భారత్ చేజారిన మూడు పతకాలు!
పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే మూడు కాంస్య పతకాలు భారత్ చేజారాయి. షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో పతకాలు చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయాయి.
పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే మూడు కాంస్య పతకాలు భారత్ చేజారాయి. షూటింగ్, ఆర్చరీ క్రీడల్లో పతకాలు చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయాయి...
ప్రపంచక్రీడల పండుగ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం చాలాతక్కువమందికి మాత్రమే దక్కుతుంది. అంతేకాదు..ఒలింపిక్స్ బరిలో నిలిచిన అథ్లెట్లలో పతక విజేతలుగా నిలిచే అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కుతుంది.
కొండంత ప్రతిభకు గోరంత అదృష్టం తోడైతేనే....
205 దేశాలకు చెందే క్రీడాకారులు పోటీ పడే ఒలింపిక్స్ లో పతకం సాధించాలంటే కొండంత ప్రతిభతో పాటు గోరంత అదృష్టం సైతం ఉండి తీరాలి. అదృష్టం లేకపోతే వెంట్రుక వాసిలో పతకం చేజార్చుకొనే ప్రమాదం లేకపోలేదు.
ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్న పట్టుదలతో అథ్లెట్లు సంవత్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటే..వారిపై ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తూ ఉండటం సాధారణ విషయమే. అథ్లెట్లు, ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసినా పతకం సాధించగలమన్న గ్యారెంటీ ఏమీలేదు.
ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ మొదటి ఎనిమిదిరోజుల పోటీలలోనే భారత్ మూడు కాంస్య పతకాలను చేజార్చుకొంది. మహిళల, పురుషుల షూటింగ్ వ్యక్తిగత విభాగాలతో పాటు..విలువిద్య మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం భారత క్రీడాకారులు నాలుగోస్థానాలతో ఉసూరుమనాల్సి వచ్చింది.
మను బాకర్ ను వెక్కిరించిన అదృష్టం...
పారిస్ ఒలింపిక్స్ మహిళల ఏర్ పిస్టల్ 10 మీటర్ల వ్యక్తిగత, మిక్సిడ్ టీమ్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిన 22 ఏళ్ల భారత షూటర్ మను బాకర్..మూడో పతకం గెలుచుకొనే అవకాశాన్ని చేజార్చుకొంది.
25 మీటర్ల ఏర్ పిస్టల్ విభాగం క్వాలిఫైయింగ్ రౌండ్లలో అద్భుతంగా రాణించడం ద్వారా రెండో అత్యుత్తమ షూటర్ గా మెడల్ రౌండ్లో అడుగుపెట్టిన మను బాకర్ అదే నిలకడ ప్రదర్శించలేకపోయింది. కాంస్య పతకం కోసం హంగెరీ షూటర్ వెరోనికా మేజర్ తో హోరాహోరీగా సాగిన పోరులో విఫలమై నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఒకే ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన భారత తొలి అథ్లెట్ కమ్ షూటర్ రికార్డును అందుకొనే అవకాశం చేజార్చుకొంది.
1.4 పాయింట్ల తేడాతో దక్కని కాంస్యం..
పురుషుల 10 మీటర్ల ఏర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సైతం భారత షూటర్ అర్జున్ బబుతాను సైతం దురదృష్టం వెంటాడింది. కేవలం 1.4 పాయింట్లతేడాతో కాంస్య పతకం చేజార్చుకోవాల్సి వచ్చింది.
క్రొయేషియా షూటర్ మిరాన్ మిర్చిచ్ 209.8 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకొంటే..అర్జున్ మాత్రం 206.4 పాయింట్లతో నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
తెలుగుతేజానికి దక్కని పతకం..
విలువిద్య మిక్సిడ్ టీమ్ విభాగంలో సైతం భారత జోడీ ధీరజ్ బొమ్మదేవర- అంకిత భక్త్ నాలుగోస్థానంలో మిగిలిపోయారు. కాంస్య పతకం కోసం అమెరికాజోడీ బ్రాడీ ఎలీసన్- కేసీ కుఫ్ హోల్డ్ లతో జరిగిన పోరులో 2-6తో భారత్ జోడీ పరాజయం చవిచూడాల్సి వచ్చింది.
ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రమే కాదు..1920 ఒలింపిక్స్ నుంచి ఇప్పటి వరకూ వివిధ క్రీడల్లో 19 మంది భారత అథ్లెట్లు కాంస్య పతకాలు దక్కించుకోలేక 4వ స్థానంలో మిగిలిపోవాల్సి వచ్చింది.
1920 నుంచి 2024 వరకూ...
1920 యాంట్వార్ప్ ఒలింపిక్స్ నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకూ..ఫ్లయింగ్ సిక్ మిల్కాసింగ్ నుంచి మొత్తం 19 మంది భారత అథ్లెట్లు నాలుగోస్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
1920 ఒలింపిక్స్ పురుషుల ఫ్రీ-స్టయిల్ కుస్తీ 54 కిలోల విభాగంలో రణధీర్ షైన్..కాంస్య పతకం పోరులో గ్రేట్ బ్రిటన్ వస్తాదు ఫిలిప్ బెర్నార్డ్ చేతిలో పరాజయం పొంది..4వ స్థానంతో సరిపెట్టుకొన్నాడు.
1952 హెల్సింకీ ఒలింపిక్స్ పురుషుల 62 కిలోల ఫ్రీ-స్టయిల్ కుస్తీలో భారత వస్తాదు కేశవ్ మంగేవే 4వ స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన జోసియా హెన్సన్ తో జరిగిన పతకం పోరులో పరాజయం పొందాడు.
1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ ఫుట్ బాల్ లో భారతజట్టు సైతం 4వ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కాంస్య పతకం కోసం బల్గేరియాతో జరిగిన పోరులో భారత్ 0-3 గోల్స్ తో ఓటమి పాలయ్యింది.
పాపం! మిల్కాసింగ్......
1960 రోమ్ ఒలింపిక్స్ పురుషుల 400 మీటర్ల పరుగులో సైతం భారత స్టార్ రన్నర్ మిల్కాసింగ్ కాంస్య పతకాన్ని చేజార్చుకొన్నాడు. వెంట్రుకవాసిలో పతకం చేజార్చుకొని 4వ స్థానానికి పరిమితమయ్యాడు.
రోమ్ వేదికగానే జరిగిన ఒలింపిక్స్ పురుషుల 57 కిలోల కుస్తీ విభాగంలో సైతం భారత రెజ్లర్ ప్రేమ్ నాథ్ 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 7వ రౌండ్ వరకూ వచ్చిన 9 పెనాల్టీ పాయింట్ల కారణంగా ప్రేమ్ నాథ్ కాంస్య పతకం సాధించే అవకాశం కోల్పోయాడు.
1972 మ్యూనిక్ ఒలింపిక్స్ పురుషుల కుస్తీ 52 కిలోల విభాగంలో సైతం సుదేశ్ కుమార్ 7 పెనాల్టీ పాయింట్లతో 4వ స్థానంలో మిగిలాడు.
పీటీ ఉషకూ తప్పని గుండెకోత...
భారత పరుగుల రాణి పీటీ ఉషను సైతం ఒలింపిక్స్ లోదురదృష్టం వెంటాడింది. సెకనులో వందవ వంతు తేడాతో కాంస్య పతకం సాధించే అవకాశం చేజార్చుకొంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో ఉష 4వ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. ఆసియాస్థాయిలో 50కి పైగా పతకాలు సాధించిన పయ్యోలీ ఎక్స్ ప్రెస్ పీటీ ఉష చివరకు ఒలింపిక్స్ పతకం లేకుండానే తన కెరియర్ ను ముగించాల్సి వచ్చింది.
