును మెరుగు పరచుకోవాలన్న పట్టుదలతో వరుసగా రెండో ఒలింపిక్స్ బరిలో నిలిచిన లవ్లీనా తొలిరౌండ్ బై అనంతరం రెండోరౌండ్లో నార్వే బాక్సర్ సున్నివాను 3-2తో అధిగమించడం ద్వారా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.

ప్రపంచ చాంపియన్ హోదాలో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న లవ్లీనా తన అనుభవాన్నంతా ఉపయోగించి విజేతగా నిలిచింది. సెమీస్ లో చోటు కోసం జరిగి పోరులో చైనా బాక్సర్ లీ క్వియాన్ తో తలపడనుంది.

టోక్యో ఒలింపిక్స్ 69 కిలోల విభాగంలో కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ 75 కిలోల విభాగంలో పోటీ పడుతోంది. క్వార్టర్ ఫైనల్ విజయం సాధించగలిగితే..లవ్లీనా కనీసం కాంస్య పతకం దక్కించుకోగలుగుతుంది.

ఒలింపిక్స్ బాక్సింగ్ చరిత్రలో భారత్ తరపున 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో విజేందర్ సింగ్, 2012 లండన్ ఒలింపిక్స్ లో మేరీకోమ్, 2020 ఒలింపిక్స్ లో లవ్లీనా మాత్రమే పతకాలు గెలుచుకోగలిగారు.

మహిళల 50 కిలోల విభాగంలో భారత్ కమ్ తెలంగాణా బాక్సర్ నిఖత్ జరీన్ తన తొలిరౌండ్ పోరులో చైనాకు చెందిన టాప్ సీడ్ బాక్సర్ వుయుతో అమీతుమీ తేల్చుకోనుంది.

28 సంవత్సరాల నిఖత్ జరీన్ కు ప్రపంచ, ఆసియాక్రీడల టైటిల్స్ సాధించిన రికార్డు ఉంది.

టీటీ సింగిల్స్ లో పోరాడి ఓడిన శ్రీజ...

టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ రౌండ్లోనే భారత స్టార్ ప్లేయర్లు శ్రీజ ఆకుల, మనీకా బాత్రాల పోటీ ముగిసింది. తొలిరౌండ్లో 4-2తో ఫ్రెంచ్ ప్లేయర్ ను కంగు తినిపించిన శ్రీజ ఆకుల క్వార్టర్ ఫైనల్లోచోటు కోసం జరిగిన పోరులో మాత్రం చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ ఇంగ్షా సున్ తో పోరాడి ఓడింది. 38 నిముషాల పోరులో శ్రీజ 10-12, 10-12, 3-11తో పరాజయం చవిచూసింది.

మరో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌ పోరులో భారత రెండోర్యాంకర్ మనీకా బాత్రా సైతం పరాజయం పొందక తప్పలేదు. జపాన్ టాప్ ర్యాంక్ ప్లేయర్ మియు హిరానా చేతిలో మనీక 1-4తో ఓటమి పాలయ్యింది.

టీటీలో ఇక..పురుషుల వ్యక్తిగత పోటీలతో పాటు..పురుషుల, మహిళల టీమ్ పతకాల కోసం భారత్ పోటీపడాల్సి ఉంది.

మూడు పతకాలు నెగ్గినా.....!

పారిస్ ఒలింపిక్స్ మొదటి ఆరురోజుల పోటీలలోనే భారత్ మూడు కాంస్య పతకాలు సాధించినా...పతకాల పట్టిక 41వ స్థానంలో మాత్రమే నిలువగలిగింది. చైనా అత్యధికంగా 10 స్వర్ణాలతో సహా 20 పతకాలు సాధించడం ద్వారా పతకాల పట్టిక ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్ర్రేలియా, గ్రేట్ బ్రిటన్ ఐదుస్థానాలలో కొనసాగుతున్నాయి.

పారిస్ ఒలింపిక్స్ లో మొత్తం 205 దేశాలు పోటీపడుతుంటే...ఇప్పటి వరకూ 44 దేశాలు మాత్రమే పతకాల పట్టికలో నిలువగలిగాయి.

Tags:    
Advertisement

Similar News