ప్రపంచకప్ కు పాక్ సైనికదళాల భద్రత!
అరబ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీకి పాకిస్థాన్ సైనికదళాలు భద్రత కల్పిస్తున్నాయి. మ్యాచ్ వేదికలు, వివిధజట్లు బస చేసిన హోటళ్ల వద్ద పహారాకాస్తున్నాయి.
అరబ్ దేశం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీకి పాకిస్థాన్ సైనికదళాలు భద్రత కల్పిస్తున్నాయి. మ్యాచ్ వేదికలు, వివిధజట్లు బస చేసిన హోటళ్ల వద్ద పహారాకాస్తున్నాయి...
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడాసంరంభం ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీకి ..ఈ భూఖండంలోనే అతిబుల్లి దేశం ఖతర్ ఆతిథ్యమివ్వడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 30 లక్షల జనాభా మాత్రమే కలిగిన ఖతర్ 200 బిలియన్ డాలర్ల భారీవ్యయంతో ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వడంతో పాటు..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
పాక్, టర్కీ దళాల అండతో...
ఖతర్ రాజధాని దోహానగరం నలుమూలలా వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏడు అత్యాధునిక స్టేడియాలను నిర్మించింది.అంతేకాదు..32 దేశాలకు చెందిన 650 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పాల్గొంటున్న నెలరోజుల ఈ పోటీలు చూడటానికి వివిధ దేశాల నుంచి 10 లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు. వీరందరికీ తగిన భద్రత కల్పించడానికి తగిన సిబ్బంది తమ దగ్గర లేకపోడంతో..ఖతర్ ప్రభుత్వం పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకొంది.
పాక్ దళాల పహారా...
పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఫుట్ బాల్ స్టేడియాలతో పాటు..జట్లు బస చేసిన హోటళ్ల దగ్గర పాకిస్థాన్ సైనిక దళాలు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకూ జరిగే ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలకు తమ సైనికదళాలు భద్రత కల్పించేలా ఖతర్ ప్రభుత్వం తమతో ఒక అవగాహనకు వచ్చినట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మరియుమ్ ఔరంగజేబ్ ప్రకటించారు.
ఖతర్ అమీర్ షేక్ తామిమ్ బిన్ హమాద్ అల్ థానీ ఆహ్వానం మేరకు తమ దేశప్రధాని షెబాజ్ షరీఫ్ ఆ దేశపర్యటనకు వెళ్లిన సమయంలో సైనికదళాల సాయం కోరినట్లు వివరించారు.
వివిధ అంశాలలో ప్రత్యేక శిక్షణ పొందిన తమ సైనికదళాలు ప్రస్తుతం ఖతర్ లో భద్రతావిధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు.
గత జులైలో టర్కీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సులేమాన్ సోయిలూ సైతం ఖతర్ లో పర్యటించి..ప్రపంచకప్ స్టేడియాలను పరిశీలించి వెళ్లారు. టర్కీకి చెందిన 3వేల 250 మంది భద్రతాఅధికారులు ప్రస్తుతం ఖతర్ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రకటించారు.
పాక్, టర్కీ దళాలతో పాటు నాటో దళాలు సైతం తమవంతుగా అత్యున్నతస్థాయి భద్రత కల్పిస్తున్నాయి. ప్రపంచకప్ ఫుట్ బాల్ ప్రారంభ, ముగింపు వేడుకల సమయంలో
వివిధ దేశాల అధినేతలు హాజరుకానున్న నేపథ్యంలో..కెమికల్, బయెలాజికల్,రేడియోలాజికల్, న్యూక్లియర్ దాడులను తిప్పికొట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన దళాలు సైతం ప్రపంచకప్ భద్రతా విధుల్లో పాల్గొంటున్నాయి.
డిసెంబర్ 18న జరిగే ఫైనల్ తర్వాత కొద్దిరోజులపాటు టర్కీ, పాకిస్థాన్ దళాల భద్రతా విధులు కొనసాగనున్నాయి. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్ కు ఖతర్ భారీమొత్తం ముట్టచెప్పే అవకాశం లేకపోలేదు.