అదే ఒలింపిక్స్ పురుషుల కుస్తీ 74 కిలో విభాగంలో సైతం భారత మల్లయోధుడు రాజిందర్ సింగ్ ను దురదృష్టం వెంటాడింది. అల్బేనియా వస్తాదు సబాన్ సెజ్డీతో జరిగిన పతకం పోరులో రాజిందర్ పరాజయం పొంది 4వ స్థానంలో మిగిలాడు.
పేస్-భూపతిజోడీకి తప్పని నిరాశ..
ఏథెన్స్ వేదికగా జరిగిన 2004 ఒలింపిక్స్ లో రెండుకాంస్య పతకాలు భారత్ కు దక్కకుండా పోయాయి. పురుషుల టెన్నిస్ డబుల్స్ లో భారత సూపర్ స్టార్ జోడీ
మహేశ్ భూపతి- లియాండర్ పేస్ కాంస్య పతకం పోరులో క్రొయేషియాజంట మార్కో యాన్సిచ్- ఇవాన్ జుబిసిచ్ ల చేతిలో పరాజయం పొంది 4వ స్థానానికి పరిమితమయ్యారు.
మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కిలోల విభాగంలో కుంజరాణిదేవి నాలుగోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్నాచ్ లో 82.5 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 107.5 కిలోల బరువెత్తి 4వ స్థానానికి పరిమితమయ్యింది.
2021 లండన్ ఒలింపిక్స్ పురుషుల షూటింగ్ 50 మీటర్ల రైఫల్ ప్రోన్ విభాగంలో 699.1 పాయింట్లతో నాలుగోస్థానం సాధించాడు. కాంస్య పతకం పోరులో 0.9 పాయింట్ల తేడాతో పరాజయం పొందాడు.
2016 రియో ఒలింపిక్స్ పురుషుల 10మీటర్ల ఏర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్ షూటర్ సెర్హీ కులిష్ కంటే 10.5 పాయింట్లు తక్కువ సాధించడంతో కాంస్యం అందుకొనే అవకాశాన్ని అభినవ్ కోల్పోయాడు.
దీప, సానియాలకూ చేదుఅనుభవం..
2016 రియో ఒలింపిక్స్ మహిళల జిమ్నాస్టిక్స్ వాల్టింగ్ విభాగంలో దీప కర్మాకర్ కాంస్య పతకం చేజార్చుకొంది.0.15 పాయింట్ల తేడాతో దీప చరిత్ర సృష్టించే అవకాశం కోల్పోయింది.
టెన్నిస్ మిక్సిడ్ డబుల్స్ లో సైతం భారతజోడీ సానియా మీర్జా- రోహన్ బొప్పన్న కాంస్య పతకం నెగ్గే అవకాశం చేజార్చుకొన్నారు. 4వ సీడ్ హోదాలో పతకం వేటకు దిగిన సానియా- రోహన్ జోడీని కాంస్యం పోరులో చెక్ జంట రాడెక్ స్టెపానెక్- లూసీ రాడిస్కో వరుస సెట్ల ఓటమితో కంగుతినిపించారు.
టోక్యో ఒలింపిక్స్ లో చేజారిన రెండు కాంస్యాలు..
2020 టోక్యో ఒలింపిక్స్ మహిళల గోల్ఫ్ లో భారత గోల్ఫర్ ఆదితి అశోక్..ఓ స్ట్ర్రోక్ తేడాతో కాంస్య పతకం కోల్పోయింది. 4వ రౌండ్ వైఫల్యంతో నాలుగోస్థానంతో సరిపెట్టుకొంది.
ఇక..మహిళల హాకీలో సైతం భారత్ కు చేదుఅనుభవం మిగిలింది. కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్ తో జరిగిన పోరులో భారత్ 3-4 గోల్స్ తేడాతో ఓటమిపాలయ్యింది.
చివరకు 4వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.
1920 నుంచి ప్రస్తుత 2024 ఒలింపిక్స్ మొదటి 8 రోజుల పోటీలు ముగిసే వరకూ భారత్ 19 కాంస్య పతకాలను చేజార్చుకోడం ఓ రికార్డు.