అట్టహాసంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్!

పారిస్ వేదికగా గత రెండువారాలుగా సాగిన 33వ ఒలింపిక్‌ గే్మ్స్ అట్టహాసంగా ముగిశాయి. భారత బృందానికి మను బాకర్- శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు.

Advertisement
Update:2024-08-12 14:26 IST

పారిస్ వేదికగా గత రెండువారాలుగా సాగిన 33వ ఒలింపిక్‌ గే్మ్స్ అట్టహాసంగా ముగిశాయి. భారత బృందానికి మను బాకర్- శ్రీజేశ్ పతాకధారులుగా వ్యవహరించారు.

అరుదైన రికార్డులు, పలు సంచలనాలు, అసాధారణ వివాదాల నడుమ జరిగిన 2024 ఒలింపిక్స్ కు ఫ్రెంచ్ రాజధాని పారిస్ నగరం వేదికగా తెరపడింది. కన్నులపండుగగా సాగిన ముగింపు వేడుకల కవాతు అనంతరం పోటీలు ముగిసినట్లుగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బెక్ ప్రకటించారు.

సంగీత కార్యక్రమాలతో ముగింపు..

ముగింపు వేడుకలకు వేదికగా ఉన్న స్టేడియం డి ఫ్రాన్స్ సాంప్రదాయ ఫ్రెంచ్ సంగీతంతో సందడి సందడిగా మారిపోయింది. పోటీలలో పాల్గొన్న మొత్తం 205 దేశాలకు చెందిన ప్రతినిథులు ముగింపు వేడుకల కవాతులో పాల్గొన్నారు.

మొత్తం 117 మంది అథ్లెట్ల బృందంతో పతకాలవేటకు దిగి చివరకు 6 పతకాలతో..పతకాల పట్టిక 71వ స్థానంలో నిలిచిన భారత్ కు ముగింపు వేడుకల్లో సంయుక్త పతాకధారులుగా పతకవిజేతలు శ్రీజేష్- మను బాకర్ వ్యవహరించారు.

నాటినుంచి నేటి వరకూ...అనాది నుంచి నవీనానికి అన్న థీమ్ తో ముగింపు వేడుకల కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.

పారిస్ ఒలింపిక్స్ నిర్వాహక సంఘం చైర్మన్ టోనీ ఈస్టాంగ్వే కృతజ్ఞతా సందేశం తరువాత 33వ ఒలింపిక్స్ ను ముగిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అధినేత థామస్ బెక్ ప్రకటించారు.

మరో నాలుగేళ్ల తరువాత జరిగే 34వ ఒలింపిక్ గేమ్స్ కు లాస్ ఏంజెలిస్ నగరం వేదికగా ఉంటుందని మరోసారి అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడలలో అమెరికా, చైనా చెరో 40 బంగారు పతకాలు చొప్పున సాధించి పతకాల పట్టిక మొదటి రెండుస్థానాలలో నిలిచాయి.

470 కోట్లు ఖర్చుకు ఆరే పతకాలు!

పారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అత్యుత్తమంగా రాణించడం కోసం భారత ప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా ఖర్చు చేసింది. అయితే..గత ఒలింపిక్స్ కంటే తక్కువ సంఖ్యలో పతకాలు రావటం నిరాశను కలిగించింది.

జులై 26 నుంచి రెండువారాలపాటు సాగిన 33వ ఒలింపిక్స్ లో భారత్ 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడలకు చెందిన 69 పతకం అంశాలలో పోటీకి దిగింది.

అథ్లెట్లను ఒలింపిక్స్ కు సమాయత్తం చేయటానికి భారత క్రీడామంత్రిత్వశాఖ వివిధ రూపాలలో గత కొద్ది సంవత్సరాలుగా 470 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

అయితే..కేవలం నాలుగు రకాల క్రీడల్లోనే భారత్ కు ఆరు పతకాలు మాత్రమే దక్కాయి.

విలువిద్య, బ్యాడ్మింటన్, బాక్సింగ్, అశ్వక్రీడలు, గోల్ఫ్, జూడో, రోయింగ్, సెయిలింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్ క్రీడల్లో భారత అథ్లెట్లు విఫలమయ్యారు. ఉత్తచేతులతో తిరిగి వచ్చారు.

ఒలింపిక్స్ లో పతకం సాధించే సత్తా కలిగిన అథ్లెట్లను ముందుగానే గుర్తించి..వారికి అత్యాధునిక శిక్షణ కల్పించడం కోసం భారత ప్రభుత్వం 'టాప్స్ ' ( టార్గెట్ ఒలింపిక్ పోడియం ) పథకం ద్వారా 17 కోట్ల 90 లక్షల రూపాయలు అందచేసింది. వ్యక్తిగత శిక్షకులతో పాటు విదేశాలలో సైతం శిక్షణ పొందటానికి అథ్లెట్లకు అనుమతి ఇచ్చింది.

చివరకు భారత అథ్లెట్లు మాత్రం కనీసం ఒక్క స్వర్ణమూ లేకుండా ఆరు పతకాలు మాత్రమే సాధించగలిగారు. మరో ఆరు కాంస్య పతకాలు భారత్ కు చిక్కినట్లే చిక్కి చేజారిపోయాయి. వినేశ్ పోగట్ కు రజతం ఇచ్చేదీ లేనిదీ మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.

Tags:    
Advertisement

Similar News